శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

అందరి బంధువయ "భద్రాచల రామయ్య"

FILE
అందరి బంధువయ భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చేవాడయ్యా ఆ సీతా రామయ్య
కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య...!!

అని ఓ సినీ కవి అన్నట్లుగా శ్రీరామ చంద్రమూర్తి భక్తజన హితుడు, ఆదర్శ పురుషుడు, ఆరాధ్యనీయుడు. శ్రీరాముడికి ప్రపంచం మొత్తంమీదా లెక్కలేనన్ని ఆలయాలు ఉన్నప్పటికీ.. భద్రాచలంలోని సీతా లక్ష్మణ సమేత రామాలయం మాత్రం ప్రసిద్ధి చెందింది. రామ భక్తుడైన భక్త రామదాసు (కంచెర్ల గోపన్న) ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో కట్టించాడు.

ఖమ్మం జిల్లా కేంద్రానికి 125 కిలోమీటర్ల దూరంలోని ఏజెన్సీ నియోజకవర్గం కేంద్రమైన భద్రాచలంలో స్వామివారి ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ ఉత్తరం నుంచి తూర్పువైపుకు పరుగులు పెట్టే పవిత్ర గోదావరిలో స్నానం చేసి, శ్రీరాముడిని పూజస్తే మరుజన్మ అనేది లేకుండా మోక్షసిద్ధిని పొందుతారని భక్తుల విశ్వాసం. భద్రాద్రి ఆలయంలో మూల విరాట్ చతుర్భాజాలు కలిగిన సీతాదేవి, లక్ష్మణ సమేతంగా భక్తులకు దర్శనమిస్తుంటాడు.

ఆలయ చరిత్రను చూస్తే.. అరణ్య వాసంలో శ్రీరామచంద్రమూర్తి రామావతారంలో సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం చేస్తూ మార్గమధ్యంలో బడలికతో ఓ బండరాయిపై సేదదీరాడట. ఆ తరువాత ఆ బండరాయిని అనుగ్రహించి మరుజన్మలో మేరు పర్వతపుత్రుడు భద్రుడిగా జన్మించి, రామభక్తుడిగా ప్రసిద్ధి చెందుతావని వరమిచ్చాడట. అరణ్యవాసం తరువాత శ్రీరాముడు భద్రుడికి ఇచ్చిన మాటను మరచి వైకుంఠం చేరాడట.

అయితే భద్రగిరిపై తానున్న స్థలంలోనే ఒక బండరాయిపై కూర్చుని భద్రుడు ఘోరమైన తపస్సు చేశాడట. దాంతో భద్రుడికిచ్చిన మాట గుర్తొచ్చిన శ్రీరాముడు శంకు చక్రాలు ధరించి వైకుంఠ రాముడిగా భద్రాచలంలో వెలసినట్లు పురాణాల్లో చెప్పబడింది. ఇప్పటికీ భద్రాద్రిలో శ్రీరాముడు శంకు చక్రాలతో భక్తులకు దర్శనమీయటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. భద్రుడి తపోఫలంగా వెలసిన ప్రాంతం కాబట్టి, ఈ ప్రాంతానికి భద్రాచలం అని పేరువచ్చినట్లు తెలుస్తోంది.

FILE
మరోవైపు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో జన్మించిన కంచెర్ల గోపన్న మేనమామ సహాయంతో తానీషా కొలువులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తరువాత తహశిల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో శ్రీరామచంద్రుడు రామ భక్తురాలు దమ్మక్కకు కలలో కనిపించి తనకు ఆలయాన్ని కట్టాల్సిందిగా గోపన్నకు చెప్పమని పురమాయించాడట. ఆ విషయం దమ్మక్క ద్వారా తెలుసుకున్న గోపన్న ప్రజలనుంచి వసూలు చేసిన డబ్బును నిజాం ప్రభువుకు తెలియకుండా భద్రగిరిపై నేడు మనం దర్శిస్తున్న రామాయలయాన్ని కట్టించాడు. దాంతో గోపన్న కారాగారాశిక్షకు గురయ్యాడు.

ఆలయం కట్టించటంతోపాటు గోపన్న శ్రీరాముడికి, సీతాదేవికి, లక్ష్మణుడికి.. బంగారు నగలు చేయించాడు. చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ, పచ్చల పతకం, మంగళసూత్రం కూడా చేయించాడు. ఇప్పటికి కూడా ఆ రోజుల్లో రామదాసు చేయించిన నగలనే శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల్లో సీతా లక్ష్మణ సమేత శ్రీరాములకు అలంకరిస్తుంటారు. బందీగా ఉన్న రామదాసును విడిపించేందుకు శ్రీరామలక్ష్మణులు తానీషాకు చెల్లించిన రామమాడలో మిగిలిన రెండు మాడలు ఇప్పటికీ భద్రాచలం ప్రదర్శనశాలలోనూ, హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలోనూ ఉన్నాయి.

భద్రాద్రి ఆలయంలో ప్రతి సంవత్సరం ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, శ్రీరామ నవమి ఉత్సవాలను పెద్ద ఎత్తున వైభవంగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం, ముందు రోజు రాత్రి గోదావరీ నదీమతల్లి తీరంలో తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే ప్రతి ఏడాది చైత్రశుధ్ద నవవి రోజున శ్రీరామ నవమిని అభిజిత్ లగ్నంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

భద్రాద్రికి ఎలా వెళ్లాలంటే.. ఇక్కడికి రైలు, బస్సు మార్గాలున్నాయి. భద్రాచలానికి 40 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం రైల్వేలైన్ పేరుతో రైలు సౌకర్యం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు అన్నింటినుంచీ ప్రతిరోజూ బస్సు సౌకర్యం కలదు. ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు దేవస్థానం తరపున సత్రాలు, కాటేజీలు, వంద గదుల సత్రాలు ఆయా స్థాయిలవారికి అందుబాటులో ఉంటాయి.