గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Ganesh

పల్లవరాజుల అద్భుత కళాత్మక సృష్టి "మహాబలిపురం"

FILE
డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు... ఈ ప్రాంతం కొత్త అందాలను పులుముకుంటుంది. ఇక్కడికి రోడ్డు మార్గం గుండా ప్రయాణించే పర్యాటకులకు దారి పొడవునా అనేక దృశ్యాలు కన్నులపండుగ చేస్తాయి. సంధ్యవేళల్లో జాలువారే సున్నితపు సూర్యకిరణాలు సృష్టించే అద్భుతాలను నీలాల అఖాతపు సోయగాలతో కలిపి చూసే అదృష్టం వీరికే లభిస్తుంది. ఇంతటి ఆనందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేదే "మహాబలిపురం" సముద్ర తీర ప్రాంతం.

భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవాన్ని, ఆనాటి పల్లవ రాజుల నైపుణ్యాన్ని, వారి ఘనమైన చారిత్రక సంపదను తరతరాలుగా పర్యాటకులకు పంచి పెడుతున్న గొప్ప గొప్ప గోపురాల సముద్ర తీర పట్టణమే మహాబలిపురం. ఇక్కడ నిర్వహించే వార్షిక వేడుకలకు "డాన్స్ ఫెస్టివల్"గా అంతర్జాతీయ ఖ్యాతి ఉంది.

ఈ డాన్స్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగ రోజున ప్రారంభమై కొత్త సంవత్సరంలోని మొదటి నెల పొడవునా అన్ని శనివారాలలోనూ జరుగుతుంటుంది. ఈ వేడుకలు తమిళనాడు పర్యాటకశాఖవారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెల మొదటి వారందాకా జరుగుతాయి.

చెన్నై నుంచి మహాబలిపురానికి వెళ్లే రోడ్డు మార్గం పొడవునా బంగాళాఖాతపు నీలి అలల సవ్వడులు... రాతి కట్టడపు విశేషాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించేవారు సాయంత్రాలను ఎంచుకుంటే మరీ మంచిది. ఎందుకంటే సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ తీర ప్రాంతంలో వీచే చల్లటిగాలులు మనసుకు చాలా స్వాంతన కలిగిస్తాయి.
కృష్ణ లీలా విన్యాస సమ్మేళనం
మహాబలిపురంలో రాతితో నిర్మితమైన పలు ఆలయాల్లో "కృష్ణ మండపం" చెప్పుకోదగ్గది. శ్రీకృష్ణుడి లీలా విన్యాసాలను గుర్తుకు తెచ్చే సన్నివేశాలు ఈ శిల్పాలలో మనకు దర్శనమిస్తాయి. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడం వాటిలో ఒకటి కాగా.. అలాగే కృష్ణుడికి ఇష్టమైన వెన్నముద్ద..


మహాబలిపురం చరిత్రను చూస్తే... దక్షిణ భారతదేశానికి చెందిన "మామల్ల" అనే పల్లవ రాజు పరిపాలించిన ఈ సముద్ర తీర ప్రాంత పట్టణం, ఆ రాజు పేరుమీదనే "మామల్లాపురం"గా స్థిరపడింది. కాలక్రమంలో అదే "మహాబలిపురం"గా రూపుదాల్చింది. కంచి పట్టణం రాజధానిగా పరిపాలించిన ఆనాటి రాజులు.. విదేశీ నిపుణులను రప్పించి, స్వదేశీ కళాకారుల చేయూతతో ఈ సాగరతీరంలోని అద్భుతమైన రాతి కట్టడాలను సృష్టించారు.

ఆనాటి పల్లవ రాజుల కళాత్మక వైభవానికి నిదర్శనంగా.. నేటికీ చెక్కు చెదరకుండా ఉండే రాతి కట్టడాలు మనకు స్వాగతం చెబుతుంటాయి. ఇక్కడ ప్రసిద్ధిచెందిన ఏకశిలా దేవాలయాల అద్భుతమైన పనితనానికి ఎంతోమంది శిల్పులు, శిల్పకళా నిపుణులు పరవశించిపోతుంటారు.

మహాబలిపురం అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది.. ఆ తీర ప్రాంతంలో వెలసిన దేవాలయమే. ఈ ఆలయం నుంచే పర్యాటకుల సందర్శన మొదలవుతుంది. భారతీయ పురాణ గాథలు, పాత్రలను తలపించే శిల్ప సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ ఆలయంపై అనేకమంది దేవతలు, దేవుళ్ల విగ్రహాలతోపాటు.. పలువురు నృత్య కళాకారిణుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి.

