శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

ఆదిశిలలో వెలసిన భక్త సులభుడు "మల్దకల్ తిమ్మప్ప"..!!

FILE
కలియుగ వైకుంఠాన్ని తలపించే తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారు, ఏడు కొండలపైనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక రూపాలలో వెలసి తన భక్తులను పావనం చేస్తున్నాడు. ఏడుకొండలపై పాదం మోపకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో గల మల్దకల్ మండలంలో ఆదిశిలలో శ్రీనివాసుడు ఉద్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఒకే శిలలో స్వామివారు ఆంజనేయ, వరాహ, అనంతశయనమూర్తి రూపంలో వెలియటమే ఈ క్షేత్రం ప్రత్యేకత.

మల్దకల్ మండల కేంద్రంలో పవిత్ర కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య వెలసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలే కాకుండా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచీ, పక్క రాష్ట్రాల నుంచీ కూడా భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ మల్దకల్ ఆదిశిలా క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరిగే స్వామివారి రథోత్సవం కన్నులపండువగా సాగుతుంది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని స్థానికులు, భక్తులు మల్దకల్ తిమ్మప్పగా కొలుస్తుంటారు. సాధారణంగా వేంకటేశ్వరుడికి మొక్కుబడి చెల్లించుకోవాలంటే, ఎంత దూరంనుంచైనా సరే భక్తులు తిరుమల చేరుకుంటారు. కానీ మల్దకల్ వాసులు మాత్రం తిరుమల వెళ్లకుండా ఆయనతో సమానంగా తిమ్మప్పను కొలుస్తూ, మొక్కుబడులు అక్కడే తీర్చుకుంటారు. ఇకపోతే తెలిసో, తెలియకో ఆ ప్రాంతవాసులెవరైనా తిరుమల వెళితే వారి ఇంటిలో అశుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం.

ప్రతి యేడాది మార్గశిర శుద్ధ పంచమి రోజునుంచి మార్గశిర కృష్ణ తదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటిని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ఊరేగింపు, పల్లకి సేవల్లో పాల్గొంటారు. అలాగే ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజు రాత్రిన స్వామివారి రథోత్సవం శోభాయమానంగా జరుగుతుంది.

ఆలయ స్థల ప్రాశస్త్యాన్ని చూస్తే.. ఏడుకొండలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారికంటే ముందుగా మల్దకల్‌లో శ్రీవారు ఆదిశిలలో వెలసినట్లు బ్రహ్మాండ పురాణంలో పలు ఆధారాలున్నాయి. ఇక్కడ ఒకే శిలలో స్వామివారు ఆంజనేయ, వరాహా, అనంతశయనమూర్తి, శ్రీదేవి-భూదేవిలు వెలయటంతో ఈ క్షేత్రానికి విశేష ప్రాచుర్యం సంతరించుకుంది.

FILE
గతంలో నల్లసోమభూపాలుడు ఈ ప్రాంతానికి వేటకురాగా శిథిలమైన దేవాలయం ఒకటి కంటపడిందనీ, దాంతో ఆయనకు కొన్ని మహిమలు వచ్చాయనీ ప్రజలు చెబుతుంటారు. ఆ ఆలయాన్ని పునరుద్ధరించే సమయంలో ఓ బోయ బాలుడు తన సహాయ సహకారాలను అందించినందువల్ల అతడినే ఆ ఆలయానికి పూజారిగా నియమించినట్లు తెలుస్తోంది. అందుకనే నేటికీ బోయ వంశస్థులే ఈ ఆలయంలో పూజారులుగా వ్యవహరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే.. అయిజ, గద్వాల రోడ్డు మధ్యన గద్వాలకు 18 కిలోమీటర్ల దూరంలో మల్దకల్‌ ఆదిశిలా క్షేత్రం వెలిసింది. ఈ ఆలయం చేరుకునేందుకు గద్వాల, ఎమ్మిగ నూర్‌, రాయచూర్‌, వనపర్తి, కర్నూల్‌ డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.

మరోవైపు.. వేలాదిమంది భక్తులు తరలివచ్చే తిమ్మప్ప జాతరకు సౌకర్యాలు అంతంత మాత్రమే. మరుగుదొడ్లు, సౌకర్యాలు అసలే ఉండవు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతి గదులు లేనందున.. కర్ణాటకలోని ఇతర భక్తులు వాటి నిర్మాణాలు చేపట్టారు. దేవాలయం ప్రభుత్వ ఆదరణకు నోచుకోనందున అభివృద్ధికి అమడదూరంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ కళ్యాణ మండపం కొరకు భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో పేరెన్నికగన్న జాతరలలో మల్దకల్‌, కురుమూర్తి జాతరలు మంచి గుర్తింపు కలిగి ఉన్నాయి. జాతరలో పశువులు, ఇంటి సామగ్రి, రైతుల పనిముట్లు కలప, చిన్న పిల్లల ఆట వస్తువుల నుంచి పెద్దలకు ఉపయోగపడే పరికరాల వరకు లభిస్తాయి. వలస వెళ్లేవారు అధికం కావడంతో ఈ జాతరలో ట్యాంకు పెట్టెలకు భలే గిరాకీ ఉంటుంది.

రైతులు పండించిన పంట నుంచి వచ్చిన బియ్యంతో ముందుగా స్వామివారి బ్రహ్మోత్సవాల సంధర్భంగా దాసంగం ద్వారా నైవేద్యం చేస్తారు. కొత్త కుండలను తెచ్చి స్వామి వారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతనే భక్తులు బుజిస్తారు. ఇది ఈ జాతరలో ప్రత్యేక విశిష్టమైనదిగా చెప్పవచ్చు. చివరిగా చెప్పుకోవాల్సిందేంటంటే.. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన తిమ్మప్ప ఆలయాన్ని ప్రభుత్వం నేటివరకూ కూడా ప్రముఖ పుణ్యస్థలంగా గుర్తించలేదు. ఇప్పటికైనా ఈ ఆలయాన్ని గుర్తించి, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు, భక్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.