శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Venkateswara Rao. I

వైష్ణోదేవి దర్శనం: నా యాత్రా అనుభవం

- మురళీకృష్ణ

WD
మానవ జీవితానికి తీర్థయాత్రలు పుణ్యఫలాలను అందిస్తాయని విశ్వాసం. భగవంతుని కటాక్షం ఉంటేనే దేవాలయాలకు భక్తులు వెళ్లగలుగుతారు. ఇలా ఆలయాలకు వెళ్లి ఆ దేవతలను దర్శించుకుంటే వారి అభయం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. కార్తీకమాసంలో పూజలతోపాటు తీర్థయాత్రలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులుంటాయని చెప్పబడింది. అయితే ఇవేవీ పెద్దగా తెలీనివారు ఆ విషయాలను తెలుసుకున్నా, చదివినా సగలాభం పొందుతారని అధర్వణ వేదంలో చెప్పబడింది. అటువంటి పుణ్యప్రదమైన తీర్థయాత్రను నేను ఈ కార్తీకమాసంలో చేయడం జరిగింది.

జమ్మూ - కాశ్మీర్ ప్రాంతంలో వెలసిన వైష్ణవిమాత దర్శనభాగ్యంకోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నాకు ఈ కార్తీకంలో ఆ అవకాశం కలిగింది. దేశంలో శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుపతి తర్వాత స్థానంగా చెప్పబడే వైష్ణవి మాత ఆశీస్సులకై నేను సాగించిన యాత్ర వివరాలు మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బహుశాః ఈ అవకాశాన్ని కూడా ఆ మాతే కల్పించి ఉంటుంది అని నమ్ముతున్నాను.

నవంబరు 28వ తేదీనాడు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం గం 1.30 నిమిషాలకు ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కాము. మధ్యలో పూలన్ దేవి ఉన్న చంబల్ లోయ ప్రాంతాలు దర్శనమిచ్చాయి. ఝాన్సీ, భోపాల్ తదితర ప్రాంతాల్లో కొద్దిసేపు రైలుబండి ఆగింది. కార్తీకమాసం కనుక రద్దీ ఎక్కువగానే ఉంది. మా ప్రయాణం గమ్యం చేరే కొలదీ చలి ఎక్కువైంది.

29వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీలో దిగి అక్కడ నుంచి విశ్రాంతి తీసుకునేందుకు కరూల్‌బాగ్‌కు వెళ్లాం. విజయవాడలో బీసెంట్ రోడ్, హైదరాబాద్‌లోని కోఠిలను తలపించేవిధంగా ఉందా ప్రాంతం. ఎక్కువగా పర్యాటకులతోటే వారికి వ్యాపారం. ఢిల్లీ చుట్టుప్రక్కల ప్రాంతాలకు వీక్షకులు వస్తుంటారు. ఇక్కడ విశేషమేమిటంటే... రూ.10 నుంచి లక్ష రూపాయలు విలువ చేసే అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. అయితే రేటు విషయంలో మాత్రం ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అక్కడ అదో సిండికేట్ వ్యాపారంలా సాగుతోంది.

ఇక్కడ ముఖ్యంగా దక్షిణాది వారంటే కాస్త చులకనగా చూస్తారనే విషయం కూడా కొన్ని సందర్భాల్లో అవగతమైంది. వారు మాట్లాడే తీరు చాలా దురుసుగా, కటువుగా ఉంటుంది. ఏదైనా అడ్రెస్ అడిగినా సరిగా చెప్పరు. సాటి మనిషికి సాయం చేయాలన్నది వారిలో ఏ కోశానా కనిపించదు. ఉత్తరాదివారంతా ఇలానే ఉంటారా...? అని అనిపించింది. మొత్తమ్మీద అలా అలా ఢిల్లీ వీధులన్నీ చుట్టేశాం. రాజధానిలో వైభోగాలు అనుభవించే అపరకుబేరులు, రేకుల ఇళ్లతో ఉన్న ఇరుకు కాలనీలు, ఆ ప్రక్కనే మురుగు కాల్వలు అన్నీ గోచరించాయి.

నా యాత్రా లక్ష్యమైన వైష్ణవి దేవి ఆలయానికి వెళ్లాలి. ఆ ఆలయం జమ్మూలో ఉంది. జమ్మూకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాత్రాలో ఉంది అమ్మవారి ఆలయం. ఢిల్లీలో రాత్రి గం 10.30 నిమిషాలకు జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఎక్కాము. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు జమ్మూ స్టేషనుకు చేరుకున్నాం. అక్కడ పోలీసుల పర్యవేక్షణ బాగుంది. ఎవర్నీ ఎక్కువసేపు నిలుచోనివ్వడం లేదు. అలా అని కూర్చుని ఎక్కువసేపు ఉన్నా... నిద్రపోతున్నా... మొహమాటం లేకుండా రైల్వే పోలీసులు ఎక్కడికి వెళ్లాలో అడిగి తెలుసుకుని పంపించడం విశేషం. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు.

