శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

మహావిష్ణువు "బద్రీనాథ్"ను ఎప్పటికీ వదలరట..!!

FILE
గర్హ్వాల్ కొండలలో, అలకనందానదీ తీరంలో, నర నారాయణ కొండల వరుసల మధ్య ఉండే నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో, రుషికేశ్‌కు ఉత్తరాన, కేదారనాథ్‌కు సమీపంలోని గౌరీకుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో నెలవైన ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం "బద్రీనాథ్". భారతావనిలోని ఉత్తరాఖండ్, చమోలి జిల్లాలో ఉన్న ప్రదేశం... హిందూ పురాణాలలో బద్రీ లేకా బద్రికాశ్రమంగా వర్ణించబడిన బద్రీనాథ్... నర-నారాయణులు ఆశ్రమ జీవితం గడిపిన పుణ్యస్థలమే..!

శివుడు అర్జునుడితో మాట్లాడుతూ... పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడిగానూ, శ్రీకృష్ణుడు నారాయణుడిగాన చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారని మహాభారతంలో చెప్పినట్లు ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. అలాగే గంగానది భూలోకవాసులను ఉద్ధరించేందుకు భూమికి దిగివచ్చే సమయంలో శక్తివంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించటం కష్టం కాబట్టి.. 12 భాగాలుగా చీలిందనీ, అందులో అలకనందానది ఒకటని.. తరువాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణాలు చెబుతున్నాయి.

బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లోని కొండలు భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణుడి నిర్యాణానంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించాలని స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని కూడా స్థలపురాణం చెబుతోంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. ఇందులో వర్ణించిన మానా బద్రీనాథ్‌కి 4 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆ కొండలలో వ్యాసుడు వర్ణించిన గుహను ఇప్పటికీ చూడవచ్చు.

బద్రీనాథ్‌లో ప్రత్యేక ఆకర్షణల విషయానికి వస్తే... "బద్రీనాథ్ ఆలయం" చెప్పుకోదగ్గది. పురాణ కథనాలను అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందా నదీతీరంలో లభించిన సాలిగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ వేడినీటి చెలమ సమీపంలో ప్రతిష్టించి, అక్కడ ఓ గుడిని నిర్మించారు. 16వ శతాబ్దంలో గర్హ్వాలా రాజు తిరిగీ బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు.
మహాలక్ష్మి రేగుచెట్టుగా...!
"బద్రీ" అంటే "రేగుపండు" అనీ, "నాథ్" అంటే "దేవుడు" అని అర్థం. ఈ ప్రాంతంలో రేగుపండ్లు విస్తారంగా పండటంవల్ల.. ఇక్కడ వెలసిన దేవుడికి బద్రీనాథుడు అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. అయితే, లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘకాల శీతాకాల శోషణ తీర్చేందు...


17వ శతాబ్దంలో గర్వ్వాలా రాజుచే విస్తరించబడిన బద్రీనాథ్ ఆలయం... 1803లో హిమాలయా పర్వతాలలో సంభవించిన భూకంపంలో శిథిలం కావడంతో.. జయపూర్ రాజుచే తిరిగీ పునర్నిర్మించబడింది. ఈ ఆలయం ఎత్తు గోపురంతో కలిపి చూస్తే 50 అడుగులు ఉంటుంది. ముఖద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మితమైంది. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది.

ఇక ఆలయ నిర్మాణ శైలిని చూస్తే.. బుద్ధవిహార నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకుతేక మానదు. మండపాన్ని దాటి కొంత లోపలికి వెళితే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భాలయానికి తీసుకెళ్తుంది. ఆలయం లోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంతో అలరారుతూ ఉంటాయి.

ఆలయ ప్రత్యేకతను చూస్తే.. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన ప్రముఖ వైష్ణవ దేవాలయం కావడమే. కృష్ణావతారానికి ముందు మహా విష్ణువు నారాయణ మునిగానూ, అర్జునుడు నరమునిగానూ జన్మించారని అనంతరం.. దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం కృష్ణుడుగానూ, అర్జునుడిగానూ వీరిరువురూ జన్మించినట్లు మహాభారత కథనం వెల్లడిస్తుంది.

"బద్రీ" అంటే "రేగుపండు" అనీ, "నాథ్" అంటే "దేవుడు" అని అర్థం. ఈ ప్రాంతంలో రేగుపండ్లు విస్తారంగా పండటంవల్ల.. ఇక్కడ వెలసిన దేవుడికి బద్రీనాథుడు అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. అయితే, లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘకాల శీతాకాల శోషణ తీర్చేందుకు రేగుచెట్టు రూపం దాల్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.

చైనా, టిబెట్ సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో నెలవైన బద్రీనాథ్.. కేదారనాథ్‌కు రెండు రోజుల ప్రయాణ దూరంలో ఉంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్‌లలో ఇది మొదటిది. ఇది ఓడలనుండి సరకు దిగుమతి చేసుకునే రేవులలో ఒకటి. బద్రీనాథ్ వెళ్లేదారిలో హేమకుండ్ సాహెబ్ అనే సిక్కుల పవిత్ర క్షేత్రం కూడా వస్తుంది.

బద్రీనాథ్, హేమకుండ్‌కు వెళ్లే భక్తులతో ఈ మార్గం వేసవిలో జనసమ్మర్థం అధికంగా ఉంటుంది. జూన్, సెప్టెంబర్ నెలల మధ్య కాలం బద్రీనాథుడిని దర్శించేందుకు అనువుగా ఉంటుంది. అయితే ఇక్కడ చలిని తట్టుకునే దుస్తుల అవసరం మాత్రం సంవత్సరమంతా ఉంటుంది. ఆదిశంకరాచార్యులు ఉత్తర భారతంలో స్థాపించిన జ్యోతిమందిరం కూడా బద్రీనాథ్‌కు సమీపంలోనే ఉంది. బద్రీనాథ్ సమీప పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి హరిద్వార్, కేదారనాథ్‌లు.

బద్రీనాథ్ క్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాల్లోనూ లేదని శివుడు కుమారస్వామికి వివరించాడనీ.. ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్థాలు నిక్షిప్తమైన ఉంటాయనీ స్కందపురాణం చెబుతోంది. ఇది విష్ణు క్షేత్రమనీ, ఏ క్షేత్రాన్ని విడచినా.. మహావిష్ణువు ఈ క్షేత్రాన్ని మాత్రం విడిచిపెట్టడని ప్రతీతి. ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని ఈ క్షేత్రానికి వెళ్లి తపస్సు చేయమని ఆదేశించటంవల్ల యాదవుల వినాశనం జరిగినప్పుడు ఉద్ధవుడు రక్షింపబడ్డాడని పురాణ కథనం.

బద్రీనాథ్‌కు ఎలా వెళ్లాలంటే.... ఈ ప్రాంతానికి అతి సమీపంలోని విమానాశ్రయం డెహరాడూన్ కాగా... సమీపంలోని రైల్వేస్టేషన్లు హరిద్వార్, రిషికేశ్ మరియు కోట్‌ద్వార్ రైల్వేస్టేషన్లు ఉంటాయి. ఇకపోతే ప్రతిరోజూ ఢిల్లీ, హరిద్వార్, రుషికేశ్‌ల నుంచి బస్సు సర్వీసులు ఉంటాయి. రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి కాబట్టి ప్రయాణీకులు, పర్యాటకులు జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించటం మరీ మంచిది. సొంత వాహనాలు ఉన్నట్లయితే, బద్రీనాథ్ గురి పరిసర ప్రాంతాలదాకా కూడా ప్రయాణించవచ్చు.