గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

'సకల దేవతల' నిలయం "కళాధామం"

"కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు" అన్నది నాటి మాట. "మనిషి తలచుకుంటే ఈ సృష్టికే ప్రతిసృష్టి చేయగలడు" అనేది నేటి మాట. చాలా సందర్భాల్లో ఈ విషయం తేటతెల్లమైనప్పటికీ... "కుందా సత్యనారాయణ కళాధామం" దర్శించినట్లయితే, ఈ మాట ఎంత అక్షర సత్యమో మనకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది.

మనం తరచుగా వెళ్లే దేవాలయాలలో మహా అయితే... ముగ్గురో, నలుగురో దేవతామూర్తులను ఒకే చోట చూసి ఉంటాము. కానీ భగవంతుడి దశావతారాలన్నింటినీ ఒకేచోట చూడాలంటే సాధమయ్యేపనేనా..? అనిపిస్తుంది కదూ..! ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు కుందా సత్యనారాయణగారు. పురాణేతిహాసాల్లోని పాత్రలన్నింటికీ దృశ్యరూపం కల్పించి... "కుందా సత్యనారాయణ కళాధామం"గా తీర్చిదిద్దారు.

దీనినే "పద్మవ్యూహం" అని కూడా పిలుస్తుంటారు. ఈ కళాక్షేత్రంలో రామాయణం, మహాభారతం, భాగవతాలలోని అపురూప ఘట్టాలను దృశ్యరూపంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌ నగరానికి కేవలం 60 కి.మీ దూరంలో, నల్గొండ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు సమీపంలోని సురేంద్రపురిలో కొలువుదీరి ఉంది ఈ ఆధ్యాత్మిక కళాక్షేత్రం.
కమలంలో పుష్పాసనంలో...
  బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, నాగలోకం, ఇంద్రలోకం, యమలోకం, పాతలలోకం, పద్మవ్యూహం, పద్మద్వీపంలాంటి ఎన్నో కళాకండాలను మనం వీక్షించవచ్చు. బ్రహ్మలోకంలోకి ప్రవేశించగానే కమలంలో పుష్పాసనంలో కూర్చొని ఉన్న బ్రహ్మ, సరస్వతీదేవి యొక్క రూపాలు మనముందు...      


18 ఎకరాల సువిశాల ప్రదేశంలో అత్యంత సుందరంగా నిర్మించబడిన ఈ క్షేత్రంలో... శ్రీరాముని వనవాసం, క్షీరసాగరంలో శేషతల్పంపై పవలించిన విష్ణుమూర్తి, కలకత్తా కాళీమాత, మధుర మీనాక్షి, కాశీ విశ్వనాథుడు, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, మధుర మీనాక్షి, షిరిడీ సాయినాథుడు, పళని కుమారస్వామి, అయోధ్య రాముడు లాంటి ఎందరో దేవతామూర్తులను కనులారా దర్శించవచ్చు. ఇలా ఒకరేమిటి కాశీ నుండి కన్యాకుమారి వరకు కొలువై ఉన్న దాదాపు అందరు దేవతలను మనం ఇక్కడ చూడవచ్చు

ఒకే చోట ఇంతమంది దేవుళ్ళను దర్శించుకోవడం నిజంగా ఒక అద్భుతం. ఇంతటి విశేషత కలిగిన కళాధామం ప్రపంచవ్యాప్తంగా ఇదొక్కటే అంటే అది అతిశయోక్తికాదు. అదీ మన రాష్ట్రంలో ఉండటం నిజంగా మన అదృష్టం. నానాటికీ మరుగున పడిపోతున్న మన పురాణాలు, సాంస్కృతీ సాంప్రదాయాల గురించి మన పిల్లలకు నేర్పించేందుకు... భక్తితోపాటు, విజ్ఞానాన్నికూడా అందించేందుకు ఈ క్షేత్రం ఎంతో ఉపయోగపడుతుంది.

తన అకుంఠిత దీక్షతో, నానాటికీ అంతరించిపోతున్న మన పౌరాణిక గాధలను నేటితరానికి అందించాలన్న సదుద్దేశంతో ఈ ప్రాజెక్టుకు రూప కల్పన చేశారు కుందా సత్యనారాయణ(72)గారు. దాదాపు 10 సంవత్సరాలపాటు తమిళనాడు, మన రాష్ట్రానికి చెందిన దాదాపు రెండువందల మంది శిల్పకారులు రాత్రింబవళ్ళు ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకున్నారు. మన పురాణ గ్రంథాలను, ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని ఈ ధామాన్నిరూపొందించినట్లు సత్యనారాయణగారు వెల్లడించారు.