స్టేషనులో మిలటరీ చెకింగ్ బాగా ఉంది. ప్రతీ బ్యాగును చెక్ చేశారు. కొంతమందిని వదిలేశారు. మా లగేజీలో కెమేరా ఉంటే దాన్ని చూసి బిల్ అడిగాడు ఒక మిలటరీ అధికారి. అవేవీ తీసుకెళ్లం కనుక లేదని చెప్పాం. అయితే ఇచ్చేయమంటూ గొడవ మొదలెట్టారు. చివరికి మేము జర్నలిస్టులమని చెప్పిన తర్వాత వదిలేశారు. అంతేకాదు ఇటువంటి మిలటరీవారితోపాటు అవినీతి పోలీసులు ఉన్నారన్న సంగతి కూడా అనుభవంలో తెలిసి వచ్చింది. కారులో ఓ మార్గంవైపు వెళుతుండగా కారును ఆపి, మేము టూరిస్టులమని చెప్పినా, ఇటు రాకూడదంటూ రూ. 100 కాగితాన్ని ఇచ్చేంతవరకూ కారును కదలనివ్వలేదు. ఇదేంటయా..? అని డ్రైవర్‌ని అడిగితే... ఇక్కడ ఇవన్నీ మామూలే అంటూ మళ్లీ మాట్లాడేందుకు అతను ఉత్సాహం చూపించలేదు.

ఆ తర్వాత అతడితో మిలటరీ చెకింగ్ గురించి చెప్పాం. అతడు నవ్వుతూ మీ కెమేరా వారికి నచ్చినట్లుంది. అందుకే మీతో డిస్కషన్ పెంచారు. విదేశీయులతై వారి గొడవ భరించలేక కెమేరాలను ఇచ్చేసి పోతారు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న మాకు మా కెమేరా మా చేతుల్లోనే ఉన్నందుకు ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది.

WD
కాత్రా ప్రయాణం
జమ్మూ నుంచి కాత్రా 70 కిలోమీటర్ల దూరం. కాశ్మీరుకు వెళ్లే మార్గంలో ఉంది. అలా కారులో వెళుతుంటే.. జమ్ముతావీ నది కన్పించింది. కానీ నీళ్లు లేవు. అక్కడక్కడా చిన్న చిన్న గుంటలు కనిపించాయి. పెద్ద వంతెన. అది చూడగానే మణిరత్నం రోజా చిత్రంలో హీరోను టెర్రరిస్టులు కిడ్నాప్ చేసే సన్నివేశం గుర్తుకు వచ్చింది. ఆ సన్నివేశం అక్కడే తీశారని డ్రైవరు చెప్పాడు. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండలు, లోయలు... ప్రకృతిని ఆస్వాదిస్తూ... రెండు గంటలపాటు మా ప్రయాణం సాగింది. మధ్యలో ఆకలివేస్తే టిఫిన్ కోసం ఆగాము.

ఇడ్లీ, దోసెల్లాంటివి అక్కడ లేవు. పనీర్‌తో చేసే బజ్జీలు, మిరపకాయలతో చేసిన బజ్జీలు, క్యాబేజీ పకోడీలు, రోటీ, బంగాళదుంప కూర.. ఇలాంటివే ఉన్నాయి. ఆకలితో ఉన్నాం కనుక ఉన్నవాటినే లాగించేసి మళ్లీ బయలుదేరాం. సుమారు మరో ముప్పావుగంట ప్రయాణం తర్వాత కాత్రా చేరుకున్నాం. కాత్రా బస్టాండు ప్రక్కనే గల ఓ రెస్టారెంటుకు చేరాము. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వైష్ణవి మాత ఆలయం ప్రవేశమార్గం వరకూ ఆటోలో వెళ్లాము.

అక్కడి నుంచి నడుచుకుంటూ కొండపైకి వెళ్లాలి. 16 కిలోమీటర్ల మేర నడక సాగించాం. కొండపైకి వెళ్లేకొలదీ కోతుల సందడి ఎక్కువైంది. గుంపులు గుంపులుగా ఉన్నాయి. అయితే ఎవరిపైనా దాడి చేస్తున్నట్లు మాకు కన్పించలేదు. సందర్శకులు ఏదైనా ఆహారం వేస్తే తింటున్నాయి. ప్రకృతిలో దొరికే పళ్లను ఆరగిస్తున్నాయి.

