బాధలను అగ్నికి ఆహుతిచ్చే భోగిపండుగ

FILE
సంక్రాంతి ముందురోజైన "భోగి" పండుగ నాడు ఉదయం ఐదు గంటలకే లేచి... ఇంటిముందు భోగిమంటను వెలిగించాలి. ఈ మంటలో మన గృహంలోని పాతవస్తువులు, పనికిరాని వస్తువులు వేయాలి. ఇలా చేయడం ద్వారా మన జీవితాల్లో కొత్త కాంతి లభిస్తుందని విశ్వాసం.

అంతేగాకుండా... దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగిమంటలని పండితులు చెబుతున్నారు. భోగి పండుగనాడు కష్టకాలంలో వాడుకున్న చింపిరి చాపలు, విరిగిన కొయ్యలు భోగి మంటల్లో వేసి చలిని ఊరి నుంచి తరిమి వేయడానికే భోగి మంటను వెలిగిస్తారని నమ్మకం.

ఇకపోతే... ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆరోజున కోళ్ల పందేలు, పొట్టేళ్ల పందేలు పెడతారు. ఆనాటి సాయంకాలం పిల్లలపై భోగి పండ్లు పోయడం ఆచారం. భోగిపండ్లుగా రేగుపండ్లను వాడుతారు. భోగిపళ్ళలో చేమంతి, బంతి పూరేకలు, అక్షింతలు, చిల్లర నాణేలు, పాలకాయలు కలిపి పిల్లల తలపై పోస్తారు. వీటినే బదరీ ఫలాలంటారు. ఇవి విష్ణుమూర్తి స్వరూపాలే. పాపలపై ఆ ఫలాలను పోస్తే విష్ణుమూర్తి కరుణాకటాక్షాలు లభిస్తాయని విశ్వాసం.

ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. తెల్లవారు జామునే లేచి భోగిమంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో పిల్లలు భలే హుషారుగా ఉంటారు.

SELVI.M|
ఇంకా చెప్పాలంటే... భోగి పండుగ రోజున కుప్పలు నూర్పిడి అవగానే మిగిలిన పదార్ధాలను మంటగా వేయటం వలన పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెం వేడెక్కుతుందని విశ్వాసం.


దీనిపై మరింత చదవండి :