శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By PNR

అలనాటి వైభవాల లోగిలి భీముని పట్టణం

వైజాగ్ నుంచి భీముని పట్టణం వరకు సాగే 25 కి.మీల రోడ్డు మార్గం ఆసాంతం సాగర సౌందర్యమయం. ముందుకు సాగుతుంటే 17వ శతాబ్దంనాటి డచ్ పట్టణం, శిథిలమైపోయిన కోట, ఆయుధాగారం, పురాతనమైన శ్మశానము కనుల ముందు నిలుస్తాయి.

భీముని పట్టణం పురాణ సంబంధిత ప్రాంతం. మహాభారతంలోని పంచపాండవులలో ద్వితీయుడైన భీముని ద్వారా ఈ పట్టణానికి పేరు వచ్చింది. మహాభారతంలో పాండవులు అరణ్యవాసం సాగిస్తున్న తరుణంలో బకాసురుని సంహారం గావించిన అనంతరం శ్రీలక్ష్మి నరసింహస్వామి విగ్రహాన్ని ఇక్కడి పర్వతంపై భీముడు ప్రతిష్టించాడని ప్రతీతి.

భీమునిపట్టణం పాతకొత్తల మేలు కలయికని ఈ కింది వాటిని చదివితే అవగతమవుతుంది. 1661వ సంవత్సరానికి చెందిన ఫ్రెడెరిక్ కెస్సల్లెరోస్ పేరుతో గల ఒక భారతీయుని పురాతనమైన క్రైస్తవ తరహా సమాధి ఇప్పటికీ భీమునిపట్టణంలో ఉంది. సాగరంలో ప్రయాణించే ఓడలకు దారిచూపే అతిపురాతనమైన లైట్‌హౌజ్. 1861వ సంవత్సరంలో ఏర్పాటైన భారతదేశపు రెండవ అతిపురాతన మునిసిపాలిటీ మరియు ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా ఏర్పాటైన మునిసిపాలిటి.

భీమిలీగా పిలువబడే భీమునిపట్టణం గోస్టాని నది బంగాళాఖాతంలో చేరే ప్రాంతంలో ఉంది. ఇక్కడి పర్వతంపై నరసింహస్వామి దేవాలయం కనిపిస్తుంది.

దర్శనీయ స్థలాలు
ఫ్లాగ్ స్టాఫ్ సెంచ్యూరీ, లైట్‌హౌజ్, సెయింట్ పీటర్ చర్చి, నరసింహస్వామి దేవాలయం, మహారాజావారి అతిథిగృహం

ఇక్కడకు చేరుకోవడమెలా?
వైజాగ్‌కు 25 కి.మీల దూరంలో రోడ్డు మార్గం ద్వారా ఈ పట్టణాన్ని చేరుకోవచ్చు.