మూడు కొండల దేవత
అమ్మవారి పేరు త్రిపుట. త్రిపుట కొండపై వెలసింది కనుక ఆమెకు ఆ పేరు వచ్చింది. అమ్మవారు కాళీ, లక్ష్మీ, సరస్వతి రూపంలో ఉంటుంది. ఈ స్వరూపమే వైష్ణవి మాత. భూలోకంలో ధర్మం, న్యాయం తప్పినప్పుడు ఏ దేవతైనా, దేవుడైనా ఆవిర్భవిస్తాడని కథలు చెపుతున్నాయి. అలాంటి ఆవిర్భావమే త్రిపుటదేవి. విష్ణుమూర్తి అంశలోంచి పుట్టింది కనుక ఆమెను వైష్ణవి మాతగా పిలుస్తారు.

స్థలపురాణం ప్రకారం... ముందుగా ఆమె దక్షిణాదిలో వెలిసింది. అక్కడ మానవజన్మ ఎత్తింది. చిన్నతనం నుంచి భక్తిభావం ఎక్కువ. ఎక్కువ భాగం ధ్యానంలో గడిపేది. ఓసారి తన తండ్రిని సముద్ర తీరానికి తీసుకవెళ్లమంది. అక్కడ ధ్యానం చేస్తుండగా శ్రీరాముడు తన భార్య సీతకోసం హనుమంత, సుగ్రీవ సైన్యంతో అక్కడకు వచ్చాడు. అప్పుడు ఈమె ధ్యానం గురించి తెలుసుకున్నాడు. ఆమెకు రాముని విషయం తెలిసింది. తనను వివాహమాడాల్సిందిగా కోరింది. అయితే అది సాధ్యపడదని రాముడు చెప్పాడట.

అయితే ఆ తర్వాత ఆమెకు ఓ అవకాశం ఇచ్చాడు. తిరిగి తను మళ్లీ వస్తాననీ, అలా వచ్చినపుడు తనను గుర్తుపడితే చేసుకుంటానని చెప్పాడట. అప్పటివరకూ ఉత్తరాదిలోని త్రిపుట కొండల్లో ధ్యానంలో ఉండమని శ్రీరామచంద్రులవారు సూచించారట. అలా కాత్రా వైపు ఉన్న కొండల్లో మాత ధ్యానం చేసుకుంది. ఆ తర్వాత శ్రీరాముడు ముని వేషధారణలో త్రిపుటను కలిశాడు. కానీ ఆమె గుర్తించలేదు. అలా ఆయన రాకకోసం ధ్యానముద్రలో మునిగిపోయి ఇప్పటికే అలానే ఉందన్నది భక్తుల విశ్వాసం.

బాలవైష్ణవి దేవి
త్రిపుట పర్వతాల నుంచి జమ్మూకు వెళ్లే మార్గంలో ఓ దంపతుల ఇంట దేవి పెరిగింది. అక్కడ ఐదో ఏటనే ధ్యానంలోకి వెళ్లింది. ఆమె గురించి తెలుసుకుని అప్పటి మహిళలు ఆమెను పూజించేవారు. కొందరు పరీక్షించేవారు. అటువంటి వారిలో రఘునాధ ఒకరు. అతడి నుంచి తప్పించుకుంటూ త్రిపుట పర్వతాలపైకి పారిపోయింది. అక్కడ రఘునాథ వెంబడిస్తే తన శక్తితో కోతులను రక్షణగా ఉపయోగించుకుంది. కోతులతో రఘునాధుడు ఘోరమైన యుద్ధం చేసి వాటిని చంపేశాడు. అయితే బాలవైష్ణవి తన శక్తిని ఉపయోగించి అతడిని సంహరించింది. తర్వాత తన తప్పును తెలుసుకుని మన్నించమని వేడుకోలు చేసుకుంటే... అమ్మవారిని దర్శించిన తర్వాత తనను దర్శించుకుంటే వారికి అంతా మంచే జరుగుతుందని సెలవిచ్చిందట. ఇది ఓ కథ.

పంచపాండవులు కట్టిన గుడి ఇది...
పాండవులు తమ అరణ్యవాసంలో బాల త్రిపుట గురించి తెలుసుకుని వచ్చారట. ఆమె ధ్యానం, భక్తికి, ధర్మానికి మెచ్చి అనంతరం దేవాలయాన్ని కట్టించారని ప్రతీతి. జమ్మూ నుంచి కాత్రాకు వెళుతుండగా నరోలి అనే గ్రామంలో ఆమె చిన్నతనంలో ధ్యానం చేసుకున్న ప్రాంతం గుడిగా మలిచారని అక్కడి గోడలపై రాతలు చెపుతాయ్.

