గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

షిర్డీసాయి దర్శనంతో చెప్పలేని అనుభూతి కలిగింది

ఎం.కృష్ణ

WD
షిర్డీ ఒకప్పుడు చిన్న గ్రామం. సాయివల్లే ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ మున్సిపాలిటీ అభివృద్ధి కాలేదు. కేవలం టూరిజం వల్లనే ఏదైనా అభివృద్ధి జరిగింది. షిర్డీలో 425 హోటళ్లున్నాయని మాతోటి వచ్చిన సూపర్‌వైజర్ చెప్పాడు. చుట్టుపక్కల స్టార్‌ హోటల్స్‌ కూడా ఉన్నాయి. కానీ రోడ్లు బాగోలేదు.. వాటిని బాగు చేయవచ్చుగదా.. అంటే... ఈ వీధిలో రోడ్డు బాగు చేయాలంటే.. రెండు లక్షలు ఖర్చవుతుంది. దానికి సగం మున్సిపాలిటీ పెట్టుకుంటుంది. మిగిలింది పెట్టుకుంటే రోడ్డు పడుతుంది. కానీ అది ఎవరు ఇవ్వాలనేది ప్రశ్న. అందుకే ఎవరికివారు మాకెందులే అని వదిలేశారు... అంటూ వివరించాడు.

ఇవన్నీ మీకెందుకులెండి.. అంటూ.. శనిసింగనాపూర్‌కు ఎలా వెళ్ళాలి. వెళ్ళాక ఏంచేయాలి.. అంటూ పూసగుచ్చినట్లు చెప్పాడు... కారు ఎరేంజ్‌ చేస్తామని చెప్పాడు... అలాగే కారు తెప్పించాడు.. రానూ పోనూ... వెయ్యిరూపాయలకు మాట్లాడాడు.. 'మీరు అక్కడకు చేరగానే.. చుట్టుపక్కల షాపులవారు మూగేస్తారు. నవ్వులనూనె కొనండి. పూజకు సామానులు కొనండి. అంటూ.. 350 నుంచి 500రూపాయలవరకు తీసుకుంటారు. అందులో 150 రూపాయలు కారుడ్రైవర్‌ కమిషన్‌ ఉంటుంది. అందుకే అవన్నీ వద్దు.. కేవలం నూనె మాత్రమే శని విగ్రహానికి పోస్తే సరిపోతుంది. అక్కడ నుంచి ఏమీ కొనకూడదు. కొని తీసుకుని రాకూడదు. అంటూ కొన్ని టిప్స్‌ చెప్పాడు. కారుడ్రైవర్‌కు జాగ్రత్తలు చెప్పి.. మమ్మల్ని సాగనంపాడు.

అలా 3 గంటలకు బయలుదేరి కొన్ని గ్రామాల మీదుగా డ్రైవర్‌ తీసుకెళ్ళాడు. చక్కటి పొలాలు.. అప్పుడే విరబూసిన పువ్వులు, ఎక్కువగా మందారాల చెట్లు కన్పించాయి. పొలంలో పనిచేసే రైతులు.. చల్లటి గాలి చాలా చల్లటి వాతావరణం. మనస్సుకు ఆహ్లాదాన్ని కల్గించాయి. అప్పటికే సన్నగా తుంపర పడుతోంది. హైదరాబాద్‌లో సమ్మర్‌ని తలపించే ఎండలు కాస్తున్నాయి. ఇక్కడ చాలా చల్లగా ఉంది వాతావరణం. కారులో ముందు సీటులో కూర్చోటం వల్ల... రెండు వైపుల పొలాల మధ్యలో నల్లటి రోడ్డుపై ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒక చోట చుట్టూ పెద్దచెట్లు అటూ ఇటూ వాలి ఉండటంతో లాంగ్‌షాట్‌లో గుహను తలపించేలా అనిపించింది. తీరా దగ్గరగా చూస్తే.. వాటి అమరిక ముచ్చటేసింది.

పైన ఆకాశం మేఘావృతమై గొడుగులా కప్పింది. చుట్టూ నల్లటి మేఘాలు కమ్మేశాయి. ఆ మేఘాలు కూడా చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించాయి. రెక్కలుంటే ఎగిరి వాటిని అందుకోవచ్చన్నంతగా అనుభూతినిచ్చాయి. ఆ మేఘాలు ఓచోట ఆగిపోయినట్లున్నాయి. ఆ తర్వాత ఎండగా ఉన్నట్లు తెల్లటి వెలుతురు కన్పించింది. అది హైదరాబాద్‌ అని మా కొలీగ్‌ చెప్పాడు... అంటే.. శనిసింగనాపూర్‌ వెళ్ళాంటే మళ్ళీ వెనక్కు వెళ్ళాలన్నమాట. అలా గ్రామాలు దాటుకుంటే వస్తుంటే.. 'బడే గావ్‌', 'శ్రీరాంపూర్‌..' వంటి గ్రామల పేర్లు కన్పించాయి.

