శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

పవిత్ర పంచారామ క్షేత్రం... ద్రాక్షారామం

పరమ పవిత్రంగా భావించే శైవ క్షేత్రాల్లో పంచారామాలకు ఉన్న విశిష్టత గురించి తెలిసిందే. అమృత లింగం ముక్కలై పడ్డ దివ్య స్థలాలుగా పురాణాలు పంచారామాలను పేర్కొంటున్నాయి. శివుడు కొలువైన ఈ పంచారామాలకు సంబంధించి ఒక్కో ప్రదేశానికి ఒక్కో విశిష్టత ఉంది.

పంచారామ చరిత్ర
పురాణకాలంలో తారకాసురుడనే రాక్షసుడు దేవతలను విపరీతంగా బాధించేవాడట. కంఠంలో అమృత లింగాన్ని కలిగి ఉన్న కారణంగా తారకాసురుని ధాటికి తట్టుకోలేక దేవతలు కుమారస్వామికి మొరపెట్టుకున్నారట. దేవతల కోరికను మన్నించిన కుమారస్వామి తారకాసురుని కంఠాన్ని చేధించగా అందులోని అమృతలింగం పలిగి ఐదు ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడిందట.

అలా అమృతలింగతో పునీతమైన ఆ ప్రదేశాలు నేడు పంచారామాలుగా పేరుపొందాయి. అందులో ఒకటే ఈ ద్రాక్షారామం క్షేత్రం. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలో ద్రాక్షారామం గ్రామం ఉంది. ఈ క్షేత్రంలో శివుడు భీమేశ్వరునిగా కొలువై ఉన్నాడు.

ద్రాక్షారామం విశేషాలు
ద్రాక్షారామంలో ఉన్న శివలింగం సగభాగం నలుపుగా సగభాగం తెలుపుగా ఉండడం విశేషం. దాదాపు 60 అడుగుల ఎత్తుతో ఉండే శివలింగానికి అభిషేకం జరపాలంటే రెండు అంతస్థులుగా ఉన్న గర్భగుడి పైభాగం చేరుకోవాల్సిందే. ద్రాక్షారామంలో కొలువై ఉన్న అమ్మవారి పేరు మాణిక్యాంబికా దేవి. పరాశక్తి రూపమైన మాణిక్యాబింక భీమేశ్వరుని నిత్యం పూజించి ఆయన దేవేరిగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.


ద్రాక్షారామంలోనే మాణిక్యాంబికాదేవి ఆలయం కూడా ఉంది. దేశంలోనే అత్యంత రమణీయమైన శిల్పకళకు వేదికగా ద్రాక్షారామం క్షేత్రాన్ని పేర్కొనవచ్చు. ఈ క్షేత్రంలోని శిల్పకళ అత్యంత సుందరంగా ఉండి పర్యాటకులను మైమరింపజేస్తుంది. చాళుక్య రాజైన భీముడు ద్రాక్షారామం క్షేత్రాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది.

శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ద్రాక్షారామం క్షేత్ర విశిష్టత గురించి పేర్కొన్నాడు. ద్రాక్షారామం క్షేత్రంలో శివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆరోజు స్వామివారికి ఘనంగా పూజలు జరుపుతారు.

ద్రాక్షారామం ప్రయాణ విశేషాలు
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్రాక్షారామాన్ని సందర్శించాలంటే విడిగా వెళ్లడమేకాక పంచారామాలను చుట్టి చూపించే ఆర్టీసీ ప్యాకేజీలో వెళ్లవచ్చు. ఈ విధంగా ఐతే ద్రాక్షారామంతో పాటు మిగిలిన నాలుగు పంచారామ క్షేత్రాలను కూడా ఒకేసారి దర్శించవచ్చు.