సహ్యాద్రి శోభ, సెలయేళ్ల నాదంతో పరవశించే "మంగళూరు"

Beach
Ganesh|
FILE
రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఒకటి "మంగళూరు". ఈ నగర సముద్ర తీరప్రాంతం చుట్టుప్రక్కల అంతా కొబ్బరిచెట్లతో నిండి ఉంటుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలకు, సముద్ర తీర అందాలకు, సహ్యాద్రి కొండల వంపుసొంపులకు, అక్కడ ప్రవహించే శోభకు మంగళూరు పెట్టింది పేరు. బీచ్‌లు, దేవాలయాలు, పరిశ్రమలు, బ్యాంకింగ్, విద్యాసంస్థలకు ప్రసిద్ధి చెందిన మంగళూరుకు ఓ సారలా వెళ్లివద్దామా..?!

కర్ణాటక రాష్ట్రానికి, భారతదేశానికి ఒక నౌకాశ్రయాన్నిచ్చిన మంగళూరు నగరం.. భారతదేశానికి పశ్చిమానగల అరేబియా సముద్ర తీరంలో పశ్చిమ కనుమలకు పశ్చిమదిక్కులో ఉంది. దక్షిణ కన్నడ జిల్లా రాజధాని మరియు అధికార, పరిపాలనా కేంద్రంగా విలసిల్లుతున్న ఈ నగరం కర్ణాటకకు, దక్షిణ కన్నడ జిల్లాకు నైరుతీదిశలో ఉంది. ఇక్కడి నౌకాశ్రయం కృత్రిమంగా నిర్మించబడింది.

కాగా.. నేత్రావతి, గుర్‌పుర్ నది ఒడ్డున ఈ ప్రాంతం ఉండటంవల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తుంటాయి. అదలా ఉంచితే, మలబార్ తీరంలో మంగళూరు కూడా ఒక భాగమే కావటం గమనార్హం. రాష్ట్ర భాష అయిన కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాష అయిన తుళు, కేరళకు సరిహద్దుల్లో ఉండటంవల్ల మళయాలం, కొంకణి జనాభా కూడా ఉండటంవల్ల కొంకణి భాషలు మంగళూరులో వాడుకలో ఉన్నాయి. ప్రాంతీయ భాషలే కాకుండా.. హిందీ, ఆంగ్లం కూడా మాట్లాడతారు.

మంగళూరుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. నగర దేవతైన మంగళాదేవి పేరే నగరం పేరుగా స్థిరపడినట్లు పూర్వీకులు చెబుతుంటారు. అదే విధంగా అనేక శతాబ్దాలుగా ఈ నగరం వివిధ సంస్కృతులకు నిలయం కావటంతో, అక్కడ నివసించే భిన్నజాతులవారు తమ తమ మాతృభాషలలో మంగళూరుకు అనేకమైన పేర్లు పెట్టారు. అలా స్థానిక భాషలో మంగళూరును "కుడ్ల" అని పిలుస్తారు. కుడ్ల అంటే కూడలి అని అర్థం.

అలాగే నేత్రావతి, ఫల్గుణి నదుల సంగమస్థానం కావటంవల్ల మంగళూరుకు ఆ పేరు వచ్చినట్లుగా చెబుతుంటారు. కొంకణి భాషలో మంగళూరును "కొడియల్" అని పిలుస్తుంటారు. ఇక ముస్లింలలో ఒక వర్గంవారైతే ఈ నగరాన్ని "మైకల" అని ముద్దుగా పిల్చుకుంటారు. దక్షిణ కేరళ ప్రాంత ప్రజలు మాత్రం "మంగళాపురం"గా పిల్చుకుంటుంటారు. ఇదిలా ఉంటే.. 2006లో "సువర్ణ కర్ణాటక" పేరుతో మంగళూరును "మంగలూరు"గా కర్ణాటక ప్రభుత్వం మార్పుచేసింది.


దీనిపై మరింత చదవండి :