గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Ganesh

దీవుల తోరణంతో స్వాగతం పలికే "ఇండోనేషియా"

హిందూ, ముస్లిం సంస్కృతుల సమ్మేళనంతో, అందమైన సెలయేళ్ళు, పచ్చని అడవుల ప్రకృతి అందాలతో కనువిందు చేసే ప్రాంతమే ఇండోనేషియా. మన దేశంలో పెట్టుకునే పేర్లయిన వరలక్ష్మి, శకుంతలా దేవి, దమయంతి, తీర్థాదేవి అనేవి హిందూ స్త్రీల పేర్లుగానే మనకు తెలుసు. కానీ, ఇండోనేషియాలోని ముస్లిం మహిళలు కూడా ఇలాంటి పేర్లను పెట్టుకోవడం మనకు వింతగా అనిపిస్తుంది.

ఇండోనేషియాలో జావా, సుమత్ర, సులవేసి, మలుకు, కాలీమంతన్, ఇరియన్ జయ అనే ఆరు ముఖ్యమైన దీవులున్నాయి. నిజానికి ఇండోనేషియా 14 వేల దీవుల సమాహారం అయినప్పటికీ... పైన చెప్పుకున్న ఆరింటిలో మాత్రమే జనావాసం ఉంది. ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా, జావా ద్వీపంలో ఉంటుంది. ఈనగరంతో పాటు సురబయ, బాలి, బాండుంగ్, మేడాన్, సెమారంగ్‌లు ఇక్కడి ప్రధానమైన ఇతర పట్టణాలు ఉన్నాయి.
ముస్లింల రామాయణ పఠనం..!
  ఈ ప్రాంతంలో భారతదేశం నుంచి వచ్చిన స్థిరపడినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే... ఇక్కడ హిందువులతో పాటు ముస్లిం ప్రజలు కూడా హిందూ పండుగలను జరుపుకోవడం. రామాయణం చదివే ముస్లింలు బోగోర్‌లో చాలామందే కనిపిస్తుంటారు...      


జకార్తాని 17వ శతాబ్దంలో "జయకర్త" అని పిలిచేవారట. అంటే... గొప్ప విజయానికి చిహ్నమైన నగరం అని దానర్థం. అదే రానురాను వాడుకలో జకార్తాగా మారిపోయింది. జకార్తాలో చూడదగ్గ మ్యూజియంలు అనేకం ఉన్నాయి. ఇక్కడి జాతీయ ప్రదర్శనశాల, పపెట్ మ్యూజియం, టెక్స్‌టైల్ మ్యూజియం, స్టాంప్ మ్యూజియం, ఫ్రీడం మ్యూజియం.. లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి.

వీటిలో దేని ప్రత్యేకత దానిదే. ఒకచోట ఇండోనేషియా చరిత్రను కళ్లకు కట్టినట్లు కనిపిస్తే, మరోచోట రకరకాల బొమ్మలు కనువిందు చేస్తాయి. ఇంకోచోట జాతీయ ఉద్యమ ఘట్టాలు, మరోచోట అక్కడి ప్రజల మత విశ్వాసాలు దర్శనమిస్తాయి. అయితే ఈ మ్యూజియంలు ఉన్న భవనాలన్నీ పురాతనమైనవే కావడం గమనార్హం.

జకార్తాలో చూడదగ్గ మరో ప్రాంతం "నేషనల్ మాన్యుమెంట్". దీన్నే "మోనాస్" అంటుంటారు. ఇదో పెద్ద స్తూపం. 137 సెంటీమీటర్ల ఎత్తులో ఉండే దీనిపై వెలుగుతున్న దివిటీలాంటి నిర్మాణం ఉంది. 35 కిలోల బంగారంతో ఈ స్తూపాన్ని నిర్మించారట. దీన్ని ఆ దేశ స్వాతంత్ర్యానికి చిహ్నంగా భావిస్తారు.

ఈ నగరంలోని మరో ఆకర్షణ "తమన్ మినీ ఇండోనేషియా ఇండా" అనే మీనియేచర్ పార్క్. దీన్ని చూస్తే, ఆ దేశం మొత్తాన్ని చూసినట్లే...! బీచ్‌లు, దీవులూ, మధ్యయుగంనాటి భవనాలు, చారిత్రక కట్టడాలు.. ఎన్నె ఎన్నెన్నో ఈ పార్కులో కొలువుదీరి ఉంటాయి.

జకార్తాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే "బోగోర్" పట్టణం కూడా పర్యాటక ప్రాంతమే. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పట్టణంలోని ప్రధాన ఆకర్షణ "బొటానికల్ గార్డెన్". దీన్ని 1811వ సంవత్సరంలో సర్ స్టాన్‌ఫోర్డ్ రఫెల్స్ నిర్మించాడట. ప్రపంచంలోని అతిపెద్ద పుష్పం నుంచి అతి చిన్న పువ్వుదాకా ఈ గార్డెన్‌లో మనకు కనువిందు చేస్తాయి.

ఈ పార్కులో చిన్న చిన్న వెదురు వంతెనలు భలే తమాషాగా ఉంటాయి. ఈ గార్డెన్ మెయిన్ గేట్‌కు దగ్గర్లోనే ఒక జువలాజికల్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇందులో దాదాపు 30 వేల స్పెసిమన్లు ఉంటాయి. స్టఫ్డ్ ఖడ్గ మృగం, వేల్ చేప, కొమొడొ డ్రాగన్‌లు మన చూపుల్ని కట్టిపడేస్తాయి.

దేవాలయాల విషయానికి వస్తే... ఈ బోగోర్ పట్టణంలో శివాలయం, సాయిమందిరం, కృష్ణుడి గుడి అంటూ హిందూ దేవతల ఆలయాలు చాలానే కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో భారతదేశం నుంచి వచ్చిన స్థిరపడినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే... ఇక్కడ హిందువులతో పాటు ముస్లిం ప్రజలు కూడా హిందూ పండుగలను జరుపుకోవడం. రామాయణం చదివే ముస్లింలు బోగోర్‌లో చాలామందే కనిపిస్తుంటారు.

ఏడాది పొడవునా ఏ సీజన్‌లో అయినా సరే ఇండోనేషియా పర్యటనకు వెళ్లవచ్చు. రాజధాని జకార్తా నగరం షాపింగ్‌కు అనుకూలం. మకదువా, బోటనీ స్క్వేర్‌లలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, దుస్తులు చాలా చౌకగా లభిస్తాయి. ఈ దేశానికి వీసా పొందటం కూడా చాలా సులభం. "వీసా ఆన్ ఎరైవల్" పద్ధతిలో జకార్తాకు చేరుకున్నాక విమానాశ్రయంలోనే వీసాను పొందవచ్చు.

ఎలా వెళ్లాలంటే... హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మూడు గంటలపాటు ప్రయాణిస్తే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకుంటాం. అక్కడి నుంచి ఇండోనేషియా రాజధాని నగరం జకార్తాకు మరో మూడు గంటలపాటు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి జకార్తాకి నేరుగా విమాన సౌకర్యం లేదు కాబట్టి, బ్యాంకాక్ లేదా మలేషియాల మీదుగా వెళ్ళాల్సిందే...!!