శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

కళ్యాణ వెంకన్న దివ్య సన్నిధి నారాయణవరం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు పద్మావతీ సమైతుడై శ్రీ కళ్యాణ వేంకటేశ్వరునిగా వెలసిన దివ్యక్షేత్రం నారాయణవరం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది.

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడు నారాయణవరం పాలకుడైన ఆకాశరాజు పుత్రిక పద్మావతీ దేవిని వివాహమాడాడని అందుకే నారాయణవరం ఏడుకొండలవానికి అత్తగారి ఊరు లాంటిదని పురాణాలు చెబుతున్నాయి.

క్షేత్ర పురాణం
వైకుంఠాన్ని వీడిన మహా విష్ణువు వెంకటేశ్వరునిగా వకులమాత వద్ద పెరుగుతున్న సమయంలో ఓ సారి అడవిలోని ఓ ఏనుగును తరుముతూ వేంకటేశ్వరుడు నారాయణవరం చేరుకోవడం జరిగింది. అలా నారాయణవరం చేరుకున్న వేంకటేశ్వరుడు అక్కడ ఉద్యానవనంలో చెలికత్తెలతో వన విహారం చేస్తున్న పద్మావతిని చూడడం ఆమెను ప్రేమించడం జరిగింది.

దీంతో వేంకటేశ్వరుడు తన తల్లి అయిన వకులమాత చెంతకు చేరి పద్మావతిని తాను ఇష్టపడుతున్న విషయాన్ని తెలియజేశాడు. అటుపై వకులమాత ఆకాశరాజు చెంతకు చేరి వేంకటేశ్వరుని గురించి తెలియజెప్పి పద్మావతితో వెంకటేశ్వరుని వివాహం జరిపించింది.

ఇలా పద్మావతిని వివాహం చేసుకున్న ఏడుకొండలవాడు కళ్యాణ వేంకటేశ్వరునిగా ఇక్కడ కొలువైయ్యారని పురాణాలు చెబుతున్నాయి.

ఆలయ విశేషాలు
కళ్యాణ వేంకటేశ్వరుడు కొలువైన ఈ క్షేత్రానికి ఇటీవల భక్తుల తాకిడి ఎక్కువైంది. తిరుమలను సందర్శించిన భక్తుల్లో చాలా భాగం నారాయణవరంలోని కళ్యాణ వేంకటేశ్వరున్ని కూడా దర్శించడం ఆనవాయితీగా మారింది. అలాగే టీటీడీ బోర్డు చేపట్టిన ఆలయ సందర్శన ప్యాకేజీలో తిరుమల పరిసరాల్లో ఉన్న వివిధ దేవాలయాల సందర్శనలో భాగంగా ఈ దేవాలయాన్ని కూడా సందర్శింపజేస్తున్నారు.


నారాయణవరంలో వెలసిన ఈ దివ్య క్షేత్రంలో అనేక విశేషాలున్నాయి. ఆలయంలోకి ప్రవేశించే ప్రదేశంలో నిర్మించబడిన పెద్ద గాలి గోపురం భక్తులకు చక్కటి అనుభూతి మిగులుస్తుంది. అలాగే గర్భగుడిలోని నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం సైతం భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతుంది.

అలాగే పెద్దదైన ఈ ఆలయ ప్రాకారం లోపలో ఓ వైపు పద్మావతీ అమ్మవారు కొలువై ఉన్నారు. వీరిద్దరితో పాటు ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతా మూర్తులు కొలువై ఉన్నారు. కళ్యాణ వేంకటేశ్వరుడు కొలువైన ఈ దివ్యక్షేత్రానికి అతి సమీపంలో అనేక ఆలయాలు కూడా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు
తిరుపతి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం పుత్తూరు అనే పట్టణం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. విరిగిన ఎముకలకు చికిత్స చేసే ప్రదేశంగా పుత్తూరు ఆంధ్రప్రదేశ్ వాసులకు సుపరిచితమే.

ఇన్ని విశేషాలున్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారు తిరుమలలో లభించే ఆలయ దర్శన ప్యాకేజీతో సందర్శించగల్గితే మిగిలిన ఆలయాలను కూడా దర్శించగల్గిన అనుభూతి లభిస్తుంది.