శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Ganesh

తేలియాడే ఉద్యానవనాల్లో అలా తేలిపోదామా...?!

FILE
"తేలియాడే ఉద్యానవనాలు".. ఎక్కడో విన్నట్లు ఉంది కదూ..?! మీరు విన్నవి బాబిలోనియాలోని వేలాడే ఉద్యానవనాలు. ప్రాచీన వింతల్లో ఒకటైన ఈ వేలాడే ఉద్యానవనాల గురించి పుస్తకాల్లో చదువుకోవటమే తప్ప నేరుగా చూడలేనివి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది తేలియాడే ఉద్యానవనాల గురించి. వీటి గురించి ఇప్పటిదాకా వినకపోయినా ఇప్పటికీ చూడగలిగేవే. ఇవి మెక్సికోలో ఉన్నాయి. అయితే మరెందుకు ఆలస్యం అక్కడ వాలిపోదామా..!!

"చినాంపా" అనేది నహూవా భాషలోని "చినామిట్" అనే పదం నుంచి వచ్చింది. అంటే "మనిషి నిర్మించిన దీవి" అని అర్థం. వీటినే మెక్సికన్లు "తేలియాడే ఉద్యానవనాలు" అని పిలుస్తుంటారు. 21వ శతాబ్దంలో దుబాయ్‌వాళ్లు సముద్రంలో పామ్ దీవుల్నీ, ప్రపంచ పటాన్నీ నిర్మిస్తుంటే వింతగా చెప్పుకున్నాంగానీ.. అప్పట్లోనే "ప్రాచీన అజ్‌టెక్‌"లు ఈ వింత తేలియాడే ఉద్యానవనాలకు శ్రీకారం చుట్టారంటే నమ్మశక్యం కాదు.

మెక్సికో లోయ.. సరస్సులు, మంచినీటి గీజర్ల సమాహారంగా చెప్పవచ్చు. ఆ నీరే అప్పటి ప్రజలకు సహజ వనరుగా ఉండేది. దాంతోనే పంటలు పండించాల్సి వచ్చేది. అయితే ఈ నీటిని ఎక్కడికో తరలించటంకంటే సరస్సులోనే తోటలు వేసేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది జనాలకు. అయితే అది సాధ్యమవుతుందా అని ఆలోచించినవారు ఎట్టకేలకు ఆ పనికి పూనుకున్నారు.
ప్రపంచ వారసత్వ సంపద
క్సొచిమిల్కొలో మాత్రమే కొంతవరకు చినాంపాలు మిగిలి ఉండటంతో ఈ ప్రాంతాన్ని "ప్రపంచ వారసత్వ సంపద"గా యునెస్కో గుర్తించింది. పైగా ఆనాటి పంటల స్థానంలో ఇప్పుడు ఎక్కువగా పూల మొక్కల్నే పెంచుతుండటంతో ఈ ప్రాంతం "తేలియాడే పూలతోటలు"గా గుర్తింపు పొంది ప్రముఖ పర్యాటక


కర్రలతో తయారుచేసిన చదరపు చెక్కలను నీటి మధ్యలోకి నెమ్మదిగా దించారు. దానిమీద మట్టిని పోసి మళ్లీ కర్రలు, వాటిమీద మట్టి.. అలా సరస్సులంతంటా వేసుకుంటూ వచ్చారు. అవి మరీ ఎక్కువ లోతు లేకపోవటంతో ప్రజల ఆలోచన ఫలించింది. నీటి సమస్య ఉండదు కాబట్టి.. ఏడాది పొడవునా పువ్వులు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఇలా.. పంటల్ని పండిచటం ప్రారంభించారు.

అలా రూపుదిద్దుకున్నవే ఈ తేలియాడే ఉద్యానవనాలు అదేనండీ నహువా భాషలో చినాంపాలు. ఇతర సరస్సుల్లో ఇవి కనుమరుగు అయిపోయినా ఒక్క "క్సొచిమిల్కొ సరస్సు"లో మాత్రం ఆనాటి చినాంపాలూ, ఆనాటి ఆజ్‌టెక్‌ల సంప్రదాయాలూ ఇంకా మిగిలే ఉన్నాయి. చల్లగా పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి.

