శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

కోర్కెలు తీర్చే జొన్నవాడ కామాక్షి తాయి

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా జొన్నవాడ కామాక్షి తల్లిని భక్తులు పేర్కొంటుంటారు. నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణానికి సమీపంలో వెలసిన జొన్నవాడ క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతుంటుంది. తమ కోర్కెలను ముడుపుగా కడితే అమ్మ అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం.

క్షేత్ర విశేషాలు
పవిత్ర పెన్నా నది తీరాన ఈ క్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రంలో కొలువైన పార్వతీదేవిని కామాక్షి తాయిగాను, శివుని మల్లికార్జునిడిగాను పిలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు ఈ క్షేత్రంలోని కామాక్షీ తల్లిని పిలుస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు లేనివారు ఈ క్షేత్రంలోని కామాక్షి తల్లిని సేవిస్తే తప్పక పిల్లలు పుడతారని భక్తుల విశ్వాసం.

ఇందుకోసం ఈ ఆలయంలో ఇచ్చే కొడిముద్దలను స్వీకరించడానికి పిల్లలు లేని భక్తులు బారులు తీరుతుంటారు. కామాక్షి తల్లికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహించే సమయంలో బియ్యం, పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని అందరి దేవతలకు నివేదించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. దీనినే కొడిముద్ద అంటారు.


ఈ కొడిముద్దను స్వీకరించి భుజిస్తే తప్పకుండా పిల్లలు పుడుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ద్వాజా అవరోహణం సమయంలో కూడా ఈ కొడి ముద్దలు ఇస్తుంటారు. దీంతోపాటు సంతానం కోసం వేడుకునే భక్తులు జొన్నవాడలో వరపడటం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

ఇందులో భాగంగా దేవాలయానికి సమీపంలో ఉన్న పెన్నా నదిలో స్నానం చేసి తడిబట్టలతో అమ్మవారిని సేవిస్తారు. ఇలా తమ కోర్కె నెరవేరేవరకు చేస్తుంటారు. పురాణ ప్రసశ్త్యం ఉన్న ఈ క్షేత్రాన్ని ఆదిశంకరులవారు ప్రతిష్టించినట్టుగా పురాణాలు పేర్కొంటున్నాయి. శక్తి క్షేత్రాల్లో ఒకటిగా జొన్నవాడ క్షేత్రం విలసిల్లుతోంది.

దేవాలయం విశేషాలు
దేవాలయం ప్రాంగణంలో కామాక్షి తాయి, మల్లిఖార్జుని సన్నిధులు ఉన్నాయి. అలాగే ఇతర దేవతలు సైతం ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. విశాలంగా ఉండే ఈ ఆలయ పరిసరం భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఆలయం వెలుపల చిన్నపాటి దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెద్దస్థాయి సౌకర్యాలు మాత్రం ఇక్కడ లేవనే చెప్పవచ్చు.

సౌకర్యవంతమైన వసతి కావాలంటే మాత్రం దగ్గర్లో ఉన్న నెల్లూరుకు చేరుకోవాల్సిందే. నెల్లూరు నుంచి జొన్నవాడకు కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రమైనందున ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.