ఇవి ఎక్కడో విన్నట్లు అనిపించింది. ఆలోచిస్తే... షారూక్ ఖాన్‌ సినిమాల్లో కొన్నిచోట్ల ఈ పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు గుర్తుకు వచ్చింది. అలా ప్రయాణిస్తూ... శనిసింగనాపూర్‌కు దగ్గరగా ఓ గ్రామానికి చేరాం. అక్కడ అంతా చెరకు తోటలే... రోడ్డు చుట్టుపక్కల ఎద్దులతో చెరకు రసాన్ని తీసే రాట్నం లాంటిది అమర్చారు. అక్కడక్కడ కొంతమంది యాత్రీకులు అక్కడ సేదతీరి చెరకు రసాన్ని తాగుతున్నారు. పూర్వం ఇలాంటి పద్ధతితో నూనెను తయారుచేసేవారట. కరెంటు వున్నా మిషన్లు లేకుండా ఎద్దులతో సహజసిద్ధంగా చెరకురసం బాగుంటుందని... కారు డ్రైవర్‌ చెప్పాడు.. ఇదేదో రిటర్న్‌లో తాగి తీరాలని అనుకున్నాం.

ఇక.. శనిసింగనాపూర్‌కు ఎంటర్‌ కాగానే.. చెక్‌పోస్ట్‌ లాంటిది వచ్చింది. అక్కడ కొంతమంది.. కారు ఆపి.. ఎంతమంది ఉన్నారని డ్రైవర్‌ని అడిగాడు. ఆరుగురు అని చెప్పగానే.. 12రూపాయలు అడిగాడు.. అలా లోపలికి వచ్చాం...

తలుపులేని ఇళ్లు కన్పించలేదు
శనిసింగనాపూర్‌లో తలుపులు లేని ఇళ్లు ఉంటాయని చెబుతుంటారు.. కానీ అభివృద్ధి చెందినట్లుగా.. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కన్పించాయి... అంటే ఇంకా లోపలికి వెళ్లాలేమో మరి... మా కారు పార్కింగ్‌ చేయగానే.. కారుడ్రైవర్‌.. అక్కడి షాప్‌వాడితో ఏదో మాట్లాడాడు. పొలోమంటూ... కొంతమంది వచ్చారు.. మీరు తెలుగువారా.. అంటూ వాడు తెలుగులో మాట్లాడి.. పూజ చేయాలి... అంటూ... రకరకాల వస్తువులు తీసుకోవాలి అన్నాడు. మాకేం వద్దు.. ఓన్లీ... నూనె మాత్రమే అన్నాం... నూనె పోస్తే.. మీ భార్యకే ఫలితం దక్కుతుంది. మీకు దక్కాలంటే... పూజ చేయించాలి. అంటూ ఏవేవో చెప్పాడు. ఇవేమీ పట్టించుకోకుడా మేము వచ్చేస్తున్నాం. అయినా వీడకుండా మమ్మల్నివెంటాడారు.. మేం వద్దని ఖరాఖండిగా చెప్పాం. దాంతో వదిలేశారు... అలా శనీశ్వరుని గుడి లోపల ప్రవేశించాం.

అసలు ఇదివరకు.. లోపలకు ప్రవేశించాలటే.. తలస్నానంచేయాలి. అక్కడివారు ఇచ్చే దుస్తులు ధరించాలి. శనికి అభిషేకం చేశాక... ఆ వస్త్రాలు తిరిగి ఇచ్చేయాలి.. ఈ పద్ధతి మొత్తం ఏడాది నుంచి ఎత్తేశారట. వచ్చిన భక్తులు... లోపల ఉండే పంపుల్లో నుంచి నీళ్లు మీద జల్లుకుని దాన్నే స్నానంగా భావిస్తారు. అయితే మహిళలు లోపలికి రాకూడదు- అనేది నిబంధన అట. కానీ వారుకూడా పురుషులతోపాటు వచ్చి కొద్ది దూరంలో ఉంటారు. ఇక శనీశ్వరుని విగ్రహం మన నవగ్రహాల రీతిలో ఉండదు... '1' ఆకారంతో రాతితో చెక్కినట్లుంది. ఎత్తయిన ప్రదేశం ఉంది. దానిపైకి ఎవ్వరినీ రానివ్వరు. నల్లటి వస్త్రాలు ధరించిన పూజారులు మాత్రమే భక్తులు ఇచ్చే నూనెను వాళ్లే పోస్తారు.

