ఒయ్యారం ఒలకబోసే సుందర తీరం "కనపర్తి"

Beach
Ganesh|
FILE
నిత్యం తీరికలేని పనులతో అలసిపోయేవారు వారాంతంలో కాస్తంత ప్రశాంతంగా గడపాలని కోరుకోవటం సహజమే. అలాంటివారు కుటుంబ సమేతంగా.. కాస్తంత విజ్ఞానం, మరికొంత ఆధ్యాత్మికం, బోలెడంత ఆహ్లాదం కలిగించే ప్రదేశానికి వెళ్లాలనే కోరిక కలవారు చూడదగ్గ ప్రదేశమే నాగులుప్పలపాడు మండలంలోని "కనపర్తి". వయ్యారాలు ఒలికించే సముద్ర తీరం.. విజ్ఞానానికీ, ఆధ్యాత్మికతకు నెలవైన మ్యూజియం ఉన్న ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే అద్భుతమైన అనుభూతులను పదిలం చేసుకోవచ్చు.

బ్రహ్మకుండి అని పిలువబడే గుండ్లకమ్మ నది, అనంతసాగరంలో కలగలసిపోయే ప్రాంతంలో వెలసిన ప్రదేశమే "కనపర్తి". శాతవాహన పాలకులు పరిపాలించిన, పవిత్ర పుణ్యక్షేత్రంగా అలరారిన కనపర్తిలో ఈనాటికీ అనేక బౌద్ధస్తూపాలు, శిల్పాలు దర్శనం ఇస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో వెలసిన కనపర్తి క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకూ విజయనగర రాజుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
బ్రహ్మపాశంగల ధారాలింగం..
కనపర్తి పురావస్తు ప్రదర్శనశాలలో అందరినీ కనువిందు చేసే వాటిల్లో ముఖ్యమైనది బ్రహ్మపాశంగల "ధారాలింగం". దీనిపై పాలుపోస్తే శివలింగం చుట్టూ 32 ధారలుగా పాలు కిందకు కారే విధంగా ప్రత్యేకంగా చెక్కబడి ఉంటుంది...


గొప్ప నాగరికత, సంస్కృతి, శిల్పకళారీతులతో ఆ రోజుల్లో "కనకాపురి" పట్ణణంగా విరాజిల్లిన కనపర్తి ప్రాచీన చరిత్రకు నిదర్శనంగా అక్కడి పురాతన విగ్రహాలు పర్యాటకులు స్వాగతం పలుకుతాయి. ఇలా చరిత్రకు సాక్షీభూతాలుగా మిగిలిన ఈ విగ్రహాలతో రాష్ట్ర ప్రభుత్వం పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసింది.

ఈ ప్రదర్శనశాలలో వివిధ రకాల బ్రహ్మపాశాలు కలిగిన శివలింగాలు, వివిధ ఆకృతుల్లో కనిపించే నంది, విఘ్నేశ్వర, దుర్గాదేవి విగ్రహాలు.. నాగబంధాలు, బిక్షాటన చేస్తున్నట్లుగా ఉండే భైరవుడు, నాగ భైరవుడు, లింగోద్భవమూర్తి, పరశురాముడు, సూర్య విగ్రహం, సరస్వతీ ప్రతిమ, ధారాలింగం, సప్తమాతృకలు మొదలైన అద్భుత కళాఖండాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తుంటాయి.


దీనిపై మరింత చదవండి :