గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu
Last Modified: గురువారం, 20 నవంబరు 2008 (00:16 IST)

శనీశ్వరుని దివ్య సన్నిధి శనిశింగణాపూర్

దైవ భక్తి ప్రాతిపాదికన హిందువులకు ఉన్న నమ్మకాలు అన్నీ ఇన్నీ కావు. లేక్కలేనన్ని దేవుళ్లను పూజించే హిందువులు ఆ దేవుళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శక్తి ఉందని ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే హిందువులు ఒక్కో దేవున్నీ పూజించే విధానంలో ఎన్నో వ్యత్యాసాలు మనకు స్పష్టంగా గోచరిస్తాయి.

మనకున్న తొమ్మిది గ్రహాలను దేవుళ్లుగా నమ్మి కొలవడం హిందూ సాంప్రదాయంలో ఉన్నదే. అయితే ఈ గ్రహాల్లో శని గ్రహానికి ఓ విశిష్టత ఉంది. అందరి దేవుళ్ల చూపు తమపై ఉండాలని పూజించే భక్తులు శనీశ్వరుని చూపు తమపై ఉండకూడదని గాఢంగా కోరుకుంటారు. శనీశ్వరునికి కోపం వచ్చి మన జీవితంపై ప్రభావం చూపిస్తే ఇక లోకంలోని కష్టాలన్నీ తమకే కల్గుతాయని నమ్మడం వల్లే హిందువులు ఈ విధంగా భావిస్తారు.

అందుకే తమపై శని ప్రభావం పడరాదని కోరుకుంటూ ఆ శనీశ్వరుని ప్రార్థిస్తారు. ఈ కారణంగానే భయపడే దేవుడైనాకూడా శనీశ్వరునికి సైతం అక్కడక్కడా దేవాలయాలు నిర్మించి విశేషమైన పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా శనీశ్వరునికోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆలయాలు భారతదేశం మొత్తం మీద కొన్ని మాత్రమే ఉన్నాయి.

అలా శనీశ్వరుని పేరుమీద ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శనిశింగణాపూర్ కూడా ఒకటి. శనిశింగణాపూర్‌లో కొలువైన శనీశ్వరుని నిష్టగా పూజిస్తే ఆయన కల్గించే చెడు ప్రభావమేదీ మనపై పడకుండా కేవలం ఆయన ఆశీస్సులు మాత్రమే మనకు కల్గుతాయని భక్తుల విశ్వాసం.

శనిశింగణాపూర్ విశేషాలు
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా నెవాసా తాలుకాకు చెందిన ఓ సుందరగ్రామమే ఈ శనిశింగణాపూర్. చూచేందుకు ఓ చిన్న గ్రామంగా ఉన్నా శనిశింగణాపూర్‌కు ఎన్నో విశిష్టతలున్నాయి. ఓ ఆదర్శగ్రామంగా పేరు తెచ్చుకున్న ఈ గ్రామం కేవలం శనీశ్వరుని ఆలయం వల్లే కాకుండా ఆచార వ్యవహారాలు, గ్రామ కట్టుబాట్ల విషయంలో అందరికీ ఆదర్శంగా ఉండడం విశేషం.

దాదాపు 3000 వరకు జనాభా కల్గిన ఈ గ్రామంలో ఉండే దాదాపు 450 గృహాలలో ఏ ఇంటికీ తలుపులు ఉండకపోవడం విశేషం. ఈ గ్రామంలో కొలువైన శనీశ్వరుడు తమను నిత్యం వెన్నంటి కాపాడుతుంటాడని... అలాంటపుడు గృహాలకు తలుపులు బిగించుకోవాల్సిన అవసరం ఏముంది అన్నది ఈ ఊరివారి ప్రశ్న. వీరి మాటలు నిజమే అన్నట్టు ఈ ఉరిలో ప్రస్తుతం కట్టబడే గృహాలకు సైతం తలుపులు బిగించకపోవడం గమనార్హం.

ఈ విషయం వల్లే ఈ ఊరు గిన్నీస్‌బుక్‌లో కూడా స్థానం సంపాధించింది. దొంగతనం అన్న ఊసే ఎరగని ఈ ఊరిలో పోలీస్‌స్టేషన్ కూడా లేదు. అలాగే ఊరికి సంబంధించి ఏదైనా వివాదం ఎదురైనా ఊరి పెద్దలే దానిని పరిష్కరించడం మరో విశేషం. ఇలాంటి అద్భుతమైన అంశాలు కల్గిన ఊరిలో వెలిసిన శనీశ్వరునికి సైతం ఎలాంటి ఆలయం లేకపోవడం మరో విశేషం.


శనిశింగణాపూర్‌లో కొలువైన శనీశ్వరుడు ఆరుబయటే కొలువై ఉంటాడు. నల్లని రాతితో దాదాపు శివలింగం ఆకారంలో ఉండే శింగణాపూర్ శనీశ్వరుడు 16 అడుగుల 16 అంగుళాల పొడవు, 3 అడుగుల వెడల్పు గల సమ చతుర్భుజ ఆకారంలో నిర్మితమైన ఓ ప్లాట్‌ఫారంపై కొలువై ఉన్నాడు. దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగుల వెడల్పుతో ఉండే శనీశ్వరుని విగ్రహం ఎప్పుడూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది.

శనీశ్వరుని ఆలయప్రాంగణం ప్రస్తుతం ఆధునిక వసతులతో విస్తృతమవుతున్నా స్వామివారు మాత్రం ఎప్పుడూ ఆరుబయటే ఉండడం విచిత్రమే.

శనీశ్వరునికి పూజలు
శనిశింగణాపూర్‌లోని శనీశ్వరునికి జరిగే పూజా విధానం కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రతి నెలా అమావాస్య మరుసటిరోజు చంద్రోదయం రోజున ఈ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శిస్తారు. అలాగే శని త్రయోదశి, సోమవారం రోజుల్లో భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది.

ఈ ఆలయంలోకి మగవారు ప్రవేశించే ముందు తలారా స్నానం చేసి తప్పక కాషాయం రంగు పంచెలు ధరించాలి. అటుపై శనీశ్వరుని దర్శించి తైలాభిషేకం జరిపిస్తే స్వామివారి అనుగ్రహం కల్గుతుందని నమ్మకం. ఈ ఆలయంలో మహిళలకు కూడా ప్రవేశం ఉన్నా స్వామివారిని ప్రతిష్టించిన ప్లాట్‌ఫారంను వారు తాకరాదనే నిబంధన ఉంది.

రవాణా సౌకర్యాలు
దేశంలోనే ప్రఖ్యాతి చెందిన, సాయిబాబా కొలువైన షిర్డీకి దాదాపు 62 కిలోమీటర్ల దూరంలో ఈ శనిశింగణాపూర్ ఉంది. షిర్డీని దర్శించినవారు శనిశింగణాపూర్‌ను కూడా దర్శించడం ప్రస్తుతం ఆనవాయితీగా మారింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే శనిశింగణాపూర్‌లో మంచి వసతులు అందుబాటులో ఉన్నాయి. సాధారణ గదులతో పాటు లగ్జరీ సదుపాయాలు కూడా భక్తులకు అందుబాటులో ఉండడం విశేషం.