పర్వతాలపై అందాలు...
16 కిలోమీటర్ల పర్వతారోహణ మధురానుభూతిని కలిగిస్తుంది. శీతాకాలం కావడంతో సాయంత్రం నాలుగు గంటలకే కొండ మినహా కింద ఏమీ కన్పించలేదు. ఆకాశం తెల్లటి వస్త్రంతో కప్పినట్లుగా ఉంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సూర్యాస్తమయం కనులవిందుగా సాగింది. ఎర్రటి పండు అలా కొద్దికొద్దిగా కిందికి దిగుతూ... ఈ రోజు శెలవు అన్నట్లుగా ఉంది. అరగంటపాటు ఆకాశం ఎరుపురంగు పరిచినట్లు శోభాయమానంగా భాసిల్లింది.

కొండపైకి ఎక్కేవారంతా తమ శక్తిమేరకు "జై మాతాదీ..." అంటూ భక్తి పారవశ్యంతో ముందుకు సాగుతుంటారు. కొన్నిచోట్ల ఏడుకొండల మెట్లను తలపింపచేస్తాయి. చిన్నపిల్లలు, నడవలేనివారిని తీసుకెళ్లేందుకు గుర్రాలపై తీసుకెళ్లే ఏర్పాట్లున్నాయి. ఒక్కో మనిషికి 350 నుంచి 500 వరకూ వసూలు చేస్తారు. ఇలా తీసుకెళ్లే వృత్తి చేసేవారంతా కాశ్మీరీయులే. ఇంకా త్వరగా దర్శనం చేసుకోవాలంటే హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది. కాకపోతే మనిషికి రూ. 4వేలు ఖర్చవుతుందట. మూడు కొండలపైకి తిరుగుతూ ఆలయానికి కొద్ది దూరంలో వదిలే్స్తారు. అక్కడ నుంచి గర్రాలపై వెళ్లొచ్చు. ఇవి కాకుండా వృద్ధులు, రోగులను తీసుకెళ్లేందుకు నలుగురు వ్యక్తులు తమ భుజాలపై కావడిలా మోస్తూ తీసుకెళ్లే ఏర్పాటు ఉంది. దీనికి రెండువేల రూపాయలు వసూలు చేస్తారు.

ఇలా 16 కిలోమీటర్ల నడుచుకుంటూ వెళితే... దర్శనద్వారం ద్వారా వెళ్లిన 20 నిమిషాలకు ఓ గుహలోకి ప్రవేశిస్తాం. అక్కడే త్రిపుటదేవి మూడు పిండాల రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని ధ్యానిస్తే అనుకున్నవి నెరవేరతాయని విశ్వాసం. దర్శనం అనంతరం దేవాలయం వెనక్కి వెళితే ఆలయం వెనుక గంగాజలం పడుతుంటుంది. వాటిని శిరసుపై చల్లుకుని తాగితే కొండపైకి ఎక్కిన శ్రమంతా మాయమైపోతుందని నమ్మకం. ఆ తర్వాత అక్కడ అమ్మవారి ప్రసాదాలు తీసుకుని కిందికి దిగుతూ ఈశ్వరాలయాన్ని దర్శించుకోవాలి. దీంతో అమ్మవారి దర్శనం పూర్తవుతుంది.

గుల్షన్ కుమార్ సేవ
అమ్మవారిని దర్శించుకునే భక్తుల్లో ఎక్కువభాగం ఉత్తరాదివారే. ముంబయి నుంచి ప్రముఖ నటీనటులు దర్శించుకుంటారు. సంజయ్ దత్ దర్శించుకున్న తరుణంలో భక్తులను కంట్రోల్ చేయడం కష్టతరమైందని పురోహితులు చెప్పారు. ఎక్కువగా నవరాత్రుల సమయంలో కొండపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కనీసం రెప్పపాటు కూడా అమ్మవారిని దర్శించుకునే సమయం ఉండదు. క్షణకాలంలో అక్కడి పూజారులు పంపించి వేస్తారు.

ఇలా అమ్మవారిని దర్శించుకున్న వారికి ఆమె ఆశీస్సులు ఉంటాయని గ్రంథాలు చెపుతున్నాయి. కాకపోతే ఇక్కడో విషయం గమనించాలి. అమ్మవారిని దర్శించుకోవాలనుకున్న సమయం నుంచి పూర్తయి ఇంటికి తిరిగి వెళ్లేవరకు మాంసాహారం సేవించకూడదని నిబంధన ఉంది. ఏదేమైతే.. కొంతమంది అలా దర్శించుకుని మాంసాహారాన్ని మానివేసినవారు, తాగుడును మానేసినవారు, చెడు ఆలోచనలను కంట్రోల్ చేసుకున్నవారు ఉన్నారని చెపుతారు.