గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu
Last Modified: సోమవారం, 28 జులై 2008 (12:58 IST)

ఆరోగ్యాన్ని ప్రసాదించే గుణదల కొండ మేరీమాత

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో గల గుణదల కొండ మేరీ మాతను దర్శిస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే క్రీస్తు తల్లిగా పిలవబడే మేరీ మాత ఆలయమున్న ఈ ప్రాంతానికి క్రైస్తవులతో పాటు వివిధ మతాలకు చెందినవారు సైతం విచ్చేస్తుంటారు.

గుణదల కొండపై వెలసిన మేరీమాతను దర్శిస్తే వ్యాధులు నశించి ఆరోగ్యం సమకూరడమే కాకుండా జీవితంలో సకల సుఖాలు కల్గుతుందని భక్తులు చెబుతుంటారు. ఈ కారణంగానే ఫిబ్రవరి నెలలో జరిగే మూడురోజుల ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఈ కొండకు వస్తుంటారు.

తిరుణాల సందర్భంగా లక్షల సంఖ్యలో గుణదల కొండకు వచ్చే భక్తులతో ఈ ప్రాంతం విశేష ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది.

గుణదల కొండ విశేషాలు
ఈ కొండ పైభాగాన ఉన్న సహజసిద్ధ గుహలో మేరీమాత విగ్రహం ఏర్పాటు చేయబడి ఉంది. ఈ కొండపైకి చేరుకునే దారిలో దాదాపు 12 ప్రదేశాల్లో క్రీసును శిలువ వేసిన ముఖ్య విశేషాలను వివరిస్తూ స్థూపాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ స్థూపాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.


అలాగే కొండపై భాగంలో దాదాపు 18 అడుగుల ఎత్తైన శిలువ ఆకారాన్ని ప్రతిష్టించారు. ఈ శిలువను తాకితే పాపాలు కరిగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఈ కొండపై మేరీమాత ఆలయానికి సమీపంలో ఓ చర్చిని కూడా నిర్మించారు.

మేరీమాత ఉత్సవాల విశిష్టత
దాదాపు 1947 నుంచి ఈ ప్రాంతంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి తొమ్మిది నుంచి 11 వరకు మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో ఈ ఉత్సవాలను ఒక్కరోజు మాత్రమే నిర్వహించేవారు. అయితే ప్రతి ఏడాదీ పెరుగుతున్న రద్ధీని దృష్టిలో ఉంచుకుని గత కొన్నేళ్లుగా ఈ ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతోంది.

ఈ మేరీమాత ఉత్సవాలకు క్రైస్తవేతరులు తరలిరావడంతో పాటు కొన్ని హిందూ సాంప్రదాయాలు సైతం ఇక్కడ కన్పిస్తాయి. మూడురోజులపాటు సాగే ఈ ఉత్సవాల్లో భక్తులు తలనీలాలు సమర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం, పిల్లలకు అన్నప్రాసన చేయడం చేస్తుంటారు.

అలాగే పిల్లలు లేనివారు ఇక్కడున్న చెట్టుకు ఊయలలు కడుతుంటారు. వీటితోపాటు మొక్కులు తీర్చుకోవడం, గుడివద్దే నిద్రలు చేయడం లాంటివి కూడా ఇక్కడ మనం చూడవచ్చు.