గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

పవిత్ర ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం 'ప్రయాగ'

పవిత్ర పుణ్యక్షేత్రాల నిలయమైన భారతదేశంలో ప్రతీ రాష్ట్రం కొన్ని విశిష్ట పుణ్యక్షేత్రాలను కలిగి ఉంది. ఆయా రాష్ట్రాల్లోని ఈ పుణ్యక్షేత్రాలు భక్తి ప్రవత్తులకు నిలయంగానే కాక ఒక్కో పుణ్యక్షేత్రం ఒక్కో విశిష్ట చరిత్రను సొంతం చేసుకుంది. మానవునిలో భక్తిని తద్వారా ఓ క్రమబద్ధమైన జీవనగమనాన్ని ఏర్పరచడంలో ఈ పుణ్యక్షేత్రాలు ప్రత్యేక పాత్ర వహిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాలం ఎంతగా నవీనంగా మారుతున్నా మానవునిలో ఇంకా భక్తి, దేవుని యెడల విశ్వాసం నిలిచి ఉన్నాయంటే కారణం ఈ పుణ్యక్షేత్రాలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ విధంగా పవిత్ర పుణ్యక్షేత్రాల నిలయమైన భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో గల ప్రయాగ పుణ్యక్షేత్రం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పవిత్రతకు నిలయం ప్రయాగ క్షేత్రం
హిందువులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే వారణాసికి దాదాపు 135 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయాగ పుణ్యక్షేత్రం వెలసియుంది. పవిత్ర త్రివేణీ సంగమంగా పేర్కొనే అలబాద్ నగరాన్నే ప్రయాగగా వ్యవహరించడం పరిపాటి. 12ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళ మహోత్సవాలు ఈ ప్రయగా పుణ్యక్షేత్రానికి మరింత శోభను సంతరించిపెట్టాయి.

దేశంలోని ప్రధాన నదులైన గంగ, యమునలు ఇక్కడ సంగమిస్తాయని వీటితోపాటు సరస్వతీ నది కూడా ఇక్కడ అంతర్లీనంగా వచ్చి కలుస్తుందని చరిత్ర చెబుతోంది. అందుకే పవిత్ర నదులైన ఈ మూడు నదులు కలవడం ద్వారా దీన్ని త్రివేణి సంగమంగా భక్తులు వ్యవహరిస్తుంటారు. ఇంతటి మహత్యం ఉండడం వల్లే ఈ పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే సకల పాపాలు హరించడంతో పాటు మానవులకు ఇహ, పరలోక సౌఖ్యాలు అందివస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


ఈ కారణంగానే ప్రతి పుస్కర కాలానికి ప్రయాగలో జరిగే మహా కుంభమేళకు భారత్‌లోని అన్ని ప్రదేశాలనుంచి ప్రజలు విపరీతంగా తరలివస్తుంటారు. ఇక్కడ 12ఏళ్లకోసారి మహాకుంభమేళ నిర్వహించడంతో పాటు ఆరేళ్లకోసారి అర్ధ కుంభమేళ మహోత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు.

నగరంలోని చారిత్రక విశేషాలు
ఆధ్యాత్మికతో పాటు ఈ ప్రయాగ నగరం చారిత్రక విశేషాలను సైతం కలిగి ఉండడం విశేషం. భారతదేశ తొలి ప్రధాని నెహ్రు జన్మస్థలం అలహాబాద్ కావడం విశేషం. అలాగే అక్బర్ నిర్మించిన కోట అలహాబాద్ విశ్వవిద్యాలయం లాంటివి ఈ నగరానికి వన్నె తెచ్చాయి.

ప్రయాగ చేరడం సులువే
భారత్‌లోని ప్రతి రాష్ట్రం నుంచి అలహాబాద్ చేరుకోవడం చాలా సులభం. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి అలహాబాద్‌కు నేరుగా రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అలాగే వారణాసి నుంచి వెళ్లాలనుకునే వారికి రైలు, బస్సు సౌకర్యం ఉంది. కాశి నుంచి దాదాపు నాలుగు గంటల ప్రయాణంతో అలహాబాద్ చేరుకోవచ్చు.


అలహాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి కుంభమేళా జరిగే ప్రదేశం చాలా దగ్గర్లోనే ఉండడం కూడా భక్తులకు సౌకర్యంగానే చెప్పవచ్చు. దాదాపు తక్కువ ఖర్చుతోనే రైల్వే స్టేషన్ నుంచి నదీ సంగమం వద్దకు చేరవచ్చు. అయితే అలహాబాద్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ భోజన, వసతి సౌకర్యాలు లభించాలంటే మాత్రం ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది.