సింగపూర్ "అండర్ సీ వరల్డ్" అందాలు

FILE

మలేషియాకు దక్షిణాన 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దక్షిణాసియాలోని అతి చిన్న దేశం సింగపూర్. దీని అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్". ఇది ఒక చిన్న ద్వీపం, నగరం కూడాను. పారిశుద్ధ్యంలో చక్కటి పేరు సంపాందించిన సింగపూర్ అభివృద్ధికి అక్కడి పరిపాలనా దక్షతను కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే అతి చిన్నదైనప్పటికీ, ప్రపంచ దేశాలలో ఆర్థికంగా 13వ స్థానంలో నిలిచేలా చేసింది.

వ్యాపారపరంగానూ, ఆర్థికపరంగానూ అభివృద్ధి చెందిన సింగపూర్‌లో ఇటీవలనే "కాసినోవా" అనబడే పాశ్చాత్యుల జూదగృహం నిర్మించటంతో, ధనవంతులైన వ్యాపారవేత్తలను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాకుండా చక్కటి పర్యాటక కేంద్రం అయిన ఈ దేశంలో మలయ్, చైనా, భారతదేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు కూడా నిలయంగా మారింది. పర్యాటకంగానే కాక.. విలాసాలకు, వినోదాలకు పెట్టింది పేరు సింగపూర్.

ఆరోగ్యపరంగానూ సింగపూర్ అభివృద్ధి పథంలో ఉండటంతో విదేశీయులు సైతం వైద్యం కోసం ఇక్కడకు వస్తూ ఉంటారు. ఈ దేశ ఆర్ధిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది. ఈ దేశానికి వివిధ దేశాలనుండి టూరిస్ట్ వీసా సులువుగానే లభిస్తుంది.

ఇక్కడ చూడవలసిన పర్యాటక ప్రాంతాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది "అండర్ సీ వరల్డ్". భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ అండర్ సీ వరల్డ్‌లో అనేక సముద్ర ప్రాణుల్ని సజీవంగా చూసే ఏర్పాటు ఉంది. ఇక్కడ రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు జరుగుతూ ఉంటాయి.

సింగపూరు సముద్ర తీరాన రేవు (హార్బర్) నుండి క్రూయిజ్‌లలో సగం రోజు టూర్, దీర్ఘకాల అంటే రెండు నుండి మూడు రోజుల పడవ ప్రయాణం చేయవచ్చును. ఈ టూర్‌లో సింగపూర్‌లో భాగమైన ఇతర దీవులను సందర్శించవచ్చు. అలాగే, సముద్రతీరంలో డాల్ఫిన్ షో‌లను వీక్షించవచ్చు.

రెండవది.. నైట్ సఫారీ. ఇందులో రాత్రివేళల్లో జంతు ప్రదర్శనశాల చూసే ఏర్పాటు ఉంది. ఇందులో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉంటాయి. రాత్రివేళలో జంతువులను వాటి సహజ పరిస్థితులలో చూడటం పర్యాటకులకు ఓ వింత అనుభూతిని కలిగిస్తుంది. పగటివేళలో కూడా జంతుప్రదర్శనశాలను చూసే ఏర్పాటు ఉంది.

మూడవది పక్షుల పార్క్. ఇక్కడ పక్షులచేత రకరకాల విన్యాసాలు చేయిస్తారు. అత్యంత అపురూపమైన లేత కాషాయ రంగు హంసలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. పార్కు మొత్తం చుట్టి చూడటానికి చక్కని రైలు ప్రయాణము ఉంది. స్కై టవర్లో సందర్శకులను టవర్ పై భాగానికి తీసుకువెళ్ళి కిందకు దించుతారు. పైకి వెళ్ళినపుడు సింగపూరే కాక చుట్టూ ఉండే ఇండోనేషియా, మలేషియా చూడగలగటం ఒక అద్భుతమైన అనుభవం.

నాల్గవది... సెంతోసా ద్వీపం. ఈ ద్వీపానికి కేబుల్ కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సురూటును ఉపయోగించుకుంటారు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన మెర్ మెయిడ్ కింది సగ భాగము చేప, పై సగ భాగము సింహముతో ఉంటుంది. ఈ మెర్‌ మెయిడ్‌ను చూడటం మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో ఆశ్చర్యం లేదు.

సందర్శకులను మెర్ మెయిడ్ తలభాగమువరకు లిఫ్ట్‌లో తీసుకు వెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది .ఇక్కడ సంప్రదాయక భవనంలో సింగపూరు చరిత్రను లేజర్ షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవము ఉట్టిపడే బొమ్మలతో నావ ప్రయాణము, నావికులు, వర్తకము అనేక సంప్రదాయాలు ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శనశాలను సందర్శకులు చూడవచ్చు.

Ganesh|
లిటిల్ ఇండియా, చైనాటౌన్, సెరంగూన్ రోడ్...లు సింగపూర్‌లో చూడవలసిన వాటిలో ప్రధానమైనవి. పండుగ సమయాలలో అంగడి వీధులను చూడముచ్చటగా అలంకరిస్తారు. విదేశీయులు ఇక్కడ ముస్తాఫా, సన్ టెక్‌లలో తమకు కావలసిన వస్తువులను తప్పక కొనుగోలు చేస్తుంటారు. సన్ టెక్ నిర్మాణాన్నిఇక్కడి ప్రజలు గొప్పగా వర్ణిస్తుంటారు. ఇక్కడి భోజనశాలల్లో రుచికరమైన భారతీయ భోజనం లభించే సదుపాయం కలదు.


దీనిపై మరింత చదవండి :