శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

పంచారామ క్షేత్రం... కుమారభీమారామం

ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు శైవ క్షేత్రాలు పంచారామాల పేరుతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రదేశాల్లో వెలసిన ఈ క్షేత్రాలను దర్శిస్తే సకల పాపాలు హరించిపోతాయని భక్తుల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో గల అమరారామం, ద్రాక్షారామం, భీమవరంలోని భీమారామం, సామర్లకోటలోని కుమారభీమారామం, పాలకొల్లులోని క్షీరారామంలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి.

పంచారామాల చరిత్ర
శివుని కుమారుడైన సుబ్రమణ్యస్వామికి తారకాసురుడనే రాక్షసునికి మధ్య ఆ కాలంలో భీకరయుద్ధం జరిగింది. ఈ యుద్ధం సందర్భంగా సుబ్రమణ్య స్వామి ఆ రాక్షసుని సంహరించాడు. సుబ్రమణ్య స్వామి చేతిలో మరణించిన తారకాసురుడి గొంతులో ఎప్పుడూ ఓ శివలింగం ఉండేదట.

సుబ్రమణ్యస్వామి చేతిలో తారకాసురుడు సంహరించిన సమయంలో అతని కంఠంలోని శివలింగం బయటపడి పగిలి ఐదు ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడిందట. అలా ఆనాడు వివిధ ప్రదేశాల్లో పడ్డ ఐదు శివలింగం ముక్కలే పంచారామాలై విలసిల్లుతున్నాయని పురాణాలు చెబుతున్నాయి.

కుమారభీమారామం విశేషాలు
పంచారామాల్లో ఒకటైన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట అనే మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలో భీమవరం అనే ప్రాంతంలో ఉంది. సామర్లకోటలోని కుమారభీమారామం చూడడానికి కాస్త పాత దేవాలయం లాగా కన్పించినా ఇక్కడి ప్రశాంత వాతావరణం భక్తులను ఇట్టే ఆకట్టుకుంటుంది.


కుమారభీమేశ్వరంలో శివుడు సోమేశ్వరుని రూపంలో కొలువై ఉన్నాడు. అలాగే ఇక్కడ పార్వతీదేవి బాలా త్రిపురసుందరి రూపంలో కొలువై ఉంది. చారిత్రక విశేషం కలిగిన ఈ దేవాలయాన్ని చాళుక్య వంశానికి చెందిన భీముడనే రాజు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.

అలాగే ఈ ప్రాతంలో పాలన సాగించిన కాకతీయులు సైతం ఈ దేవాలయంలో కొంతభాగాన్ని పునర్నించినట్టు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఈ భీమేశ్వరాలయంలోని శివలింగం దాదాపు 60 అడుగుల ఎత్తుతో రెండు అంతస్థుల వరకు వ్యాపించి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడడం వల్ల తెల్లగా ఉంటుంది.

భీమేశ్వరాలయంలోని ఈ శివలింగం మొదట ప్రతిష్టించినపుడు సాధారణంగానే ఉండేదని అయితే కాలక్రమేణా పెరుగుతూ ఉండడంతో శివలింగం పైభాగంలో ఓ మేకును కొట్టారని ఓ కథ ప్రచారంలో ఉంది. ఈ ఆలయానికి సంబంధించి శివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొలువైన పంచారామాలను దర్శించడానికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ ఓ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఒక్కరోజు పాటు సాగే యాత్రలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో వెలసిన పంచారామాలన్నింటినీ దర్శించే సౌకర్యాన్ని భక్తులకు కలుగజేస్తోంది.