శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

పల్నాటి పౌరుషానికి ప్రతీక "శ్రీ లక్ష్మీ చెన్నకేశవాలయం"

FILE
పల్నాటి పౌరుషానికి సజీవ సాక్ష్యంగా.. మలిదేవరాజు ఆస్థాన మంత్రి బ్రహ్మనాయుడిచే పునర్నిర్మించబడ్డ మాచర్ల "శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం" ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. పల్నాడు ప్రజల పాలిట మణిహారంలాగా వెలసిన ఈ ఆలయం చారిత్రికంగా ఎంతో ప్రసిద్ధి చెందినది కూడా..!

త్రేతాయుగంలో ఈ ఆలయం వెలసిన ప్రాంతమంతా దండకారణ్యంలా ఉండేదట. పూర్వకాలంలో కార్తవీర్యార్జుని వంశీకులు నిర్మించిన ఈ ఆలయాన్ని బ్రహ్మనాయుడు 13వ శతాబ్దంలో పున్నర్నించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. క్రీ.శ. 1397 వరు మాచర్ల ప్రాంతాన్ని మహదేవ్‌చర్లగా పిలుస్తుండేవారనీ.. అయితే ఆపేరే వాడుకలో ప్రస్తుతం మాచర్లగా మారిందని అంటుంటారు.

అలాగే.. రెండవ ప్రతాప్‌రుద్ర మహదేవరాజు సామంత రాజైన మాచాయనాయుడు అనే పేరు మాచాయ శబ్దం కాలక్రమంలో మాచర్లగా మారి ఉండవచ్చునని కూడా చెబుతుంటారు. అంతేగాకుండా బ్రహ్మనాయుడు మజిలీ చేసిన స్థలం మాచర్ల అనీ... తన స్వస్థలమైన మాచపురానికి బదులుగా బ్రహ్మనాయుడు మాచర్లను నిర్మించినట్లు పద్మనాభ చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.

మాచర్లకు విష్ణుపురి అనే మరో పేరు కూడా ఉంది. చంద్రవంక నదీతీర ప్రవాహం తూర్పు, పశ్చిమ దిక్కుల నుండి ఉత్తరంవైపుకు ప్రవహిస్తుంటుంది. వాటిలో ఉత్తరదిశలో ఉండే స్థలం పరమపవిత్రమైనదిగా భావిస్తుంటారు. అలాంటి పవిత్రమైన ప్రదేశంలోనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు వెలసినట్లు చెబుతుంటారు.
కిర్రు చెప్పుల సాధువు ఆగ్రహం..!
మాచర్ల సమీపంలోని ఎత్తిపోతలలో తపస్సు చేసి ఒక సాధువు కిర్రు చెప్పులు వేసుకుని మాచర్ల వీధుల్లో నడుస్తుండగా.. గుర్రంపై వెళుతున్న రామరాజు ఈర్ష్యతోటి సాధువును చంపివేశాడు. దీంతో ప్రాణాలు విడిచేముందు సాధువు ఆగ్రహించి మీ వంశం సర్వనాశమవుతుందని శపించాడట...


గుంటూరు జిల్లా, రెంటచింతల మండలంలోని ఒక గ్రామంపేరు రెంటాల. రెంటచింతలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పురాతన గ్రామంలోనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. పల్నాటి యుద్ధకాలం నాటిదైన ఈ ఆలయంలో ఆనాటి రాజులు విడిది చేసేవారట. మాచర్ల నుంచి గురజాల వెళ్లే రోడ్డు మార్గం ఈ రెంటాల గ్రామం ద్వారానే వెళ్లేదట. కాబట్టి అప్పటి రాజులు ఈ ఆలయంలో విశ్రాంతి తీసుకుని వెళుతుండేవారట. ఈ ఆలయంలోగల నీటిబావి ఇప్పటికీ వాడుకలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

అందానికి ప్రతిరూపమైన విష్ణువు చెన్నకేశవుడి రూపంలో ఈ ఆలయంలో వెలశాడని ప్రతీతి. స్వామివారి విగ్రహం గర్భగుడిలో మూడు అడుగుల ఎత్తులో ఉండగా.. అందులో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవుడు, యాగబేరాలు, తీర్థబేరాలు, అళ్వారులు, రామానుజులు, వడియరాజులు, వెన్నముద్దల కృష్ణయ్య, ఉత్సవమూర్తులున్నారు. గర్భగుడి ముందు రంగ మండపం ఉంటుంది.

రంగ మండపాన్ని పరిశీలించి చూసినట్లయితే.. ఆనాటి శిల్పకళా చాతుర్యం ఎంతటిదో అర్థమవుతుంది. ఈ మండపంలోని నాలుగు స్తంభాలపై ఈశాన్య దిశవైపున ఉండే స్తంభంపై.. సుగ్రీవ యుద్ధం, కైలాసగిరిని ఎత్తటం లాంటివి.. నైరుతి స్తంభంపై భాగవతంలోని వినాయక, గజాసురుని యుద్ధం, త్రిపుర సంహారం, సాగరమథనం, దేవతాకూటమి, ఏనుగుల అభిషేకం, అమృతం పంచటం లాంటివి ఈ శిల్పాలలో గోచరిస్తుంటాయి.

