సంధ్యాస్తమయాల సంగమం

Gayathri| Last Modified సోమవారం, 7 ఏప్రియల్ 2008 (17:02 IST)
సముద్రంలోంచి సూర్యుడు మెల్లగా ఉదయించడాన్ని ఎప్పుడన్నా చూశారా? చూసినా సూర్యాస్తమయాన్ని చూశారా ? లేదు కదూ. అయితే ఈ అందమైన దృశ్యాన్ని చూడడానికి కన్యాకుమారి రావలసిందే. సంధ్యాస్తమయాలను అతి సమీపం నుంచి ఇక్కడ వీక్షించవచ్చు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాలు కలిసే ఈ చోటు మనసును ఆనంద డోలికల్లో తేలేలా చేస్తుంది.

కొబ్బరి చెట్లు, వరి చేను కలిగిన కన్యాకుమారి తన సముద్రపు ఒడ్డున రకరకాల మట్టిని కలిగి ఉండడం మరో విశేషం. అంతే కాకుండా వివిధ రకాల లోయలు, దేవాలయాలు, చర్చిలు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని చేకూరుస్తున్నాయి. ఈ ప్రాంతంలోని సముద్ర తీరాలతో పాటు అమ్మవారి దేవాలయం ప్రసిద్ధి గాంచినది. పార్వతిదేవి కన్యగానే మిగిలి ఈ ప్రాంతంలో వెలసినందున ఈ ప్రాంతానికి కన్యాకుమారి అనే పేరు వచ్చింది.

ఈ ప్రాంతాన్ని అప్పట్లో పరిపాలించిన చేరులు, చోళులు, పాండ్య రాజులు ఈ దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఈ ప్రాంతం కళలు, సంప్రదాయాలు, నాగరికత, పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా మాత్రమే కాదు, వాణిజ్య పరంగా కూడా చక్కని కేంద్రంగా చెప్పవచ్చు. హిందువులే కాకుండా రకరకాల మతాల వారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతారు.

ఇక్కడి మరో ముఖ్యమైన ప్రాంతంగా గాంధీ మండపాన్ని చెప్పవచ్చు. ఒరియా శిల్పకళా సౌందర్యానికి నిదర్శనంగా, గాంధీ స్మారకంగా దీనిని నిర్మించారు. సముద్రపు ఒడ్డు నుంచి అరకిలో మీటరు దూరంలో ఉంది వివేకానంద మెమోరియల్ రాక్. ఈ మెమోరియల్‌లో ధ్యాన మండపం కూడా ఉంది. ప్రశాంతంగా సముద్రం మధ్యలో కూర్చుని ధ్యానం చేసుకునే వీలుంటుంది. మనసుకు హాయి కల్పించేలా ఉన్న ఈ ప్రాంతంలో కాసేపు కూర్చుంటే అలసిన శరీరానికి, మనసులకు విశ్రాంతి లభిస్తుంది.


దీనిపై మరింత చదవండి :