ఇలా వేలాది మంది భక్తులు ఇచ్చేవి పోయడం కష్టం కనుక.. అక్కడే పెద్ద బాండీని పెట్టారు. అందులో భక్తులు తెచ్చుకున్న నూనె పోస్తే.. అది నిండగానే.. పూజారులు దాన్ని తీసుకెళ్ళి శనివిగ్రహంపై అభిషేకిస్తారు. దాన్ని చూసి మనం అభిషేకించేశామని ఫీలింగ్‌లో ఉండాలన్నమాట. ఆ తర్వాత ఆ పూజారిని టచ్‌ చేయాలని చాలామంది ఎగబడుతుంటారు. అలా చేస్తే... మనం శని విగ్రహానికి టచ్‌చేసిన ఫీలింగ్‌... అలా అయ్యాక.. వెనక్కు తిరగకుండా బయటకువచ్చేయాలి. అలా వచ్చాక మళ్ళీ పంపుల దగ్గర కాల్ళుచేతులు. తలపై నీళ్ళుపోసుకోవాలి. దీంతో శనినింగనాపూర్‌ యాత్ర ముగిసినట్లే..

తిరిగి వస్తూ.. మొదట అనుకున్నట్లు చెరకురసం త్రాగాం. తీపిగా బాగానే ఉంది. అదే సిటీల్లో చెరకును పదిసార్లు మిషన్‌లో పెట్టి... పిప్పిల్లోంచి కూడా రసాన్ని తీసి అందులో ఐస్‌వేసి... పెప్పర్‌వేసి.. రకరకాల టేస్టులతో అమ్మేస్తుంటారు. దాన్ని మనం తాగేస్తాం.. కానీ స్వచ్చంగా రెండేసార్లు చెరకు గడలు చెక్కలాంటి మిషన్లులో వాడాడు. ఆ తర్వాత తీసేశాడు. ఒరిజినల్‌ చెరకుసరం తాగామని చక్కటి అనుభూతికి గురయ్యాయి. ఒక్కగ్లాసు 6 రూపాయలు తీసుకున్నాడు. అవి తాగాక మా కొలీగ్‌ మూత్రం కోసం రోడ్డుపక్కకి వెళుతుండగా దాన్ని గ్రహించిన అక్కడి వ్యక్తి పిలిచి లోపల బాత్‌రూమ్‌ చూపించాడు. మాకు ఆశ్చర్యమేసింది. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుంటారని కారు డ్రైవర్‌ చెప్పాడు. అదే మన పల్లెటూరిలో వాతావరణం వేరుగా ఉంటుంది. రోడ్డుపైనే మలమూత్రాలు వదిలేస్తారు. పెద్ద సిటీ అని చెప్పుకునే హైదరాబాద్‌లో కూడా ఇదే తంతు. నిజంగా ఆ గ్రామం శుభ్రతను చూసి ముచ్చటేసింది.

ఈసారి కారుడ్రైవర్‌ వేరే రూటులో వచ్చాడు. వచ్చేటప్పుటి పొలాలు కన్పించలేదు. హైవేలో షార్ట్‌కట్‌లో తీసుకొచ్చాడు. మొత్తానికి 8 గంటకు షిర్డీ గుడి దగ్గర దిగాం. కారును పంపించేశాం. బాబాపార్క్‌ ఉంది చూద్దామన్నాడు మా కొలీగ్.. అలా లోపలికి వెళ్ళి బాబా ఆనాడు పెంచిన ఉద్యానవనాన్ని కళ్లారా చూశాం. ఆయన చెట్లకు నీరుపెట్టే బావిని చూశాం. అది ఇప్పుడు నిరుపయోగంగా ఉంది. అక్కడే రావిచెట్టు, వేపచెట్టు ఉన్న ప్రాంతాన్ని గమనించాం. అక్కడ దివ్యజ్యోతి.. అంటే.. ఆనాడు బాబా వెలిగించిన జ్యోతి అట. దాన్ని కొండెక్కకుండా నిరంతరం వెలిగిస్తుంటారట.

అలా కాసేపు ఆ పార్కులో గడిపాం. ఒక మూల దత్తాత్రేయ విగ్రహం ఉంది. అక్కడ కొందరు మరాఠీ వారు దీపాలు వెలిగించి పూజిస్తున్నారు. అరగంట గడిపాక... తిరిగి రూమ్‌కు వచ్చాం. భోజనాలు చేశాక... అందరూ రూమ్‌లో రిలాక్స్‌ అయ్యాం. అందరూ అలసిపోవడంతో.. త్వరగా నిద్రపోయాం. తెల్లవారుజామున 4గంటలకు అలారం పెట్టాం.

