భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు.