శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Ganesh

పగడపు దీవులు కూడా ఉంటాయి!

FILE
అందమైన సముద్రతీరాలు, రంగు రంగుల పక్షులు, అమాయకమైన జింకలు, ఆకుపచ్చని అడవులు, మైమరపించే ప్రకృతి అందాలు, ఎప్పుడూ చూడని జలచరాలు, పగడపు దీవులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అండమాన్ అందాలకు అంతే ఉండదు. రెండువేల రకాలకు పైబడిన మొక్కలు, 250కంటే ఎక్కువగా ఉండే పక్షి జాతులతో అలరారే ఈ ప్రాంతాన్ని ఒక్కసారి సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించకమానదు.

బంగాళాఖాతంలో ఉన్న ఈ అండమాన్ నికోబార్ దీవులు భారత భూభాగానికి తూర్పుదిక్కులో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఉత్తర, దక్షిణ భాగాలుగా దాదాలు 700 మీటర్ల పొడవున వ్యాపించి ఉన్న ఈ ప్రాంతంలోని 36 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు.

అండమాన్ నికోబార్ దీవుల చరిత్రను చూస్తే... బ్రిటీష్‌వారి హయాంలో భారత స్వాతంత్ర్య పోరాట వీరులకు అనేక రకాల శిక్షలు విధించి ఇక్కడికి తరలించేవారు. అదంతా 19వ శతాబ్దంనాటి విషయమైనా.. ఇప్పుడు ఈ దీవుల్లో మూడు లక్షల మందికి పైబడే ప్రజలు జీవిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌కు చెందినవారు వలస వచ్చి స్థిరపడిపోయారు.

అంతేగాకుండా ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో అనేక రకాల మతాలు, జాతులు, కులాలు, విభిన్న సంస్కృతులకు చెందినవారు జీవిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని మినీ ఇండియా అనికూడా పిలుస్తుంటారు. ఇక్కడి ట్రైబల్ రిజర్వ్స్, నేషనల్ పార్కులు, వైల్డ్‌లైఫ్ సాంక్చురీలు, మహాత్మాగాంధీ మెరైన్ నేషనల్ పార్క్.. తదితర ప్రాంతాలను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అండమాన్ నికోబార్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల్లో పదిహేను రోజులపాటు ఉత్సవాలు జరుపుతుంటుంది. ఎకో-ఫ్రెండ్లీ టూరిజాన్ని మరింతగా ప్రోత్సహించేందుకుగానూ ఈ ఉత్సవాలలో సంగీత, నృత్య, వాయిద్య రంగాలలో ప్రముఖ కళాకారుల బృందాలతో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా వాటర్ స్పోర్ట్స్, పరుగుపందేలు, మ్యాజిక్ షోలు, పప్పెట్ షోలు, స్కూబా డైవింగ్ లాంటి ఎన్నో క్రీడలను సైతం నిర్వహిస్తారు.

అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇక్కడి "హవెలాక్ ద్వీపం"లో సుభాష్ మేళాను నిర్వహిస్తారు. ఇందులో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను, వేడుకలను నిర్వహిస్తారు. ఇంకా స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ప్రతియేటా జనవరిలోనే "నీల్ ద్వీపం"లో వివేకానంద మేలాను జరుపుతారు.

అందాలకు, ఆనందాలకు నెలవైన ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోని పర్యాటక ప్రాంతాలలో వాటర్ స్కైయింగ్, వాటర్ స్కూటర్, పారా సైలింగ్, విండ్ సర్ఫింగ్, సెయిలింగ్, స్పీడ్ బోటింగ్, రోయింగ్, పాడిల్ బోటింగ్, కయాకింగ్, ఆక్వా సైక్లింగ్, ఆక్వా గ్లైడింగ్, బంపర్ బోట్స్ లాంటి సాహసోపేతమైన క్రీడలను సైతం నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే అండమాన్ దీవులు ట్రెక్కింగ్‌కు కూడా ఎంతో అనుకూలంగా ఉంటాయి.

FILE
అండమాన్ నికోబార్ దీవులలో ముఖ్యంగా చూడదగ్గవాటిలో ఆ దేశ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌లోగల సెల్యూలార్ జైలు, దాని సమీపంలోని చిన్న ద్వీపం చాతమ్, మినీ జూ, ఆంత్రోపాలాజికల్ మ్యూజియం, ఆక్వేరియం, సముద్రిక (నావెల్ మెరైన్ మ్యూజియం), జ్సి మ్యూజియం, ఫారెస్ట్ మ్యూజియం..లే గాక మరెన్నో ఉన్నాయి.

ఈ దీవులకు ఎలా వెళ్లాలంటే..? అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌ విమానాశ్రయానికి.. కోల్‌కతా, చెన్నైల నుంచి రెగ్యులర్‌గా విమాన సర్వీసులు ఉన్నాయి. విమానంలో రెండు గంటలు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే ఇండియన్ ఎయిర్‌లైన్స్, రెండు ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లు కూడా వారానికి రెండుసార్లు ఈ ప్రాంతానికి విమాన సర్వీసులను నడుపుతున్నారు.

సముద్ర మార్గంలో అయితే.. కోల్‌కతా, చెన్నై, విశాఖపట్ణణం నుంచి ఈ దీవులకు నౌకలు వెళ్తుంటాయి. చెన్నై, కోల్‌కతా నుంచి నెలకు 4సార్లు.. విశాఖపట్నం నుంచి నెలకు ఒకసారి నౌకలు బయలుదేరుతాయి. అయితే ఇక్కడికి చేరుకునేందుకు చెన్నై నుంచి 60 గంటల ప్రయాణం కాగా, కోల్‌కతా నుంచి 66, విశాఖపట్నం నుంచి 56 గంటలు పడుతుంది. సముద్ర మార్గంలో వెళ్లాలంటే నెల రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. అయితే ప్రయాణానికి మూడు రోజుల ముందుగా మాత్రమే టిక్కెట్లు ఇస్తారు.

చూసేందుకు ఎంతో అందంగా ఉండే అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లాలంటే మాత్రం అంత సులభమైన విషయమేమీ కాదు. అక్కడి పోర్ట్‌బ్లెయిర్ మినహాయిస్తే మిగిలిన దీవులలో తాగునీరు, టాయిలెట్ల లాంటి సౌకర్యాలు కూడా ఉండవు. అందుకే ఈ దీవులకు వెళ్లాలనుకుంటే ముందుగానే నౌకలు, లేదా విమానాలలో టికెట్లను రిజర్వ్ చేయించుకోవాలి.

ఇక ఇక్కడికి వెళ్లదలచుకునేవారు రెండు అంతకంటే ఎక్కువ రోజులు అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే అక్కడి వివిధ దీవులను కూడా చూడాలనుకుంటే బోట్స్ సమయానికి అందుబాటులో ఉండవు. ముఖ్యంగా రిమోట్ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాగునీరు తీసుకెళ్లటం మంచిది. ట్రైబల్ రిజర్వ్ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా, గుంపుగా వెళ్లటం ఉత్తమం.

ఎందుకంటే.. అండమాన్ నికోబార్ దీవులలో నివసించే ట్రైబల్ ప్రజలకు కొత్త జాతులవారంటే అస్సలు గిట్టదు. ఏ మాత్రం మనం జాగ్రత్తగా ఉండకపోతే వారి విషం పూసిన బాణాల దెబ్బలను రుచి చూడాల్సి ఉంటుంది. పరాకుగా ఉండే పర్యాటకులను వాళ్లు చంపిన ఉదంతాలు సైతం లేకపోలేదు కాబట్టి బీ కేర్ ఫుల్. ఇలాంటి తంటాలేమీ అవసరం లేదనుకుంటే ఎంచక్కా బీచ్‌లు, పార్కులను సందర్శిస్తే సరిపోతుంది.