అనుకున్నట్లు నిద్రలేచి అంతా గుడికి వెళ్ళటానికి సిద్ధమయ్యాం. అప్పటికే మేమున్న హోటల్‌ ఫుల్‌ అయింది. బయటకు వచ్చి చూస్తే.. రెండుబస్సులు, 6 కారులు ఎదురుగా ఉన్నాయి. ఎవరో పెండ్లి బృందం వచ్చిందని హోటల్‌వాడు చెప్పాడు. మామలూగానే ఇలా ఉంటే... పండుగ రోజుల పరిస్థితి ఏమిటని అడిగితే.. అప్పుడు రూమ్స్‌ దొరకవని చెప్పాడు. ఈసారి వస్తే... 7రోజుల ముందు ఫోన్‌ చేయండని విజిటింగ్‌ కార్డు ఇచ్చాడు. ఇక పొద్దునే టీ తాగే అలవాటు ఉండటంతో మా కొలీగ్‌ టీ కోసం ఎదురుచూసి తాగాక గుడికి బయలుదేరాం. 7 గంటలయింది. అప్పటికే హారతి దర్శనం దాటిపోయింది. స్వామి దర్శనం చేసుకుందామని అనుకున్నాం.

నిన్నటిలాగా రద్దీలేదు. లోపల కాస్త ఖాళీగానే ఉంది. పై అంతస్తులోకి వెళ్ళేసరికి కాసేపు ఆపారు. ఆ తర్వాత ఒక మార్గం ద్వారా మమ్మల్ని వదిలారు. అలా వెళ్లి షిర్డీసాయి ఎదురుగా వచ్చాం. ఆ సన్నివేశం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. చాలా దగ్గరగా చూడగలగాను. అలా కాసేపు తదేకంగా చూస్తున్నాను. పక్కన వాలంటీర్లు తడుతున్నా స్పృహ లేదు. అలా తృప్తిగా దర్శించుకుని బయటకు వచ్చాను. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. దేవుడిని చూశాక ఫలానా అడగాలి. ఫలానాది కోరుకోవాలనేది.. మనసులో ఉండేది. కానీ విగ్రహన్ని చూశాక.. ఏ ఆలోచనలు రాలేదు. ఆయన్నే చూడటం జరిగింది. ఇదే ఫీలింగ్‌ మా కొలీగ్‌ వ్యక్తం చేశాడు.

WD
వేప ఆకు చేదుగానే ఉంది
స్వామిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాం. అక్కడ ఉన్న వేపచెట్టును దర్శనం చేసుకున్నాం. ఆ చెట్టు ఆకు రాలితే దాన్ని తినాలని అనుకున్నాం. దానికోసం వెయిట్‌ చేశాం. కాసేపటికి పండిన ఆకు రాలి కింద పడింది. దాన్ని తీసుకోవడానికి కాస్త కష్టం అనిపించినా ఎలాగో చేయి పెట్టి తీసుకున్నాను. ఆ కాకును నలిపి చిన్నముక్కలుగా చేసి నాతోపాటు వచ్చినవారికి పెట్టాను. కానీ నాకు చేదుగానే అనిపించింది. మరి తియ్యగా లేదే అని అడిగాను. దానికి మా కొలీగ్‌ సమాధానం చెప్పలేదు.

ఈ ఆకు తింటే మంచిదంటూ ఆయన చిన్నముక్కనే నోట్టో వేసుకున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి టిఫిన్‌ చేశాం. మళ్ళీ లోపలకి వచ్చి మ్యూజియంను దర్శించుకున్నాం. బాబా వాడిన పరికరాలు, వస్త్రాలు అన్నీ దర్శించుకున్నాం. కొందరు బహూకరించిన కుర్చీలుకూడా ఉన్నాయి. కానీ ఆయన వాటిని ఎప్పుడూ వాడలేదట. అలాగే నల్లటి రాయి ఉంది. దానిపైనే బాబా స్నానం చేసేవారట. అవన్నీ చూసి వింత అనుభూతికి గురయ్యాం.

