గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

అన్నపూర్ణేశ్వరి దివ్యశోభతో అలరారే "హోరనాడు"

FILE
భూమిమీది ప్రతి జీవికీ తిండిని ప్రసాదించే దేవత "అన్నపూర్ణేశ్వరి". అందుకే ఈ అమ్మవారిని దర్శించి, మనసారా ప్రార్థిస్తే జీవితంలో అన్నానికి లోటుండదని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమగల పార్వతీ అవతారమైన అన్నపూర్ణేశ్వరీ అమ్మవారు కర్నాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరుకు నైరుతీ దిశలో వంద కిలోమీటర్ల దూరంలోగల హోరనాడు ప్రాంతంలో కొలువై దివ్యశోభతో అలరారుతున్నారు.

హోరనాడు ఆలయంలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు పూర్వీకుల కథనం. ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరిగా కొలువబడే అమ్మవారి ఐదు అడుగుల విగ్రహం నాలుగు చేతులతో, ప్రసన్నవదనంతో అమృతమయమైన చూపులతో ముగ్ధమనోహరంగా ఉంటుంది. పీఠంపై దేవి గాయత్రితో, శంఖుచక్రాలతో ధరించి.. పద్మపీఠం అష్టగజ, కూర్మాలను కలిగి ఉంటుంది.

ఇక వరద హస్తంలో అన్నపాత్ర, అభయహస్తంలో వడ్డించే గరిటె ఉంటాయి. ఎంతసేపు చూసినా తనివితీరని సౌందర్యంతో అలరారే అమ్మవారిని దర్శించేందుకు అన్ని ప్రాంతాల భక్తులు తరలివస్తుంటారు. ఏకకాలంలో 400 మంది అమ్మవారిని దర్శించేందుకు వీలుగా ఆలయంలో తీర్థమండపం ఉంది. ఈ ఆలయంలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి ప్రతిరోజూ త్రికాల పూజలు జరుగుతుంటాయి.
మున్నార్‌ను తలదన్నే సౌందర్యం
మార్గమధ్యంలో కాఫీ తోటల సుగంధ పరిమళాలు, చల్లటి గాలి స్పర్శ, తీర్చిదిద్దినట్లుగా ఉండే పచ్చటి ప్రకృతిలో ప్రయాణం మాటల్లో వర్ణించేందుకు వీలుకాదు. కేరళలోని మున్నార్ సౌందర్యంకంటే రమణీయమైన ప్రకృతి శోభను తనలో ఇముడ్చుకున్న ఈ ప్రాంత సౌందర్యం నయనానందకరం...


మంగళ, శుక్రవారాల్లోనూ.. నవరాత్రుల సమయంలోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీకమాసంలో నవమి రోజున, హనుమజ్జయంతి, పంచమి, శ్రవణం తదితర శుభదినాల్లో అమ్మవారికి రోజంతా దీపోత్సవాలను చేస్తారు. ఈ సందర్బంగా పువ్వులతో అర్చించి.. వివిధ రకాల కూరగాయలు, పళ్లు, కొబ్బరికాయలు, అన్నప్రసాదాలతో అమ్మవారికిని నివేదన చేస్తారు.

ప్రతి సంవత్సరంలో మే నెలలో హోరనాడు ఆలయంలో రథోత్సవం కన్నులపండువగా జరుగుతుంటుంది. ఇక్కడ ఐదు రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హోరనాడు ఆలయ ప్రత్యేకత ఏంటంటే.. అమ్మవారి దర్శనానికి వెళ్లే పురుషులంతా చొక్కాలను తీసివేసి శాస్త్రోక్తంగా ఉత్తరీయాన్ని కప్పుకుని దర్శనానికి వెళ్ళాల్లి ఉంటుంది.

ఈ అమ్మవారి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ కుల, మత, వర్ణ, వర్గ బేధాలు లేకుండా ఉదయాంపూట ఫలహారాలు.. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్యాన్నదానం కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంటుంది. అమ్మ అనుగ్రహానికై వచ్చిన భక్తులు.. అన్న ప్రసాదాలను ప్రత్యేక అనుగ్రహ ప్రసాదంగా భావించి తృప్తిగా స్వీకరిస్తుంటారు.

హోరనాడు ఆలయానికి చేరుకునేందుకు శృంగేరి నుంచి కలశ ప్రాంతాల మీదుగా సాగిపోయే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. మార్గమధ్యంలో కాఫీ తోటల సుగంధ పరిమళాలు, చల్లటి గాలి స్పర్శ, తీర్చిదిద్దినట్లుగా ఉండే పచ్చటి ప్రకృతిలో ప్రయాణం మాటల్లో వర్ణించేందుకు వీలుకాదు. కేరళలోని మున్నార్ సౌందర్యంకంటే రమణీయమైన ప్రకృతి శోభను తనలో ఇముడ్చుకున్న ఈ ప్రాంత సౌందర్యం నయనానందకరం.

ఎలా వెళ్లాలంటే...
వివిధ ప్రాంతాల నుంచి కర్నాటక ప్రభుత్వ బస్సులు, ప్రైవేటు వాహనాలు విరివిగా తిరుగుతుంటాయి. బెంగళూరు నుంచి నెలమంగళ్, కునిగల్, హసన్, బైల్పూర్, మడికెరె, కొట్టిగెహరం, కలశ ప్రాంతాల మీదుగా హోరనాడు ఆలయాన్ని చేరుకోవచ్చు. మంగళూరు విమానాశ్రయం నుంచి షిమోగా రైల్వేస్టేషన్ అందుబాటులో గల రైలు మార్గం. కలశ నుంచి 7, చిక్‌మగళూరు నుంచి వంద, శృంగేరి నుంచి 75, బెంగళూరు నుంచి 330 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే హోరనాడు చేరవచ్చు.

వసతి తదితర విషయాలకు వస్తే..
ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలయ గెస్ట్‌హౌస్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే గదులు అవసరంలేని భక్తులు లగేజీ‌రూంలో తమ లగేజీలను పెట్టి ఆలయ ప్రాంగణంలోనే నిద్రించే సౌకర్యం కూడా కలదు. ఈ ఆలయానికి చేరుకునే మార్గ మధ్యంలో కుక్కి సుబ్రహ్మణ్యం, ధర్మశాల, శృంగేరి, ఉడిపి కృష్ణుడి ఆలయం, కొల్లూరు మూకాంబిక ఆలయాలు.. కలశ ప్రాంతంలోని కలశేశ్వర ఆలయాలను కూడా దర్శించవచ్చు.

ఈ విధంగా అన్ని సౌకర్యాలు కలిగిన హోరనాడు ఆలయ దర్శనంవల్ల, భక్తుల మనోభీష్టాలు నెరవేరి.. వారి జీవితంలో తిండికి లోటు లేకుండా ఉండేలా అన్నపూర్ణేశ్వరి అమ్మవారు కటాక్షిస్తారు. శాపగ్రస్తుడైన శంకరుడిని తన కృపా కటాక్షలతో అనుగ్రహించి శాపవిమోచనం కలిగించిన ఈ అమ్మవారిని దర్శించినంతటనే.. జీవితంలో కష్టాలు తొలగి శాశ్వతానందం సొంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఇంతటి మహిమాన్విత కరుణామయి అయిన శ్రీ అన్నపూర్ణేశ్వరిని మనము కూడా దర్శించేందుకు వెళ్లి వద్దాం రండి..!!