ఇక్కడ బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, నాగలోకం, ఇంద్రలోకం, యమలోకం, పాతలలోకం, పద్మవ్యూహం, పద్మద్వీపంలాంటి ఎన్నో కళాకండాలను మనం వీక్షించవచ్చు. బ్రహ్మలోకంలోకి ప్రవేశించగానే కమలంలో పుష్పాసనంలో కూర్చొని ఉన్న బ్రహ్మ, సరస్వతీదేవి యొక్క రూపాలు మనముందు సాక్షాత్కరిస్తాయి. తెల్లని మేఘాలతో, హంసలతో అత్యద్భుతంగా మలిచారు. ఎవరికైనా నిజంగా బ్రహ్మలోకాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది.

ఇక విష్ణులోకంని విషయానికి వస్తే శేషతల్పంపై పవళించిన విష్ణుమూర్తి, ఏడుద్వారాలతో నిజమైన విష్ణులోకాన్ని తలపిస్తుంది. ఇక్కడ భక్తులను ఆకట్టుకొనే మరో విశేషం 60 అడుగుల ఎత్తైన పంచముఖ హనుమాన్‌ విగ్రహం. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఇవేకాకుండా అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న కృష్ణ భగవానుడు. కురుక్షేత్ర యుద్ధానికి సమాయత్తమవుతున్న సైనిక పటాలం, విశ్వరూపధారుడైన విష్ణుమూర్తి, భాగవతంలోని ప్రధాన ఘట్టమైన గజేంద్రమోక్షం, ఇవన్నీ మాటల్లో వివరించాడానికి సాధ్యం కాదు తప్పకుండా కళ్లారా చూసి తీరాల్సినవే...!!

ఇప్పటికే వివిధ పాఠశాల యాజమాన్యాలు తమ విద్యార్థుల్లో పౌరాణిక విజ్ఞాన్ని పెంపొందించేందుకు తమ వైజ్ఞానిక యాత్రల్లో భాగంగా సురేంద్రపురిని సందర్శిస్తున్నారు. ఈ కళాక్షేత్రాన్ని సందర్శించడంవల్ల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని... పైగా పురాణాల గురించి భోదించడం కన్నా చూపిస్తూ వివరించడం వల్ల పిల్లలు చాలా సులభంగా అర్థం చేసుకుంటున్నారని ఈ క్షేత్రాన్ని సందర్శించిన ఉపాధ్యాయులు ముక్తకంఠంతో చెబుతుండటం గమనార్హం.

ఎలా వెళ్లాలంటే... హైదరాబాద్‌-వరంగల్‌ రహాదారిపై నగరానికి సరిగ్గా 60 కి.మీ దూరంలో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మనందరికీ తెలిసిందే. ఈ దేవాలయానికి వెళ్లే దారిలో సురేంద్రపురి అనే గ్రామంలో నెలకొల్పబడిందే ఈ అద్భుత కళాక్షేత్రం. రోడ్డు మార్గం గుండా అయితే నగరం నుండి అరగంట ప్రయాణం. యాదగిరిగుట్ట బస్‌స్టేషన్‌ నుండి కేవలం ఒక కి.మీ దూరం మాత్రమే.

రైలు మార్గం ద్వారా వెళ్లే భక్తులు సికింద్రాబాద్‌-కాజీపేట మార్గంలోని రాయగిరి రైల్వే స్టేషన్‌ చేరుకొని అక్కడినుండి బస్సుమార్గం ద్వారా ఈ ప్రదేశాన్ని చేరుకోవచ్చు రాయగిరిలో కేవలం ప్యాసింజర్‌ రెళ్లకు మాత్రమే హాల్టింగ్‌ ఉంది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ద్వారా వచ్చే భక్తులు భువనగరి (9 కి.మీ) లేదా ఆలేర్ ‌(11 కి.మీ) స్టేషన్‌లలోగాని దిగవలసి ఉంటుంది. ఇక దేశం నలుమూలనుండి వచ్చే భక్తులు రైలు మార్గం ద్వారాగానీ, విమానం ద్వారాగానీ కళాధామం చేరుకోవచ్చు.