అనిర్వచనీయ అనుభూతి రామేశ్వర సందర్శనం

Munibabu| Last Modified శనివారం, 6 సెప్టెంబరు 2008 (16:13 IST)
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో గల రామేశ్వరాన్ని సందర్శిస్తే ఓ అద్భుతమైన, అనిర్వచనీయమైన అనుభూతి మన సొంతమవుతుంది. ఓ పుణ్యక్షేత్రంగా, ఓ పర్యాటక స్థలంగా విలసిల్లుతోన్న రామేశ్వరంలో పర్యాటకులకు కనువిందు చేయడానికి అనేక విశేషాలున్నాయి.

దాదాపు 62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పడిన ఈ ద్వీప ప్రాంతములో రామనాథ స్వామి ఆలయం ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అలాగే ఇక్కడ ఉన్న కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోడి, విభిషనాలయం లాంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

రామనాథ స్వామి ఆలయం
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ఈ రామనాథ స్వామి దేవాలయం ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది. సముద్రానికి దగ్గర్లో నిర్మించినబడిన ఈ ఆలయం 12వ శతాబ్ధంలో నిర్మించబడినట్టు చెబుతారు. దాదాపు 865 అడుగుల పొడవు, 657 అడుగుల వెడల్పుతో నిర్మించబడిన ఈ ఆలయం భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా విలసిల్లుతోంది.

ఈ దేవాలయానికి పక్కనే ఉన్న మూడు మహా మండపాలు నాలుగువేల అడుగుల పొడవుతో ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఈ ప్రాకారాల్లో రామేశ్వరుడు, పార్వతీదేవి ఆలయాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ రుచులను కల్గిన 22 బావులున్నాయి. అలాగే ఈ ఆలయ మండపాల్లో వరసగా నిర్మించబడిన శివలింగాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
దీనిపై మరింత చదవండి :