శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu
Last Modified: శుక్రవారం, 26 సెప్టెంబరు 2008 (18:45 IST)

వెంకటేశ్వరుడు కొలువైన కురుమూర్తి

శ్రీవెంకటేశ్వరుడు ఏడుకొండలపై భక్తుల కోసం వెలసిన దివ్యక్షేత్రం కురుమూర్తి. మహబూబ్ నగర్‌ జిల్లాలోని చిన్న చింతకుంట మండలంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రానికి ఆ ప్రాంతంలో విశేషమైన ప్రాముఖ్యం ఉడడం విశేషం. కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల కొండపై వెలసిన శ్రీవారికి కురుమూర్తిలో వెలసిన స్వామివారికి అనేక విషయాల్లో పోలిక ఉండడం ఈ క్షేత్రానికి సంబంధించిన మరో విశేషం.

దేవాలయ విశేషాలు
ఏడు కొండలపైన కొలువైన కురుమూర్తి శ్రీవెంకటేశ్వరుని దేవాలయాన్ని క్రీ.శ. 1268 ప్రాంతంలో నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో ముక్కెర వంశ మూలపురుషుడైన గోపాలరాయుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడని... తర్వాతి కాలంలో చంద్రారెడ్డి అభివృద్ధి పరిచాడని ఇక్కడి శిలా శాసనాలు చెబుతున్నాయి.

వీరిద్దరి తర్వాత సోమ భూపాలరావు కొండపైన నిర్మించబడ్డ ఈ ఆలయానికి మెట్లను నిర్మించాడని చెబుతారు. కురుమూర్తిలో కొలువైన ఈ వెంకటేశ్వరునికి నిర్వహించే వివిధ ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిపే ఉద్దాల ఊరేగింపు ముఖ్యమైంది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించబడే ఈ ఉద్దాల ఊరేగింపు సందర్భంగా కొత్తగా తోలుతో తయారు చేయబడిన పాదుకలను స్వామివారి కోసం ఊరేగింపుగా తీసుకుని వస్తారు.


వేడుకగా తీసుకువచ్చే ఈ పాదుకలను ఉద్దాల మండపం వద్ద ఉంచి పూజిస్తారు. కలియుగానికి ముందు పద్మావతిని వివాహం చేసుకున్న వెంకటేశ్వరుడు కుబేరుడి అప్పు తీర్చలేక తిరుమల నుంచి సతీ సమేతంగా ప్రయాణమై కృష్ణాతీరం చేరుకున్నాడని ఆ సమయంలో కృష్ణ సమీపంలో ఆయన సేద తీరాడని ఓ పురాణ కథ ఉంది.

ఈ సమయంలో స్వామివారి పాదాలు కందిపోకుండా ఉండడం కోసం కృష్ణమ్మ స్వామివారికి పాదుకలు బహుకరించిందని ఆనాడు అలా బహుకరించబడినందువల్లే నేటికీ ఉద్దాల ఉత్సవం పేరుతో అది కొనసాగుతోందని ఆలయ చరిత్ర చెబుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి సమీపంలోని గ్రామంలో ఆవు చర్మంతో ప్రత్యేకంగా పాదుకలు తయారు చేస్తారు.

ఇలా తయారు చేసిన పాదుకలను కొండమీదకు తీసుకువచ్చి ఉద్దాల మండపంలో ఉంచి పూజిస్తారు. ఇక్కడ పెట్టిన ఈ పాదుకలతో కొట్టించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

రవాణా సౌకర్యాలు
జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఈ కురుమూర్తి ఉంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి కురుమూర్తి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కురుమూర్తి చేరుకున్నాక కొండమీదకు చేరుకోవడానికి మెట్ల దారితో సహా బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.