శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

నవబ్రహ్మలకు నిలయం.. దక్షిణ కాశీ క్షేత్రం "ఆలంపూర్"

FILE
అరవైనాలుగు ఘట్టాలు, 18 తీర్థాలతో, అష్టాదశ శక్తి పీఠాలతో అలరారుతున్న "ఆలంపూర్‌" దక్షిణ కాశిగా కొనియాడబడుతోంది. శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా భాసిల్లుతున్న ఆలంపూర్‌ తుంగభద్రానది తీరంలో ఉండే కర్నూలుకు 15 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. దక్షిణ భారత దేశంలోని అనేక క్షేత్రాలలో ఆలంపూర్‌ను మాత్రమే కాశీ క్షేత్రంతో పోలుస్తూ దక్షిణ కాశిగా పిలుస్తుంటారు.

కాశీ క్షేత్రంలో గంగానది ఉంటే, ఆలంపూర్‌లో తుంగభద్రా నది ఉంది. కాశీలో విశ్వేశ్వర, విశాలాక్షులు ఉంటే, ఆలంపూర్‌లో బాలబ్రహ్మేశ్వర, జోగులాంబలు కొలువైయున్నారు. కాశీ సమీపంలోని ప్రయాగలో గంగా-యమునల సంగమం జరిగితే.. ఆలంపూర్‌లో తుంగభద్ర-కృష్ణా నదులు కలిసి సంగమేశ్వరంలో కలుస్తాయి. కాశీలో వరుణ-అసి అనే నదులు సంగమిస్తే.. ఆలంపూర్‌లో వేద-నాగవతి నదులు కలుస్తాయి. కాశిలో ఉన్నట్లే 64 ఘట్టాలు, 18 తీర్థాలు, అష్టాదశ శక్తి పీఠాలు ఆలంపూర్‌లో కూడా ఉన్నాయి కాబట్టే దీనిని "దక్షిణ కాశి"గా అభివర్ణిస్తుంటారు.

శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామివారి దివ్యక్షేత్రమైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా చెప్పబడే ఆలంపూర్‌ గురించి ఎన్నో రకాల స్థల పురాణాలున్నాయి. పూర్వం ఆలంపూర్‌ క్షేత్రాన్ని "హతంపుర" అని పిలిచేవారట. అదే కాలక్రమంలో అల్లంపురగా, ప్రస్తుతం పిలువబడే ఆలంపూర్‌గా రూపాంతరం చెందినట్లు చెబుతుంటారు. బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ ఆలంపూర్‌ "నవబ్రహ్మ" ఆలయాలకు ప్రసిద్ధి.

ఈ ఆలయాల నిర్మాణం చాళుక్య రాజైన రెండవ పులకేశి పరిపాలనా కాలంలో మొదలై సుమారు 200 సంవత్సరాలపాటు సాగినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఎత్తైన విమానం, గర్భాలయ ప్రవేశ ద్వారబంధాలకు చిత్రాలంకార శిల్పాలు, ద్వారపాలకులుగా గంగాయమునల విగ్రహాలుంటాయి. అంతేగాకుండా గుడి పై భాగంలో ఉసిరికాయ ఆకృతిని పోలిన శిలను ఉంచి, దానిపై శిఖరాన్ని ఏర్పర్చిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఆలయ సముదాయంలోని ప్రధానమూర్తులను బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మలుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఇవన్నీ శివలింగాలే కావటం గమనార్హం. అయితే ఈ శివలింగాలను బ్రహ్మ పేరుతో ఎందుకు పిలుస్తారో తెలిపే ఆధారాలు మాత్రం అందుబాటులో లేవు.

అయితే బాలబ్రహ్మదేవుడు తపస్సుచేసి లింగాన్ని ప్రతిష్టించినందున బ్రహ్మేశ్వరుడని పేరొచ్చినట్లుగా చెబుతుంటారు. నిత్య పూజలు జరిగేదీ కూడా ఈ ఆలయంలోనే. మూలవిరాట్‌ అయిన స్వామివారి లింగము రుద్రాక్షలతో రూపొందించిన అద్భుత లింగము. భక్తులు ఎంతనీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటికి రాదని చెబుతుంటారు.

FILE
ఈ నవబ్రహ్మ ఆలయ సముదాయంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైన జోగులాంబను పూజిస్తుంటారు. అయితే ఈ దేవికి గతంలో ఆలయం ఉండేది కాదు. బాలబ్రహ్మేశ్వరాలయంలోనే ఒక ప్రక్కగా ఉన్న చిన్న గదిలో, ఒక గూడు వంటిది ఏర్పాటు చేసి, అందులోనే అమ్మవారిమూర్తిని ఉంచి పూజలు చేస్తూ ఉండేవారు. ఈ మధ్యనే అమ్మవారికి ప్రత్యేకంగా ఆలయం నిర్మించారు. అష్టాదశ శక్తిపీఠాలు 18లో నాలుగు మన రాష్ట్రంలోనే ఉండటం, అందులోనూ జోగులాంబ కూడా ఒకరు కావడం తెలుగువారు గర్వించదగ్గ అంశం.

ఇక్కడ 9వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా కలదు. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో కలవు. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.

అలాగే కుమార బ్రహ్మాలయానికి వెనుక సిద్ధుల మఠంలో ఉన్న ప్రభుత్వ పురావస్తు సంగ్రహాలయం తప్పక దర్శించాల్సిన ప్రదేశం. ఆలంపూర్‌, దాని పరిసర ప్రాంతాలలో లభించిన దేవతా మూర్తుల శిల్పాలు, శిలాశాసనాలను తెచ్చి ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ త్రిముఖ మహేశ్వరమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకా మహిషాసుర మర్దిని, సూర్యుడు, నటరాజు, శివమూర్తులు, నంది, భూదేవి, కార్తికేయుడు, వీరగల్లులు ఇత్యది మూర్తులు చెప్పుకోదగినవి.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా కృష్ణానదిలో ముంపుకు గురవుతున్న సంగమేశ్వరాలయాన్ని పునాదులతో సహా ఒక్కోక్కరాయిని తొలగించి ఆలంపూర్‌లోని వేరొక ప్రదేశంలో యథాతథంగా నిర్మించారు. ఇలా పునర్నిర్మించిన ఆలయాల్లో సంగమేశ్వరాలయం ప్రపంచంలోనే రెండవది కావడం విశేషంగా చెప్పవచ్చు.

ఆలంపూర్ ఎలా వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి నేరుగా ఆలంపూర్ చౌరస్తాకు కర్నూలు మార్గంలో 210 కిలోమీటర్ల దూరం బస్సులో ప్రయాణించాలి. చౌరస్తా నుంచి నుంచి ఆలంపూర్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే కర్నూలు నుంచయితే ముప్పై కి.మీ. దూరంలో ఉండే ఆలంపూర్‌కు ప్రతి అరగంటకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆలంపూర్ చౌరస్తా నుంచి 6 రూపాయలు, హైదరాబాదు నుంచి 110 రూపాయలు ప్రయాణ ఛార్జీలుంటాయి.

ఇక బస విషయానికి వస్తే.. ఆలంపూర్‌ చిన్న ఊరు కాబట్టి వసతి సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. కర్నూలు నుంచి వచ్చి ఆలంపూర్‌ను దర్శించుకుని తిరిగి కర్నూలు వెళ్లి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.