అదలా ఉంటే.. ఆజ్‌టెక్‌లకు ముందుగానే మెక్సికో లోయలోకి ఏడు నహువా తెగలు వచ్చాయని చెబుతుంటారు. దక్షిణ మెక్సిలో స్థిరపడిన వీరు అక్కడి క్సొచిమిల్కొ, చాల్కొ సరస్సుల్లో ఈ కృత్రిమ దీవులను నిర్మించి వ్యవసాయం ప్రారంభించారు. 8వ శతాబ్దం నాటికి ఉత్తర మెక్సికోకి చెందిన ఆజ్‌టెక్‌లు నహువాల్ని ఓడించి క్సొచిమిల్కొని సొంతం చేసుకుని, చినాంపాలను అభివృద్ధి చేశారట.

FILE
స్పెయిన్ల చొరబాటుకు పూర్వం అంటే.. 15వ శతాబ్దం నాటికి క్సొచిమిల్కొ, చాల్కొ సరస్సుల్లో 22,230 ఎకరాల వరకూ చినాంపాలు విస్తరించి ఉన్నాయంటే.. ఇవి వారికి ఎంత కీలకమైన వ్యవసాయ వనరులో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే క్రమంగా సరస్సులో చాలా భాగం ఆవాసిత ప్రాంతంగా మారిపోవడంతో ఈ చినాంపాలు క్రమంగా కనుమరుగు అవసాగాయి.

ఒక్క క్సొచిమిల్కొలో మాత్రమే కొంతవరకు చినాంపాలు మిగిలి ఉండటంతో ఈ ప్రాంతాన్ని "ప్రపంచ వారసత్వ సంపద"గా యునెస్కో గుర్తించింది. పైగా ఆనాటి పంటల స్థానంలో ఇప్పుడు ఎక్కువగా పూల మొక్కల్నే పెంచుతుండటంతో ఈ ప్రాంతం "తేలియాడే పూలతోటలు"గా గుర్తింపు పొంది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది.

ఈ క్సొచిమిల్కొ సరస్సులోని రంగు రంగుల పడవలు ఎంతో ఆకర్షణీయంగా పర్యాటకులను అలరిస్తుంటాయి. వీటినే "ట్రాజినెరాలు" అని పిలుస్తుంటారు. సందర్శకులు ఈ బోటుల్లోనే విహరిస్తూ, పూలతోటల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఎంచక్కా షాపింగ్ చేస్తుంటారు. ఈ పడవల్లో చిన్నపాటి కిచెన్ కూడా ఉండటంతో వంట కూడా చేసుకోవచ్చు.

ఇక్కడి వంట మెనూలో ఉడికించిన స్వీట్‌కార్న్ బాగా పాపులర్ కాగా.. పడవల్లో సంగీత కచేరీలు కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా మే, జూన్ నెలలో ఇక్కడ స్థానికులు రకరకాల సంప్రదాయ ఆజ్‌టెక్ వేడుకలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సంవత్సరానికోమారు అందాల పోటీలు నిర్వహించి ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయిని "అందమైన పువ్వు" పేరుతో ఎంపిక చేస్తారట. అప్పుడే మెక్సికో చినాంపాలకు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు కదూ..? అదేం కుదరదు మేమింకా అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పలేదుగా మరి..!

ఎలా వెళ్లాలంటే... మెక్సికో నగరానికి దక్షిణాన జొకాలొకు 23 కిలోమీటర్ల దూరంలో క్సొచిమిల్కొ ఉద్యానవనాలు నెలకొని ఉన్నాయి. మెట్రో బ్లూ లైన్-2లో ప్రయాణించి టాక్స్‌క్వెనా స్టేషన్‌కు చేరుకుని అక్కడినుంచి లైట్ ట్రైన్ (ట్రెన్ లిగెరో)లో ప్రయాణించి క్సెచిమిల్కొ చివరి స్టాపులో దిగాలి. ఈ మొత్తం ప్రయాణం గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. క్సెచిమిల్కో రైల్వే స్టాపు నుంచి బోలెడన్ని బోట్లు అందుబాటులో ఉంటాయి. ఇక అక్కడ్నించి ఎంచక్కా తేలియాడే ఉద్యానవనాల్లో తేలిపోవడమే తరువాయి... గో.. అండ్ ఎంజాయ్...!!