శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu
Last Modified: బుధవారం, 6 ఆగస్టు 2008 (15:39 IST)

అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం

కర్నాటక రాష్ట్రంలో వెలసిన గోకర్ణం క్షేత్రానికి విశేషమైన ప్రాశస్త్యం ఉంది. ఇక్కడున్న శివలింగాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడి ఆత్మలింగంగా పేర్కొంటారు. భారతదేశంలోని గొప్ప శైవ క్షేత్రాలైన కాశీ, రామేశ్వరం క్షేత్రాల తర్వాత గోకర్ణంకు అంతటి విశేష ప్రాధాన్యం ఉంది.

గోకర్ణం క్షేత్ర విశేషాలు
అరేబియా సముద్ర తీరాన వెలసిన ఈ శైవ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. ఇక్కడ వెలసిన శివుని మహాబలేశ్వరుడిగా పేర్కొంటారు. శివుడు ఇచ్చిన ఆత్మలింగం ఈ ప్రాంతంలో కూరుకుపోయినపుడు అతి బలవంతుడు, పరాక్రమశాలి అయిన రావణాసురుడు సైతం బయటకు తీయలేక పోయాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

అందుకే ఇక్కడున్న శివ లింగాన్ని మహాబలేశ్వరుడు పిలవడం జరుగుతోందని భక్తుల విశ్వాసం. శివలింగంలో కొంత భాగం భూమిలో చొచ్చుకుపోయి ఉండడం ఈ క్షేత్రంలోని మరో విశేషం. అలాగే ఇక్కడున్ని శివలింగాన్ని కప్పి రాళ్లు ఉంటాయి. ఈ రాళ్లలో పై భాగంలో ఉన్న రాయికి ఆవు చెవి ఆకారంలో ఓ పెద్ద రంధ్రం ఉంటుంది.

ఇలా రాయికి ఉన్న రంధ్రం వల్లే దీనికి గోకర్ణం అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు. ఈ రంధ్రంలోంచి చేయి పెడితే లోపల ఉన్న శివలింగంలోని పై భాగం మనకు తగులుతుంది. అంతేకాకుండా ఈ రంధ్రం ద్వారా నీటిని పోస్తూ భక్తులే స్వయంగా శివునికి అభిషేకం చేయవచ్చు.


ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు దగ్గర్లో ఉన్న కోటితీర్థం రేవులో స్నానం చేసి శివాలయానికి వెనుకభాగంలో ఉన్న వినాయకుని తొలుత దర్శించుకుంటారు. అటు తర్వాతే శివుని దర్శించుకుని ఆయనకు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.

క్షేత్రంలోని ప్రత్యేకతలు
ఈ క్షేత్రంలో ప్రతి అరవై ఏళ్లకోసారి శివలింగానికి చుట్టూ ఉన్న రాళ్లను తొలగించి పూర్తి లింగానికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈ క్షేత్రానికి ఉన్న మరో విశేషం ఈ ఆలయంలోకి విదేశీయులకు ప్రవేశం నిషిద్ధం.

ఈ ఆలయానికి దగ్గర్లోనే ఉన్న అరేబియా సముద్రం ప్రకృతి అందాలకు నిలయంగా ఉంటుంది. ఇక్కడున్న నాలుగు బీచ్‌లు పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని సొంతం చేస్తాయి. వీటిలో ఓం అనే బీచ్ చాలా ముఖ్యమైంది. పైనుంచి చూస్తే ఓంకారం ఆకారంలో కన్పించడం ఈ బీచ్ ప్రత్యేకత.

ఈ బీచ్‌లో కొంతభాగం సముద్రంలోకి చొచ్చుకుపోయి ఉంటుంది. గోవాకు సమీపంలో ఈ గోకర్ణం ఉండడం వల్ల అనేకమంది విదేశీ పర్యాటకులు ఈ బీచ్‌లను సందర్శిస్తుంటారు.

వసతి, సౌకర్యాలు
గోకర్ణంలో వసతి, సౌకర్యాలు కాస్త ఖరీదైనవనే చెప్పవచ్చు. చిన్న చిన్న లాడ్జీలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. వీటితోపాటు ఇక్కడ సముద్ర తీరప్రాంతంలో కట్టబడిన స్వస్వరా రిసార్ట్ అనేది ముఖ్యమైంది. ఇక్కడ అన్ని సౌకర్యాలతో పాటు యోగా, ధ్యానం లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

రవాణా సౌకర్యాలు
కర్ణాటకలోని హుబ్లీ నుంచి దాదాపు 195 కిలోమీటర్ల దూరంలో ఈ గోకర్ణం క్షేత్రం ఉంది. హుబ్లీ నుంచి గోకర్ణం చేరాలనుకునే వారు అంకోలా అనే ప్రాంతాన్ని చేరుకుని అక్కడినుంచి గోకర్ణంకు వెళ్లాల్సి ఉంటుంది.