అభిషేకం
అప్పటికే అభిషేకానికి సమయం కావడంలో 10 గంటలకు అభిషేకం చేసే ప్రాంతానికి వచ్చాం. అదికూడా గుడిలో ఒక భాగం. కుటుంబాలతో అభిషేకం చేయించుకుంటారు. టిక్కెట్‌ చూపాగానే.. పూజారి... ఒక కొబ్బరి కాయ, పసుపు, కుంకుమ, పూలు ఇచ్చాడు. అభిషేకం అంతా మనం చేసుకునే తరహాలోనే సాగింది. కాకపోతే మరాఠీ భాషతో సంస్కృతం కలిపి మంత్రాలు చదివాడు. 45 నిముషాలపాటు సాగింది. అభిషేకం తర్వాత అందరూ పూజారీ పాదాల ఆశీర్వాదం తీసుకున్నారు. కొబ్బరికాయను ఇంటికి వెళ్ళాక ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటిపైన కిటికీకి కడితే శుభం జరుగుతుందని నమ్మకం. అందుకే దాన్ని జాగ్రత్తగా తీసుకువచ్చాం. ఆ తర్వాత ప్రసాదాలు కొన్నాం. పాలకోవా అక్కడ స్పెషల్‌. స్పెషల్‌ పాలకోవా 600 రూపాయల వరకు ఉంది. మామూలు పాలకోవా అయితే 30 రూపాయలే. అక్కడా పెద్ద లైన్‌ ఉంది.

ఆ తర్వాత బాబా శిష్యులు, ఆయనతోటు ఉన్న వారి సమాధులు దర్శించుకున్నాం. ఇంకా
1. సమాధి మందిరం.. అంటే షిర్డీ దర్శనం.
2. చావడి.. ఇక్కడే బాబా విశ్రాంతి తీసుకునేవారట.
3. ద్వారకామయి.. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ కాసేపు కూర్చుని వెళుతుంటారు.
4. మహల్పావతి ఇల్లు..
5. లక్ష్మీభాయి సమాధి (9 నాణేలు) .బాబా ఆమెకు 9 నాణేలు ఇచ్చిన గుర్తుగా అవి చూడవచ్చు. అక్కడే ఉన్న చెక్కలాంటి స్తంభాన్ని ఆనుకుని బాబా భోజనం చేసేవారట. దాన్ని టచ్‌ చేయకుండా చుట్టూ తీగలు కట్టారు.
6.హనుమాన్‌ మందిరం
7. శ్యామా మందిరం
8. గణేష్‌మందిరం. 9. శని మందరిం. 10. శివమందిరం.
11. ఖండోబా మందరిం. ఇది.. ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా గల ప్రాంతం. ఇక్కడే సాయిని చూసి ఖండోబా అనే జమీదార్‌ పకీరు అని పిలిచాడట.

ఇవి కాకుండా చుట్టుపక్కల చూడాలంటే కాస్త దూరంలో ఉన్న వాటికి ట్రావెల్‌ ఏజెన్సీవారు ఏర్పాటు చేస్తారు.

1.ముక్తిదామ్‌. బిర్లామందిరం..సర్వ దేవతా విగ్రహాలు ఉంటాయి.
2.త్రయంబకేశ్వరం.. 10వ జ్యోతిర్లింగం. గోదావరి పుట్టుక ఇక్కడే.
3.పంచవటి... రామాయణంలో చెప్పబడిన ప్రాంతం.
4. ఎల్లోరా గుహలు... ఇవన్నీ.. చూడాలంటే.. తీరిక చూసుకుని వస్తే...వాటిని ఆస్వాదించవచ్చు.

ఇక షిర్డీ సాయిని దర్శనం చేసుకున్నాక మనకు తెలీని ఏదో మనశ్శాంతి మనల్ని ఆవరిస్తుంది. ఏ శక్తి లేనిదే కోట్లాదిమంది వచ్చి ఆయన్ను దర్శించుకోరుగదా. అదే అనుభూతి కలిగింది. మన పుణ్యక్షేత్రాల్లో తిరుమలలోగా ఇక్కడ తలనీలాలు సమర్పించుకునే ఆచారం లేదు. ఒకవేళ అలా చేయించుకోవాలంటే బయటే సెలూన్స్‌ చాలా ఉన్నాయి. వారే బోర్డులు పెట్టి మేమే సాయి తలనీలాలు తీస్తామని చెబుతారు. ఏది ఏమైనా చెప్పుకోదగ్గ పుణ్యక్షేత్రాల్లో తిరుమల, తర్వాత జమ్మూలోని వైష్ణవి ఆలయం. ఆ తర్వాత మహారాష్ట్రలోని షిర్డీ ఆలయం.. నా ఈ షిర్డీ యాత్రను ఓపిగ్గా చదివినవారికి షిర్డీసాయి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ..

ఎమ్. కృష్ణ ( ఓ భక్తుడు)