గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

సాలగ్రామ రూపంలో "అనంత పద్మనాభుడి"గా మహావిష్ణువు

FILE
కలియుగం ప్రారంభంలో మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి, ఆయన తపస్సుకు ఫలితంగా సాలగ్రామ రూపంలో "అనంత పద్మనాభుడి"గా అవతరించాడు. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం హైదరాబాద్ నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో, రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో వెలసింది. ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ క్షేత్రం కొండలు, చెట్లూ చేమలతో, ప్రశాంత వాతావరణంలో అలరారుతోంది.

ఆలయ చరిత్రను చూస్తే.. విష్ణు పురాణంలో అనంతగిరి ప్రస్తావన ఉంది. దీనికి నిదర్శనంగా ఆలయ సమీపంలో పురాతనమైన ఏడు గుండాలు, ఆలయ పరిసర ప్రాంతాలలో సుమారు వంద గుహలు మనకు కనిపిస్తాయి. ఈ గుహలలో పూర్వం ఋషులు తపస్సు చేసుకునేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ అనేక సత్రాలు కూడా ఉండటం విశేషంగా చెప్పవచ్చు.

శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం సుమారు 13వందల సంవత్సరాల క్రితం కట్టబడినట్లు చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 13 వందల సంవత్సరంలో ఆలయం వెలసిన ప్రాంతమంతా దట్టమైన అడవి, కొండలు, గుట్టలతో ఉండేదనీ, అప్పట్లో ఈ ప్రాంతం ఋషులకు నిలయంగా పేరుగాంచినట్లు తెలుస్తోంది.

ఇక్కడ ముచుకుందుడు అనే రాజర్షి రాక్షసులతో అనేక సంవత్సరాలపాటు యుద్ధం చేసి వారిని ఓడించి.. స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రుడి కొలిచాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షమవగా, భూలోకంలో తన అలసట తీర్చుకునేందుకు, సుఖంగా నిద్రపోయేందుకు మంచి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన స్థలం ఎక్కడుందో చెప్పమని అడిగారట. అంతేగాకుండా, తనకు నిద్రాభంగం చేసినవారు తన తీక్షణమైన చూపులకు భస్మం అయ్యేలాగా కూడా వరం ఇవ్వాలని కోరారట.

దేవతలకు రాజు అయిన దేవేంద్రుడు వెంటనే ముచుకుందుడికి భూలోకంలో అనంతగిరి క్షేత్రం గురించి చెప్పగా, ఆయన ఈ క్షేత్రానికి విచ్చేసి ఒక గుహలో నిద్రపోయినట్లు కథనం. మరో కథనం ప్రకారం.. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, బలరాముడితో కలిసి పెరిగి పెద్దవాడై శత్రువు అయిన కంసుడిని వధించి ద్వారకా నగరాన్ని పరిపాలిస్తుండేవారు. ఆ కాలంలోనే కాలయముడు అనే రాక్షసుడు ద్వారకపై దండెత్తి, యాదవ సైన్యాన్ని నాశనం చేశాడట. ద్వారక రాజధాని మధురను స్వాధీనం చేసుకున్నాడట.

కాలయముడి దురాగతాలను చూసిన శ్రీకృష్ణుడు, బలరాముడు అతడికి భయపడినట్లుగా నటించి.. ముచుకుందుడు నిద్రిస్తుండే అనంతగిరి కొండ గుహలోకి తమవెంట వచ్చే విధంగా పరుగులు తీశారట. అంతేగాకుండా శ్రీకృష్ణుడు తన బట్టలను విప్పి, ముచుకుందుడిపై కప్పడంతో, కాలయముడు ముచుకుందుడిని శ్రీకృష్ణుడిగా భావించి నిద్రాభంగం చేశాడట. దీంతో కాలయముడు ముచుకుందుడి ఆగ్రహానికి బూడిదైపోయాడట.

తరువాత ముచుకుందుడికి శ్రీకృష్ణుడు, బలరాముడు దర్శనం కావటంతో సంతోషించి, వారి పాదాలను కడిగి తన భక్తిని చాటుకున్నాడట. ముచుకుందుడు శ్రీకృష్ణుడి పాదాలను కడిగిన జలమే జీవనదిగా అయిందని కథనం. కలియుగం ప్రారంభంలో మహావిష్ణు మహామునికి దర్శనమిచ్చి, అతని తపస్సు ఫలితంగా సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభుడిగా అవతరించాడని కూడా మరో కథ ప్రచారంలో ఉంది.

అనంత పద్మనాభ స్వామివారి ఆలయం పక్కనే "భవనాశిని" అని పిలువబడే "భగీరథ గుండం" ఒకటి ఉంది. ఈ గుండంలో స్నానం చేసిన భక్తులకు ఆయురారోగ్యాలతోపాటు, కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నమ్ముతుంటారు. ఆలయం పక్కనే "మార్కండేయ తపోవనం" కూడా ఉంది. మార్కండేయుడు అనంతగిరి కొండలలో తపస్సు చేసినట్లుగా చరిత్ర చెబుతోంది.

శివ సాక్షాత్కారం తరువాత అమితమైన భక్తి ప్రపత్తులతో బ్రహ్మదేవుని ఆరాధించేవాడు మహా భక్తుడు మార్కండేయుడు. భూమండలంలో అనంతగిరి చాలా ప్రశాంత స్థలమనీ, ఆ స్థలంలో తపస్సును కొనసాగించమని బ్రహ్మదేవుడు మార్కండేయుడికి ఆదేశించటంతో ఇక్కడ తపస్సు కొనసాగించినట్లు తెలుస్తోంది. మార్కండేయుడు తపస్సు ఆచరించిన ఆనవాళ్లు నేటికీ మనకు కనిపిస్తాయి. ఆయన నివసించి గుహలో ప్రస్తుతం మార్కండేయ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు.

ఇక చివరగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నది అనంతగిరి కొండల్లోనే జన్మించిందట. ఇక్కడ జన్మించిన మూసీ నది ప్రవహిస్తూ హైదరాబాద్ మీదుగా నల్గొండ జిల్లాలోని నదీమతల్లిలో కలసిపోతుంది. ఒకప్పుడు మంచినీరు ప్రవహించే ఈ మూసీ నది నేడు దుర్గాంధాలను మోసుకెళ్లేదిగా, వ్యర్థాలు ప్రవహించే నదిగా మారిపోయిందన్న సంగతి ఇప్పటి ప్రజలకు తెలిసిందే..!