గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

శివుడి ఆత్మలింగం భూమిపై వెలసిన "మురుడేశ్వర"..!!

PTI
రావణుడు పరమశివుడు ప్రసాదించిన ఆత్మలింగంపై నున్న వస్త్రాన్ని విసిరివేయగా, ఆ వస్త్రం పడిన ప్రాంతమే "మురుడేశ్వర"గా అవతరించింది. ఈ మురుడేశ్వర కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోగల భట్కల్ తాలూకాలో ఒక పట్టణం. శివుడి పుణ్యక్షేత్రమైన ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన శివుడి విగ్రహం కొలువైయున్న ఈ పట్టణంలో పరమశివుడు "మురుడేశ్వరుడు"గా నిత్యపూజలందుకుంటున్నాడు.

పురాణాల ప్రకారం మురుడేశ్వర చరిత్రను చూస్తే.. రావణాసురుడు అకుంఠిత దీక్షతో తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి, ఆయన ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకువస్తాడు. భూమిమీద ఆత్మలింగాన్ని ఎక్కడయితే ఉంచుతారో, అక్కడ అది స్థాపితం అయిపోతుందనీ, తిరిగీ దాన్ని ఎత్తుకోవటం సాధ్యంకాదని.. పరమశివుడు ఆత్మలింగం ఇచ్చేటప్పుడే రావణాసురుడికి ఒక నిబంధన పెడతాడు.

అయితే రావణుడు పరమశివుడి ఆత్మలింగాన్ని గనుక లంకలో ప్రతిష్టించితే నష్టం జరుగుతుందని భావించి దేవాధిదేవతలు మహావిష్ణువును వేడుకొంటారు. దాంతో విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లుగా చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయ్యిందని భావించి సంధ్య వార్చుకునేందుకు సిద్ధపడతాడు.

ఈలోగా విషయం తెలుసుకున్న నారద మునీంద్రుడు వినాయకుడి వద్దకు వచ్చి, రావణాసురుడివద్దనున్న ఆత్మలింగం తీసుకుని భూమిపై పెట్టాలని నూరిపోసి పంపిస్తాడు. రావణుడు సంధ్యవార్చుకునే సమయానికల్లా బ్రాహ్మణవేషంలో వెళతాడు వినాయకుడు. ఆ బ్రాహ్మణ బాలుడిని చూసిన రావణుడు సంధ్య వార్చుకునేంతదాకా ఆత్మలింగాన్ని పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఈ లింగం చాలా బరువుగా ఉంటే తాను ఎక్కువసేపు మోయలేననీ, మోయలేనప్పుడు మూడుసార్లు తమను పిలుస్తాననీ.. మీరు రాకపోతే ఈ లింగాన్ని భూమిపై ఉంచేస్తానని అంటాడు బాల బ్రాహ్మణుడి రూపంలోని వినాయకుడు.

రావణుడు అందుకు అంగీకరించి ఆత్మలింగాన్ని బాల బ్రాహ్మణుడి చేతిలో పెట్టి సంధ్య వార్చుకునేందుకు వెళతాడు. రావణుడు వెళ్లిన కాసేపటికే తాను లింగాన్ని మోయలేకపోతున్నానంటూ వినాయకుడు మూడుసార్లు పిలుస్తాడు. సంధ్యవార్చే కార్యక్రమం మధ్యలో ఉండటంతో కాస్త ఆలస్యంగా వస్తాడు రావణుడు. ఈలోగా వినాయకుడు ఆత్మలింగాన్ని భూమిమీద పెట్టేస్తాడు. దాంతో కోపంతో రావణుడు వినాయకుడి నెత్తిపై మొత్తగా, అతడికి గుంట పడుతుంది.

ఈలోగా తాను అనుకున్న కార్యం నిర్విఘ్నంగా జరిగిపోవటంతో సంతోషించిన విష్ణువు, మాయపొరను తొలగిస్తాడు. దీంతో వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. వెంటనే విషయాన్ని గ్రహించిన రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో పెకిలించే ప్రయత్నం చేస్తాడు. లింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నంచేసి విసిరివేయగా అది గోకర్ణ అనే ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరంలోని "సజ్జేశ్వర" అనే ప్రదేశంలో పడుతుంది.

