ప్రశాంతతకు మారుపేరు కోవలం బీచ్

Munibabu| Last Modified బుధవారం, 23 జులై 2008 (18:41 IST)
కొబ్బరితోటల అందాలకు నిలయమైన కేరళ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. అయితే ఇక్కడున్న అన్ని విశేషాల గురించి చెప్పుకునే సందర్భంలో కోవలంలో ఉన్న సముద్ర తీరం గురించి చెప్పుకు తీరాలి. అందమైన ఈ సముద్రతీరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది.

కేరళ పర్యటనకు వెళ్లిన పర్యాటకులు కోవలం బీచ్‌ను తప్పకుండా సందర్శించాలని అనుకుంటుంటారు. సముద్రతీరం అనగానే ఎగసిపడే పెద్ద అలలు, తీరానికి చాలా దూరం వరకు ఇసుక తప్ప చెట్టూ చేమా కన్పించకపోవడం అనేది మనకు తెలిసిందే. అయితే ఈ విషయాల్లో కోవలం బీచ్ కాస్త ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.

కోవలం బీచ్‌లో పెద్దగా ఎగిసిపడే అలలు మనకు కన్పించవు. ఇక్కడ సముద్రం లోతు తక్కువగా ఉండడం వల్ల అలల ఉదృతి అన్నది మనకు కానరాదు. అలాగే తీరం వెంబడి లోతు తక్కువగా ఉండడం వల్ల ఎలాంటి భయం లేకుండా సముద్రపు నీళల్లో పర్యాటకులు ఆడిపాడుతుంటారు.

ఈ బీచ్‌లో మరో విశేషం ఏమిటంటే సముద్రతీరం వెంబడి బారులు తీరినట్టు కొబ్బరి చెట్లు ఉంటాయి. సముద్రం అంచునే ఇలా కొబ్బరి చెట్లు ఉండడం వల్ల ఈ ప్రదేశం క్యాన్వాస్‌పై గీచిన పెయింట్‌గ్‌లా చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన వెంటనే వస్తువులను తీరానికి దూరంగా పెట్టేసి ఓసారి సముద్రంలోకి కాలుపెట్టారంటే ఇక వెనక్కు రావాలనిపించదు.
దీనిపై మరింత చదవండి :