కాలక్రమంలో చెన్నకేశవ స్వామివారి ఆలయం ఎన్నోసార్లు పునరుద్ధరించబడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. సూరపురాజు వంశీయుల సంతానమైన లక్ష్మీదేవమ్మ చెన్నకేశవుడిలో ఐక్యం అయినందున ఇదే ఆలయంలో లక్ష్మీదేవికి మరో ఆలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం క్షేత్రశుద్ధి పంచమి రోజున చెన్నకేశవ స్వామివారికి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. కులమతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అశేష ప్రజానీకంగ తరలివస్తుంటారు. స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై మొత్తం 16 రోజులపాటు ఈ ఉత్సవాలు కన్నులపండువగా జరిగి రథోత్సవంతో ముగుస్తాయి.

1980 ఏఫ్రిల్ 29వ తేదీన దుర్గి ప్రాంతానికి చెందిన కుంచనపల్లి నారాయణ పంతులు స్వామివారికి రథాన్ని తయారు చేయించారు. మొట్టమొదటిసారిగా స్వామివారి రథోత్సవం కూడా అప్పుడే జరిగింది. ఇక అప్పటినుంచి క్రమంతప్పకుండా ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరుగుతూ వస్తోంది. ఇందులో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి ఆలయంనుంచి.. లక్ష్మీదేవి మిద్దెల మీదుగా బురుజుదాకా రథోత్సవం నిర్వహిస్తారు.

చెన్నకేశవస్వామి ఆలయం దక్షిణం వైపున సుమారు 700 సంవత్సరాల క్రితం మాచర్ల జమీందారు రామరాజు నిర్మించిన వీరభద్ర ఆలయం కూడా చూడదగ్గదే. మాచర్ల సమీపంలోని ఎత్తిపోతలలో తపస్సు చేసి ఒక సాధువు కిర్రు చెప్పులు వేసుకుని మాచర్ల వీధుల్లో నడుస్తుండగా.. గుర్రంపై వెళుతున్న రామరాజు ఈర్ష్యతోటి సాధువును చంపివేశాడు. దీంతో ప్రాణాలు విడిచేముందు సాధువు ఆగ్రహించి మీ వంశం సర్వనాశమవుతుందని శపించాడట.

సాధువు శాపంతో మనస్తాపం చెందిన రామరాజు తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరాడు. అప్పుడు ఆ సాధువు నీ పాపాలు తొలగాలంటే వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించాలని.. ఆ ఆలయం ఎత్తిపోతలలో ఉత్తర ముఖంగా ఉన్న దత్తాత్రేయ స్వామివారిని చూస్తూండేటట్లుగా ఉత్తరముఖంగా నిర్మించాలని చెప్పాడట. సాధువు చెప్పినట్లుగా రామరాజు ఈ వీరభద్ర ఆలయాన్ని నిర్మించాడని పూర్వీకుల కథనం.

ఈ ఆలయం పైకప్పు బండరాళ్లపై శివ పురాణ ఘట్టం, రాములవారు, కుమారస్వామి, వీరభద్ర స్వామి చరిత్ర ఘట్టాలను తెలిపే చిత్రాలుండటం విశేషం. ఈ బొమ్మలను ఆకుపసరులో మసి, ఎర్రమట్టి పోసి వాటితో గీసినట్లు తెలుస్తోంది. ఇవే బొమ్మలు అజంతా, ఎల్లోరా గుహల్లో కూడా ఉన్నట్లు చెబుతుంటారు. ఈ ఆలయంలో ఉన్న రచ్చబడంపై తప్పుచేసినవారు కూర్చుంటే నిజం పలుకుతుందని నమ్ముతుండేవారు.

ఈ వీరభద్రస్వామి ఆలయం నిర్మాణానికి ముందు చోళరాజులు ఇష్టకామేశ్వరీ ఆలయాన్ని కూడా ప్రతిష్టించారు. అలాగే చెన్నకేశవ స్వామి ఆలయం ప్రాంగణంలో దక్షిణంవైపున కర్నాటక వంశీయులు సంతానం లేకపోవటంతో శ్రీ గిరేశ్వరస్వామివారి ఆలయాన్ని నిర్మించారనీ.. ఆ తరువాత వారికి సంతానం కలిగిందని కూడా చెబుతుంటారు.

ఇదిలా ఉంటే.. వందలాది ఎకరాలుగా ఉన్న ఆలయ ఆస్తులు ప్రస్తుతం అన్యాక్రాంతమై చెన్నకేశవుడి పోషణ నేడు ప్రశ్నార్థకంగా మారింది. 1800 ఎకరాలకు పైబడే ఉన్న చెన్నకేశవుడి మాణ్యం భూములన్నీ హారతికర్పూరంలా కరిగిపోయాయి. ఉన్న కొద్దిపాటి భూముల ద్వారా ఆదాయం నామమాత్రంగా ఉండటంతో.. స్వామివారు నేడు పేదవారైపోయారు.

అలాగే.. ఎన్నో చారిత్రక విశిష్టతలున్న శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవుడిని దర్శించే భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేకపోవచం విచారకరం. బస చేసేందుకు గదులు నిర్మించాలని భక్తులు, స్థానికులు దేవాదాయ శాఖకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.

ఆలయ అభివృద్ధి కోసం పలువురు పూనుకున్నప్పటికీ.. ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయకపోవటంతో ఆలయ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తమ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు ఇప్పటికైనా పూనుకుని చెన్నకేశవ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నడుంబిగించాలని ప్రజలు, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి భక్తుల మొరను ఆ ప్రజాప్రతినిధులు ఆలకిస్తారో లేదో వేచి చూడాల్సిందే..!