శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

కలియుగ దైవం దివ్యక్షేత్రం : ద్వారక తిరుమల

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం చిన్న తిరుపతిగా భక్తులు పిల్చుకునే ద్వారక తిరుమల. తిరుమల తర్వాత భక్తులు ఈ చిన్న తిరుమలకు కూడా అదే రీతిగా ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందినది కావడం విశేషం.

దేవాలయ పురాణ విశేషాలు
ఇచ్చట శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభుగా వేలిశాడని పురాణాలు చెబుతున్నాయి. చీమలపుట్టలో కొలువైన శ్రీ స్వామివారిని ద్వారక అనే ఓ రుషి వెలుపలికి తీయడం వల్ల ఈ ప్రాంతానికి ద్వారకా తిరుమల అని పేరువచ్చిందని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా తిరుమలలోని శ్రీ స్వామివారిని పూజిస్తే వచ్చే ఇహ, పరలోక సౌఖ్యాలు ద్వారక తిరుమలలోని స్వామివారిని సేవించినా కలుగుతుందని భక్తుల నమ్మకం.

అంతేకాకుండా తిరుమలలో మొక్కిన మొక్కులను సైతం ఈ ద్వారక తిరుమల్లో తీర్చుకోవచ్చని భక్తులు చెబుతుంటారు. ఇక్కడ స్వామివారు రెండు విగ్రహాల రూపంలో దర్శనమివ్వడం విశేషం. ఓ విగ్రహం సంపూర్ణ రూపంతో ఉండగా, మరో రూపం సగభాగం మాత్రమే దర్శనమిస్తుంది.


ద్వారకుడు అనే రుషి చేసిన తపస్సుకు మెచ్చి తనపాద సేవ భాగ్యాన్ని స్వామివారు ఆ రుషికి కల్పించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడున్న స్వామివారి అర్ధభాగం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. అయితే పూర్తి విగ్రహాన్ని శ్రీరామానుజాచార్యులు ప్రతిష్టించారని భక్తుల విశ్వాసం.

దేవాలయ విశేషాలు
ద్వారక తిరమల్లోని దేవాలయం చారిత్రక విశిష్టతను కలిగి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న గుడిని మైలవరం జమిందార్లు కట్టించారని చరిత్ర చెబుతోంది. ఇక్కడి గుడిలోని స్వామివారికి రెండు కళ్యాణోత్సవాలు నిర్వహించడం ఆచారం. గుడిలో రెండు విగ్రహాలు ఉండడం వల్ల వైశాఖ, అశ్వయిజ మాసాల్లో వేర్వేరుగా కళ్యాణోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

అలాగే ఇక్కడి స్వామివారు చీమల పుట్ట నుంచి ఉద్భవించిన కారణంగా స్వామివారి కింద ఉన్న చీమల పుట్టకు ఎలాంటి ఆటకం కలగకూడదని స్వామివారికి ఎలాంటి అభిషేకాలు నిర్వహించకపోవడం విశేషం. ద్వారకా తిరుమలను దర్శించిన భక్తులు ఇచ్చట మరికొన్ని ఆలయాలను సైతం దర్శించవచ్చు.

ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంభిక ఆలయాలు ఉన్నాయి. ఇదికాకుండా సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, కుంకుళ్లమ్మ ఆలయం తదితర ఆలయాలను వీక్షించవచ్చు.

భక్తులకు వసతి సౌకర్యాలు
ప్రస్తుతం ద్వారకా తిరుమల అభివృద్ధి చెందుతున్న స్థితిలో ఉంది. అయితే ఇక్కడ సాధారణ వసతులు మాత్రం అందుబాటులో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు
ద్వారకా తిరుమల ఓ మండల కేంద్రం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏలూరు నుండి మూడు రూట్లలో ద్వారకా తిరుమల చేరుకోవచ్చు. ఏలూరు నుండి దాదాపు అన్ని సమయాల్లో ఇక్కడకు బస్సులు ఉన్నాయి.