బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

త్రిమూర్తులే "వీరబ్రహ్మేందులు"గా ఉద్భవించిన వైనం..!!

FILE
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు అనేక అవతారాలలో అవతరిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అవతరించిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే కలియుగంలో ప్రజలను జాగృతం చేసేందుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిగా అతరించారు.

ఆ రోజుల్లో సమాజంలో నెలకొన్న అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ఉద్భవించిన భగవత్ స్వరూపమే శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈయన హిందూ-ముస్లిం సఖ్యత, సర్వమానవ సమానత్వం, సహపంక్తి విందులు పాటించటంతోపాటు కాలజ్ఞానాన్ని బోధించేవారు. శాంతి అభ్యుదయాలను నెలకొల్పేందుకు, లోక కళ్యాణార్థం తపస్సు చేసేందుకు వీర బ్రహ్మేంద్ర స్వామివారు సజీవ సమాధి అయ్యారు.

బ్రహ్మేంద్ర స్వామి జన్మ రహస్యాన్ని చూస్తే.. కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మాండపురంలో క్రీ.శ. 1608న జన్మించారు. కార్తీశుద్ధ ద్వాదశి రోజున.. పరిపూర్ణమాచార్యులు, ప్రకృతాంబలకు ఈయన జన్మించారు. పుట్టగానే తండ్రిని కోల్పోయిన వీర బ్రహ్మేంద్రుడిని అత్రి మహామునికి అప్పగించి తల్లి ప్రకృతాంబ కూడా చనిపోతుంది.

అక్కడికి దగ్గరలో గల పాపాగ్ని పీఠంలోని వీరభోజయ్య స్వామి, వీరపాపమాంబలు తమకు సంతానం లేరు కాబట్టి, ఆ బాలుడిని తమకివ్వాలని అత్రి మహామునిని వేడుకున్నారు. దీంతో వారి పరిస్థితిని అర్థం చేసుకున్న అత్రి మహాముని వారికి ఇచ్చేస్తాడు. ఆ బాలుడికి వీరయ్య అనే పేరుపెట్టుకుని వీరభోజయ్య దంపతులు సంతోషంగా పెంచుకుంటారు.

5వ ఏట విద్యాభ్యాసం నేర్చుకున్న వీరయ్య, 14వ ఏట వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా బనగానపల్లెకు చేరుకుని తపస్సు చేయసాగాడు. ఆ క్రమంలోనే ఆ ఊర్లోని గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో గోవులకాపరిగా పనికి కుదిరాడు. అక్కడ పశువులను కాస్తూ, సమీపంలోని రవ్వలకొండలోగల గుహలో కూర్చుని తాటాకులపై భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కాలజ్ఞాన గ్రంథాన్ని రచించాడు.

కలియుగంలో 5వేల సంవత్సరాల తరువాత జరిగే వింతలను గూర్చి ఆయన తన కాలజ్ఞానంలో తెలిపారు. అప్పట్లో బనగానపల్లె నవాబుకు తమ మహిమలను తెలిపిన వీరయ్య, కడపజిల్లా బద్వేలు తాలూకాలోగల కందిమల్లాయపల్లెకు చేరుకుని అక్కడే ఓ కుటీరాన్ని నిర్మించుకుని జీవించసాగాడు. ఇక్కడ సేద్యం చేస్తూ జీవించిన ఆయన రాత్రివేళల్లో గ్రామంలోని ప్రజలకు కాలజ్ఞానం బోధించేవారు. అలా ఆయన చెప్పినవాటిల్లో ఇప్పటికే కొన్ని జరిగిపోయాయి కూడా.

ఆ తరువాత కడపజిల్లా పెద్ద కొమ్మెర్ల గ్రామానికి చెందిన శివకోటయ్య కుమార్తెను పెళ్లి చేసుకున్న వీరయ్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె వీర నారాయణమ్మ సంతతికి చెందినవారే జీవిస్తూ ఉన్నారు. ఆయన కుమారులకు ఆయన పెట్టిన శాపం వల్లనే సంతానం కలుగలేదనీ, అందుకే కుమారుల తరపున ఎవరూ మిలగలేదని చెబుతుంటారు.

కాలజ్ఞానాన్ని బోధిస్తూ వీరయ్య వీర బ్రహ్మేంద్ర స్వామిగా మారిన అనంతరం.. ఆయన కులమతాలకు అతీతంగా కక్కయ్య అనే దళితుడిని తన శిష్యుడిగా చేర్చుకున్నారు. అలాగే బ్రహ్మంగారి మఠానికి 25 కిలోమీటర్ల దూరంలోని ముడుమాల అనే గ్రామంలో దూదేకుల సిద్ధయ్య అనే ముస్లింను కూడా తన ప్రియ శిష్యుడిగా చేర్చుకుని గ్రామాల్లో తిరుగుతూ కాలజ్ఞానం బోధించేవారు.

అలా తిరుగుతున్న క్రమంలో కడప నవాబుకు తన మహిమలను తెలిపిన బ్రహ్మంగారు హిందూ, ముస్లింల ఐక్యత కోసం కృషి చేశారు. అనంతరం కాలజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి సంఘ సంస్కర్తగా ఖ్యాతిని పొందారు. 1693వ సంవత్సరంలో దాదాపు తన 90 సంవత్సరాల వయసులో బ్రహ్మంగారు కంది మల్లాయపల్లెలో సజీవ సమాధి అయ్యారు. నేడు ఆయన సజీవ సమాధి నేడు బ్రహ్మంగారిమఠంగా ప్రముఖ యాత్రా స్థలంగా వెలుగొందుతోంది.

మామూలు మనిషిగా జన్మించి దైవత్వం పొందిన వీర బ్రహ్మేంద్ర స్వామికి ప్రతిరోజూ ఉదయం అభిషేకం, పూజ, మధ్యాహ్నం మహానివేదన , రాత్రికి పూజా కార్య క్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు స్వామికి ముఖ్య ప్రసాదంగా పప్పన్నం అర్పిస్తుంటారు. ప్రస్తుతం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కుమార్తె వీరనారాయణమ్మకు చెందిన కుమారులు మఠానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు.

బ్రహ్మంగారిమఠంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి యేడాది మహాశివరాత్రి పర్వదినం రోజున "కల్యాణ ఉత్సవాల" పేరుతో దాదాపు 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి. అలాగే ఆయన సజీవ సమాధి నిష్ట వహించిన రోజుకు గుర్తుగా.. వైశాఖ శుద్ధ దశమినాడు ఏప్రిల్‌, మే నెలలలో ఆరాధనా మహోత్సవాలు.. ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.