శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu
Last Modified: మంగళవారం, 22 జులై 2008 (13:58 IST)

కూర్మావతార దివ్య క్షేత్రం శ్రీకూర్మం

మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో కూర్మావతారానికి ఓ విశిష్టత ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినపుడు కవ్వంగా వాడిన పర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా ఉండడానికి విష్ణువు కూర్మ రూపుడై పర్వతాన్ని తన వీపుపై మోశాడని పురాణాలు చెబుతున్నాయి.

అలా మహా విష్ణువు అవతారాల్లో విశిష్ట స్థానాన్ని ఆక్రమించిన కూర్మావతారానికి దేశంలోనే ఒకే ఆలయం మాత్రమే ఉంది అదే శ్రీకూర్మం క్షేత్రం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంకు దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయం ఉన్నది ఓ చిన్న గ్రామమే అయినా ఆలయానికి మాత్రం చారిత్రాత్మక విశిష్టత ఉంది.

ఆలయ విశేషాలు
శ్రీకూర్మం గ్రామంలో వెలసిన ఈ దివ్యక్షేత్రం దాదాపు నాలుగో శతాబ్ధంలో నిర్మించబడినట్టుగా దేవాలయ గోడలపై ఉన్న శిలా శాసనాలు చెబుతున్నాయి. విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పసంపదకు ఖజానాగా ఉండడం విషేశం. ఆలయానికి పెద్దగా భక్తులు తాకిడి లేకపోయినా ఆలయం మాత్రం చూచి తీరాల్సినంత అద్భుతంగా ఉంటుంది.

ఈ ఆలయంలో ఉన్న స్థంబాలు, గోడలు, ఆలయ శిఖరాలపై చెక్కబడిన శిల్పాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉండి భక్తుల మనసులో చెదిరిపోని స్థానాన్ని సంపాదిస్తాయి. అలాగే ఆలయానికి కొద్ది దూరంలో ఓ పెద్ద కోనేరు ఉంది. దీనిని శ్వేత పుష్కరిణి అని పిలుస్తుంటారు. దీనిలో శ్రీ కృష్ణుడు గోపికా సమేతుడై జలకాలాడడని చెబుతుంటారు.


శ్రీకూర్మం క్షేత్రాన్ని గతంలో బలరాముడు ఓసారి దర్శించుకున్నాడట. ఈ సందర్భంలో ఈ ప్రాంతానికి రక్షకుడైన భైరవుడు బలరామున్ని అడగించాడట. దానితో కోపం వచ్చిన బలరాముడు కూర్మ అవతారంతో కూడిన క్షేత్రం ఇంకెక్కడా ఉండకుండా శపించాడట. అందుకే శ్రీకూర్మంలో తప్ప కూర్మావతార దేవాలయం దేశంలో మరెక్కడా కన్పించదని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే ఈ దేవాలయంలో మరో విశేషం కూడా ఉంది. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో కూర్మావతారుడైన స్వామివారు ద్వారానికి నేరుగా కాకుండా ఓ పక్కగా ఆసీనుడై ఉంటారు. దీనివల్ల గర్భగుడి బయటినుంచి స్వామి కన్పించడు. అందుకే ఈ క్షేత్రంలో స్వామిని దర్శించుకోవాలంటే భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించాలి. అప్పుడే గర్భగుడిలో ఓ పక్కగా ఉన్న స్వామివారిని దర్శించుకోగలం.

వసతి, రవాణా సౌకర్యాలు
శ్రీకూర్మం చాలా చిన్న గ్రామం. భక్తులకు ఇచ్చట ఎలాంటి సౌకర్యాలు లభించవు. తినుబండారాలు, పూజ సాముగ్రి అమ్మే రెండు మూడు చిన్న దుకాణాలు తప్ప ఈ ప్రాంతంలో మరేమీ అందుబాటులో లేవు. ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా దగ్గర్లో ఉన్న శ్రీకాకుళం చేరుకోవాల్సిందే.

శ్రీకాకుళం బస్టాండ్ నుంచి శ్రీకూర్మానికి నేరుగా వెళ్లే బస్సులు ఉన్నాయి. శ్రీకాకుళం నంచి శ్రీకూర్మానికి కేవలం 13 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. కాబట్టి భక్తులు తొలుత శ్రీకాకుళం చేరుకుని అక్కడినుంచి శ్రీకూర్మం చేరుకోవాల్సి ఉంటుంది.