శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

బొజ్జ గణపయ్య దివ్యక్షేత్రం కాణిపాకం

ఆంధ్రప్రదేశ్‌లో కొలువైన పుణ్యక్షేత్రాల్లో కాణిపాకం కూడా ఓ విశిష్ట స్థానాన్ని దక్కించుకుంది. వినాయకుడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతోంది. కోరిన కోర్కెరు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కాణిపాకం వినాయకున్ని సేవించడం విశేషం.

కాణిపాకం పుణ్యక్షేత్రం విశేషాలు
గత కొద్ది ఏళ్లుగా భక్తులు రద్దీ పెరిగిన ఈ క్షేత్రానికి చారిత్రక ప్రాదాన్యం ఉంది. కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయకుడు చాలా మహిమగలవాడుగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్ర ఆవరణలో ఎలాంటివారైనా అబద్ధం చెప్పడానికి వెనకడుగు వేస్తారు. తాను తప్పు చేయలేదని కాణిపాకం గుడిలో ఎవరైనా ప్రమాణం చేస్తే అతనిపై నేరారోపణ మోపినవారు సైతం ఆ మాటను విశ్వసిస్తారంటే స్వామివారి మహిమను అర్థం చేసుకోవచ్చు.

కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుని దేవస్థానం బోర్డు ప్రస్తుతం మంచి ఆదాయాన్ని సాదిస్తోంది. దాంతో గత కొన్నేళ్లుగా దేవాలయానికి అనేక సదుపాయాలు సమకూరడంతో పాటు దేవాలయాన్ని సందర్శించే భక్తుల రద్దీ కూడా పెరిగింది.

దేశంలోని నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల్లో చాలామంది కాణిపాకం వినాయకున్ని సైతం దర్శించడం ఆనవాయితీగా మారడంతో ఈ క్షేత్రానికి నిత్యం భక్తుల తాకిడి ఉంటోంది.




స్వామివారి మహిమలకు నిదర్శనాలు
కాణిపాకంలో స్వయంభుగా వెలసిన వినాయకుని మహిమల గురించి ఆ ప్రాంతంలో కథలుగా చెబుతారు. అసలు కాణిపాకంకు ఆ పేరు రావడం వెనక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం కాణిపాకంలో నివశించే ముగ్గురు సోదరులకు ఒక్కొక్కరికి ఒక్కోరకమైన అవిటితనం ఉండేది.

వ్యవసాయం వృత్తిగా జీవించేవారు పొలం పనులకోసం ఓరోజు బావి త్రవ్వడం ప్రారంభించారు. బావి త్రవ్వుతున్న సమయంలో వారు త్రవ్వుతున్న ప్రదేశంలో వినాయకుని విగ్రహం బయటపడింది. అయితే బావి త్రవ్వుతున్న వారి గడ్డపార స్వామివారికి తగలడంతో విగ్రహం నుంచి రక్తం కారసాగింది.

దాంతో బావి మొత్తం రక్తంతో నిండిపోయి ఆ రక్తం తగిలిన అవటివారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం తెలిసిన ఊరిజనం స్వామివారి దర్శనానికి వేలాదిగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు స్వామివారికి కొట్టిన టెంకాయల్లోని నీరు ఓ కాలువలాగా ప్రవహించిందట.

అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని కాణిపాకం (తమిళంలో కాణిపారకం అంటే కొబ్బరినీరు ప్రవహించిన ప్రదేశం అని అర్ధం) అని వ్యవహరించడం పరిపాటిగా మారిందట. ఈ కథకు గుర్తుగా కాణిపాకంలో వినాయకుని విగ్రహం నేటికీ బావిలోనే ఉండడాన్ని చూడవచ్చు. అలాగే కాణిపాకంలో ఉండే స్వామివారు నిత్యం పెరుగుతూ ఉంటారని కూడా భక్తుల విశ్వాసం.


కాణిపాకం రవాణా సౌకర్యాలు
చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో ఉన్న ఓ గ్రామమే కాణిపాకం. అయితే తిరపతి నుంచి బెంగుళూరుకు వెళ్లే రహదారి మార్గానికి కొద్ది దూరంలోనే ఉండడంతో భక్తులు కాణిపాకంకు చేరడం చాలా సులభం. తిరుపతి నుంచి ప్రతి ఐదు నిమిషాలకు కాణిపాకంకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

అలాగే జిల్లా కేంద్రమైన చిత్తూరు నుంచి కూడా ప్రతి పది నిమిషాలకు కాణిపాకంకు బస్సు సౌకర్యం ఉంది. తిరుపతి నుంచి కాణిపాకంకు దాదాపు 70కిలోమీటర్ల దూరం ఉండగా, చిత్తూరు నుంచి కాణిపాకంకు దూరం 13 కిలోమీటర్లు మాత్రమే.

రైలు ద్వారా కాణిపాకం చేరాలనుకునేవారు తిరుపతి లేదా చిత్తూరు చేరుకుని అక్కడి నుంచి కాణిపాకం చేరవచ్చు. కాణిపాకంలో ప్రస్తుతం వసతి సౌకర్యాలు సైతం బాగానే అందుబాటులో ఉన్నాయి.