శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

భక్తుల పాలిటి కొంగు బంగారం కొండగట్టు క్షేత్రం

రాముని బంటు ఆంజనేయస్వామి అంటే భక్తులకున్న విశ్వాసం అంతా ఇంతా కాదు. ఆ స్వామి కటాక్షం లభిస్తే లోకంలోని ఏ కీడు తమ దరిచేరదన భక్తుల ప్రగాఢ విస్వాసం. అలాంటి స్వామి స్వయంభువుగా వెలసి భక్తుల పాలిటి కొంగుబంగారంగా విలసిల్లుత్తున్న క్షేత్రమే కొండగట్టు.

ఈ కొండగట్టు క్షేత్రంలో వెలసిన అంజన్న (ఆంజనేయస్వామి)ని దర్శిస్తే సకల రోగాలు, అన్ని కష్టాలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య వెలసిన కొండగట్టు క్షేత్రంలోని ఆంజనేయ స్వామిని దర్శించి పూజలు చేస్తే ఎలాంటి మానసిక రోగాలైనా పటాపంచలవుతాయని భక్తులు పేర్కొంటుంటారు.

కొండగట్టు క్షేత్రం విశేషాలు
కరీంనగర్ జిల్లాలో వెలసిన ఈ క్షేత్రానికి తెలంగాణ జిల్లాల్లో విశేష ప్రాచూర్యం ఉంది. దాదాపు మూడు వందలఏళ్ల క్రితమే ఈ ఆలయం నిర్మించబడిందని స్థానికులు చెబుతుంటారు. దాదాపు 170 ఏళ్ల క్రితం కొడిమ్యాలకు చెందిన క్రిష్ణారావ్ దేశముఖ్ ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి.

సీతారాములు తమ అరణ్యవాసంలో భాగంగా కొండగట్టు క్షేత్రాన్ని దర్శించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకు గుర్తుగా శ్రీరాముడి పాద ముద్రలు, సీతమ్మ కంటి నుంచి జారిపడిన కన్నీళ్లు చేసిన గుర్తులు కొండగట్టు క్షేత్రంలో మనకు కనిపిస్తాయి.

ఆలయానికి సంబంధించిన విశేషాలు
తన ఇష్ట దైవాలైన సీతారాములను వక్షస్థలంలో ధరించి ఆంజనేయుడు ఈ క్షేత్రంలో కొలువుండడం విశేషం. అలాగే స్వామివారికి ఇరువైలా శ్రీ మహావిష్ణువు శంఖు, చక్రాలు మనకు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంకు విశేషమైన మహిమలున్నట్టు భక్తులు భావించడం విశేషం.


ఈ క్షేత్రంలో మండలం రోజులపాటు నిద్రించి శ్రీ అంజన్న స్వామివారిని సేవిస్తే ఎలాంటి మానసిక రోగాలైనా నయమవుతాయని భక్తలు విశ్వసిస్తారు. అలాగే సంతానం లేని దంపతులు సైతం స్వామివారిని దర్శించి సేవిస్తే వారికి సంతాన ప్రాప్తి కల్గుతుందని కూడా భక్తులు చెబుతుంటారు. అలాగే భక్తులు ఆంజనేయ స్వామి మాల ధరించి ఈ క్షేత్రానికి వస్తుంటారు.

ఏడాదిలో రెండుసార్లు అంటే ఏప్రిల్, మే నెలలో ఈ క్షేత్రంలో నిర్వహించే హనుమాన్ జయంతి ఉత్సవాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు.

క్షేత్రంలోని సౌకర్యాలు
కొండగట్టు క్షేత్రంలో వసతి సౌకర్యాలు కాస్త తక్కువనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ప్రభుత్వం, దేవాలయ కార్యనిర్వాహకశాఖ సంయుక్తంగా చేపడుతున్న ఈ నిర్మాణాలు ప్రస్తుతం పూర్తి కావచ్చే దశలో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు
ఈ క్షేత్రం కరీంనగర్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆలయానికి సమీపంలో ఉన్న ప్రధాన రహదారి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా రెండు కిలోమీటర్ల దూరంలో దేవాలయం ఉంది. నడిచి వెళ్లాలేమని భావించే వారికి ప్రధాన రహాదారి నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఇచ్చట ప్రైవేటు వాహనాల సౌకర్యం అందుబాటులో ఉంది.