శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

నర్మదానది జన్మస్థానం... అమర్‌కంటక్

భారతదేశంలో పుణ్యక్షేత్రాలతో పాటు పుణ్య నదులకూ కొదవలేదన్న సంగతి తెలిసిందే. ప్రతీ ప్రాంతంలో ఏదో ఓ నది పుణ్యనదిగా విలసిల్లుతూ భక్తులకు జన్మరాహిత్యాన్ని కల్గించడంలో తమ వంతు పాత్ర పోషిస్తుంటాయి. అలాంటి పుణ్య తీర్థాలను దర్శించినపుడు మన మనసుకు ఎంతటి హాయి చేకూరుతుందో అందరికీ తెలిసిందే.

అలాంటి పుణ్య తీర్ధాల్లో మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ ప్రాంతంలో వెలసిన నర్మదానది కూడా ఒకటి. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఈ అమర్‌కంటక్ కొలువై ఉంది. నర్మదానది జన్మస్థానంగా ఉన్న ఈ ప్రాంతంలో నర్మదా మాత ఆలయం కూడా ఉంది. ఇక్కడి నర్మదా మాత ఆలయాన్ని, సమీపంలోని ఇతర దేవాలయాలను దర్శించేందుకు భక్తులు విరివిగా వస్తుంటారు.

అమర్‌కంటక్ విశేషాలు
అమర్‌కంటక్ సముద్ర మట్టానికి దాదాపు 1060 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాతంలో వెలసిన మైకెల్ కొండల్లో పుట్టే నర్మదా నది వింధ్య, సాత్పురా పర్వత పంక్తుల మధ్యన దాదాపు 1300 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదానది విశిష్టత గురించి ఈ ప్రాంతంలో వెలసిన దేవాలయాల గురించి స్థానికంగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.


పురాణకాలంలో పురూరవుడనే రాజు స్వర్గలోక ప్రాప్తి కోసం శివుని ధ్యానిస్తూ ఘోర తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతని కోరిక మేరకు నర్మదానదిని భూమి మీదకు పంపాడట. ఆ నర్మదను తన చేతులతో తాకిన పురూరవుడు స్వర్గ ప్రాప్తి పొందాడన్నది ఓ కథ.

ఈ కథ ఆధారంగానే ఇక్కడివారు నర్మాదానది చాలా పవిత్రమైనదని భావిస్తారు. సరస్వతిలో మూడుసార్లు, యమునలో ఏడుసార్లు గంగలో ఓసారి స్నానం చేస్తే లభించే పుణ్యఫలం నర్మదను చూచినంతనే కల్గుతుందన్నది ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.

నర్మదామాత విశేషాలు
నర్మదానది జన్మస్థానమైన ఈ ప్రదేశంలో నర్మదామాత ఆలయం కలదు. ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాతే ఈ చుట్టుపక్కల ఉన్న ఇతర దేవాలయాలను దర్శించాలన్నది ఓ నమ్మకం.

కపిలధార విశేషాలు
అమర్‌కంటక్ ప్రాతం నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నూరడుగుల ఎత్తు నుంచి నర్మదానదికి సంబంధించిన ఓ పాయ జలపాతంగా దూకుతుంటుంది. ఈ జలపాతం హోరు ఓంకార శబ్ధంతో ధ్వనిస్తుందని ఇక్కడివారు చెబుతారు.

రవాణా సౌకర్యాలు
అమర్‌కంటక్ చేరాలంటే ముందుగా బిలాస్‌పూర్ చేరుకోవాలి. బిలాస్‌పూర్ నుంచి అమర్‌కంటక్‌కు సుమారు 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బిలాస్‌పూర్ నుంచి అమర్ కంటక్ వెళ్లేందుకు అన్ని రకాల వాహన సౌకర్యాలు లభిస్తాయి. బిలాస్‌పూర్ నుంచి అమర్ కంటక్ వెళ్లే దారి మొత్తం అరణ్యం మధ్యగా సాగుతుంది. ప్రకృతి ఆరాధకులకు ఈ ప్రయాణం ఓ మరపురాని అనుభూతిగా మిగులుతుంది.