FILE
అలాగే ఆత్మలింగం పైనుండే మూతను తొలగించి రావణుడు విసిరివేయగా అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలోని "గుణేశ్వర" అనే ప్రాంతంలో పడుతుంది. లింగంపైనుండే వస్త్రాన్ని విసిరివేయగా అది కందుక పర్వతంపైనుండే "మృదేశ్వర"లో పడుతుంది. ఈ మృదేశ్వర ప్రాంతమే కాలక్రమంలో "మురుడేశ్వర"గా రూపాంతరం చెందింది. కాగా.. వినాయకుడు ఆత్మలింగాన్ని మోయలేక భూమిపై ఉంచిన ప్రదేశం "గోకర్ణ"గా కీర్తించబడుతోంది.

మురుడేశ్వరలో పర్యాటక ప్రదేశాల విషయానికి వస్తే.. మురుడేశ్వర ఆలయం, మురుడేశ్వర ఆలయ గోపురం, మురుడేశ్వర కోట, శివుని విగ్రహం ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశాలు. మూడువైపులా అరేబియా సముద్రం ఆవరించే ఉండే కందుక పర్వతంపై "మురుడేశ్వర ఆలయం" ఉంది. ఈ ఆలయం గాలి గోపురం 20 అంతస్థులతో భక్తులను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో రెండు నిజమైన ఏనుగులు అందరినీ పలుకరిస్తాయి.

మురుడేశ్వర ఆలయం వెనుకభాగంలో ఉండే "మురుడేశ్వర కోట" టిప్పు సుల్తాన్ కాలంలో పునరుద్ధరించబడింది. ఆ తరువాత చూడాల్సిన మరో ముఖ్య ప్రదేశం ప్రపంచంలోనే అతి పెద్దదైన "శివుడి విగ్రహం". ఆలయ సముదాయంలో ఉండే ఈ శివుడి విగ్రహం చాలా దూరంనుంచే కనిపిస్తుంటుంది. 123 అడుగులు (37 మీటర్లు) ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల కాలం పట్టినట్లు చెబుతారు. సూర్యరశ్మి పడినప్పుడు చటుక్కున మెరవటం ఈ విగ్రహం యెక్కు ప్రత్యేకత.

మురుడేశ్వర ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, మురుడేశ్వరకు సమీప విమానాశ్రయం మంగళూరు. ఇది మురుడేశ్వరకు 165 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హుబ్లీ, పనాజీ విమానాశ్రయాలు ద్వారా కూడా మురుడేశ్వరకు సమీప విమానాశ్రాయాలు. మంగళూరు, హుబ్లీ, పనాజీ విమానాశ్రయాలకు చేరుకుని.. తరువాత రోడ్డు మార్గంలో మురుడేశ్వర చేరవచ్చు.

రైలు మార్గంలో అయితే.. మురుడేశ్వరకు సమీప రైల్వేస్టేషన్ కొంకణ్. ఈ స్టేషన్‌లో ముఖ్యంగా ఫ్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. మంగళూరు నుంచి మార్మగోవావరకు నడిచే ఫ్యాసింజర్ ఇక్కడ ఆగుతుంది. బెంగళూరు నుంచి మురుడేశ్వరకు సరాసరి రైలు సౌకర్యం లేదు. భట్కల్ వరకు రైల్లోవచ్చి, అక్కడినుంచి కొంకణ్ మీదుగా మురుడేశ్వర చేరుకోవచ్చు.

రోడ్డు మార్గంలో అయితే.. హొన్నావర్-భట్కల్ మధ్య నున్న జాతీయ రహదారి-17 మీద మురుడేశ్వర అని ఒక తోరణం స్వాగతం పలుకుతుంది. తోరణం నుండి ఒక కిలోమీటర్ దూరం తూర్పు వైపు పయనిస్తే.. మురుడేశ్వర పట్టణం చేరుకోవచ్చు. బెంగళూరు నుండి జాతీయ రహదారి-206 ద్వారా హొన్నావర్ చేరుకొని అక్కడినుంచి, జాతీయ రహదారి-17లో ప్రయాణిస్తే మురుడేశ్వర చేరవచ్చు. బెంగళూరుకు మురుడేశ్వర 455 కి.మీ. దూరంలో ఉంటుంది. అదే మంగళూరు నుంచయితే 180 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మురుడేశ్వర చేరుకోవచ్చు.