గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

సూర్యభగవానుడి దివ్య క్షేత్రం కోణార్క్ దేవాలయం

తన కిరణాలతో జగత్తును కాంతిమయం చేసే సూర్యభగవానుడిని పూజించనివారు ఉండరు. కేవలం హిందూమతం ఆచరణలో ఉన్న ప్రాంతాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సూర్యుని దైవరూపంగా భావించి పూజించేవారున్నారు. అలాంటి సూర్యభగవానుడికోసం నిర్మించబడిన దేవాలయాల్లో దేశంలోనే ప్రసిద్ధి చెందినదిగా కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని పేర్కొనవచ్చు.

ఒరిస్సాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ కోణార్క్ ఆలయం నిర్మించబడి ఉంది. సూర్యుని రథాన్ని పోలిన ఆకారంలో ఈ ఆలయం నిర్మించబడి ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించి యునిసెఫ్ రక్షిస్తోంది.

కోణార్క్ స్థల పురాణం
పురాణ కాలంలో శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డ శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కోణార్క్ దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్ధం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆసమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించాడు.


అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణకాలంలో స్థాపించబడ్డ విగ్రహం కన్పించదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోణార్క్‌లో ఉన్న ఆలయాన్ని గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆరోజుల్లో దాదాపు 12 వందల మంది శిల్పులు పన్నెండేళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.

కోణార్క్ ఆలయ విశేషాలు
సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు.

సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోణార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవడం కూడా ఓ చెప్పుకోదగ్గ విషయమే. అయితే ప్రతి ఏడాది ఇక్కడ రధసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.

కోణార్క్‌లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి.

ఈ సమయంలో భక్తులు దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను పూజిస్తారు. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్చు.