గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu
Last Modified: సోమవారం, 4 ఆగస్టు 2008 (13:48 IST)

లక్ష్మీ నరసింహుడు కొలువైన అంతర్వేది క్షేత్రం

వశిష్ట మహాముని కోరిక మేరకు లక్ష్మీ నరసింహునిగా మహా విష్ణువు కొలువైన దివ్య క్షేత్రమే అంతర్వేది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఓ చిన్న గ్రామమైన అంతర్వేది కోస్తా ప్రాతంలో ఓ ప్రముఖ క్షేత్రంగా విలసిల్లుతోంది. క్రీస్తు పూర్వంకు చెందిన ఆలయంగా పేరు సంపాధించుకున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహుని ఆలయం ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉండడం విశేషం.

అంతర్వేది క్షేత్ర పురాణం
పురాణ కాలంలో హిరాణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుడనే రాక్షసుడు బ్రహ్మర్షులు, మహా తపశక్తి సంపన్నులైన ముని పుంగవులను బాధిస్తూ ఆనందిస్తుండేవాడు. శివుడిచ్చిన వరం చేత ఆ రాక్షసుని ఎదిరించేందుకు ఎవరి వల్లా అయ్యేది కాదు. రక్తావలోచనుడి శరీరం నుంచి కారే రక్తం క్రింద పడితే ఆ రక్తం వల్ల తడిసిన ఒక్కో ఇసుక రేణువు ఒక్కో శక్తివంతమైన రాక్షసునిగా ఉద్భవించేది. ఇలాంటి వరం ఉండడం చేతనే రక్తావలోచనుడు ముల్లోకాలను గడగడలాడించేవాడు.

అలాంటి రక్తావలోచనుడు ఓసారి రాక్షస గురువైన విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు వశిష్ట మహా మునిని హింసించడం ప్రారంభిస్తాడు. ఇందులో భాగంగా వశిష్టుని నూరుగురు కుమారుల్ని రక్తావలోచనుడు సంహరిస్తాడు. రక్తావలోచనుడి ఆగడాలు భరించలేని వశిష్టుడు చివరకు మహా విష్ణువును ప్రార్ధిస్తాడు. వశిష్టుని ప్రార్ధనను మన్నించి మహావిష్ణువు రక్తావలోచనుడిని సంహరించేందుకు బయలు దేరుతాడు.

అయితే రక్తావలోచనుడికి ఉన్న బలం తెలిసిన మహావిష్ణవు అతని సంహరించిన సమయంలో అతని రక్తం నేలపై పడకుండా ఓ నదిలా పారే ఏర్పాటు చేసి అనంతరం రక్తావలోచునిడి తలను తన సుదర్శన చక్రంచే ఛేదిస్తాడు. (అలా ఆనాడు విష్ణువుచే ఏర్పరచబడిన నదే రక్తకుల్య పేరుతో నేటికీ ఈ ప్రాంతంలో భక్తులచే పూజలందుకుంటోంది) దీంతో రక్తావలోచనుడి పీడ విరగడవుతుంది.

తన కోరిక మేరకు రక్తావలోచనుడిని సంహరించిన విష్ణువుని చూచి వశిస్టుడు మరో కోరిక కోరుతాడు. వశిష్టుడి కోరిక మేరకు విష్ణువు లక్ష్మీ నరసింహుని అవతారంలో అంతర్వేదీ ప్రాంతంలో కొలువైనాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ అంతర్వేదీ స్థలానికి ఆ పేరు రావడానికి సంబంధించి మరో కథ చెప్పబడుతుంటుంది.


శివుని గురించి బ్రహ్మ రుద్రయాగం చేయతలబెట్టిన సమయంలో ఈ ప్రాంతాన్ని తన యజ్ఞానికి అనువైన స్థలంగా ఎంపిక చేసుకున్నాడట. అందుకే ఈ ప్రాంతానికి అంతర్వేదిక అనే పేరు వచ్చిందట. ఆ పేరే కాలగమనంలో అంతర్వేది అనే పేరుగా స్థిరపడిందట.

అంతర్వేది క్షేత్ర విశేషాలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో ఉన్న ఓ చిన్న దీవిలో ఈ క్షేత్రం కలదు. పవిత్ర గోదావరీ నదిశాఖ అయిన వశిష్టానది బంగాళాఖాతంలో సంగమించే స్థలమే ఈ అంతర్వేదీ ప్రాంతము. అటు సముద్రతీరం ఇటు నదీ ప్రాంతం రెండూ కలిసిన అద్భుతమైన ప్రాతంగా అంతర్వేది గురించి చెప్పుకోవచ్చు.

అంతర్వేది క్షేత్రంలో ఉన్న లక్ష్మీ నరసింహుని ఆలయం చాలా అందమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. పురాణకాలం ఆలయంగా చెప్పబడే ఈ ఆలయం శిధిలావస్థకకు చేరిన సమయంలో ఈ ప్రాంతంలో జమీందారుగా పేరుబడ్డ కొపనాతి కృష్ణయ్య అనే వ్యక్తి ఈ ఆలయ జీర్ణోద్ధరణకు కృషి చేశారని చెప్పబడుచున్నది. ఇందుకు గుర్తుగా ఆలయ ముఖ ద్వారం వద్ద ఆ జమీందారు శిలా విగ్రహాన్ని మనం చూడవచ్చు.

ఈ ఆలయాన్ని రెండు అంతస్థులుగా నిర్మించడం వల్ల భక్తులు ఆలయానికి చుట్టూ ఉన్న అంతస్థు పైకి చేరుకుని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ఆలయానికి దూరంగా ఉన్న వశిష్టానదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహుని ఆలయంతో పాటు చూడదగ్గ మరికొన్న ప్రదేశాలున్నాయి.

ఆలయానికి కొద్ది దూరంలో వశిష్టాశ్రమము పేరుతో ఓ విశ్రాంతి తీసుకునే నిర్మాణం ఉన్నది. అందంగానూ, ఆహ్లాందంగా ఉండే ఈ ప్రదేశం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. అలాగే ఆలయానికి దూరంగా సముద్ర తీరం వద్ద ఉన్న లైట్ హౌస్ కూడా యాత్రికులకు ఆనందాన్ని పంచే ప్రదేశమే. ఈ ప్రాంతంలో అందంగా తీర్చిదిద్దబడిన గార్డెన్ పర్యాటకులకు చక్కని ఆనందాన్ని కల్గిస్తుంది.

వసతి సౌకర్యాలు
ఇక్కడి దేవాలయానికి సంబంధించి దేవస్థాన విడిది గృహం కలదు. అలాగే వివిధ కులాలవారు నిర్మించిన ధర్మ సత్రాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన లాడ్జీలు కూడా అందుబాటులో ఉన్నాయి.