FILE
ముఖ్యంగా పెద్ద పెద్ద అడుగులు వేసేంతటి ఏనుగుల భారీ శిల్పాలు పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి. ఈ ఆలయంలో రెండు పెద్ద గోపురాలు, చిన్న గోపురాలు ఉంటాయి. ప్రధాన దేవతలుగా శివకేశవులు.. ఆలయం చుట్టూ అనేకమైన నంది విగ్రహాలు బారులు తీరి సరిహద్దు గోడలా తీర్చిదిద్దారు. గుడి వెనుక ఒక పెద్ద రాతి సింహం, దానిపై ఓ సైనికుడు స్వారీ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇది ఆనాటి సైనికుల ధైర్యసాహసాలను చాటి చెప్పేదిగా ఉంటుంది.

మహాబలిపురంలో రాతితో నిర్మితమైన పలు ఆలయాల్లో "కృష్ణ మండపం" చెప్పుకోదగ్గది. శ్రీకృష్ణుడి లీలా విన్యాసాలను గుర్తుకు తెచ్చే సన్నివేశాలు ఈ శిల్పాలలో మనకు దర్శనమిస్తాయి. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడం వాటిలో ఒకటి కాగా.. అలాగే కృష్ణుడికి ఇష్టమైన వెన్నముద్దకు చిహ్నంలా భావించే ఒక పెద్ద బండ సైతం ఇప్పటికీ ఉంది. అలాగే ఆనాటి శిల్పకారుల పనితనానికి నిదర్శనంగా నిలిచే రెండు అతిపెద్ద ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ రాతి ఖండాలలో ఒకటిగా విశేష గుర్తింపును సంపాదించుకుంది.

ఇక్కడి రాతి కట్టడాల ఉపరితలం విభిన్నమైన కళాత్మకతతో... సుమారు వందకుపైబడి దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. వాటిలో నాలుగు చేతుల దేవుళ్లు, నాగదేవతలు, పక్షులు, మృగాలు, రుషుల వంటి విగ్రహాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా రెండు రాళ్లతో చెక్కిన ఏనుగుల విగ్రహాలయితే.. సజీవంగా ఉండే ఏనుగులను తలపిస్తూ.. ఆనాటి శిల్పుల అసాధారణ పనితనాన్ని గుర్తుకుతెస్తూ మంత్రముగ్ధులను చేస్తుంటాయి.

మహాబలిపురానికి ఉత్తరం వైపుగా అద్భుతమైన ఐదు రాతి రథాలు ఉన్నాయి. వీటిలో ప్రతిదీ ఒక్కో భారీ శిలతో ఏకశిలా ఖండంగా రూపొందించబడి ఉండటం విశేషంగా చెప్పవచ్చు. మహాభారతంలోని పంచపాండవుల పేర్లనే ఈ రథాలకు పెట్టారు. సముద్ర తీరానికి 400 మీటర్ల దూరంలో గల గ్రానైట్ కొండపైన నెలవైన గుహాలయాలు కూడా చూడదగ్గవే. పట్టణం ఉత్తరం వైపున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో "టైగర్ గుహలు" కూడా చూడదగ్గవే. వీటిని దుర్గామాత నిలయంగా చెబుతుంటారు.

మహాబలిపురం వెళ్లే పర్యాటకులకు మరో అద్భుతమైన, అపురూపమైన అనుభవం దొరుకుతుంది. ఇక్కడి తీరప్రాంతంలోగల అందమైన పడవలను అద్దెకు తీసుకుని బంగాళాఖాతంలోకి అలా హాయిగా షికారు చేయవచ్చు. అయితే అలాంటి సందర్భాల్లో విధిగా లైఫ్ జాకెట్లు ధరించాల్సి ఉంటుంది. దీనికి దగ్గర్లోనే ఎంజీఎం, వీజీపీ గోల్డెన్ బీచ్, మాయాజల్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్, చోళమండలం కళాకారుల గ్రామాలు కూడా చూడదగ్గ ప్రదేశాలే.

మహాబలిపురం ఎలా వెళ్లాలంటే.. చైన్నెకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతానికి విమానంలో వచ్చే వారికి చెన్నై నగరమే అత్యంత సమీప విమానాశ్రయంగా చెప్పవచ్చు. దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఇది మంచి కూడలి. ఇక రైలు మార్గంలో అయితే ఈ ప్రాంతానికి సమీప రైల్వేస్టేషన్ చెంగల్పట్టు. ఇక్కడి నుంచి 29 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు లేదా చెన్నై నుంచి నేరుగా రైల్లో 58 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవచ్చు.

ఇక రోడ్డు మార్గంలో అయితే చెన్నై, పాండిచ్చేరి, కాంచీపురం, చెంగల్పట్టు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. పర్యాటకులు చెన్నై నుంచి అద్దె ట్యాక్సీలలో కూడా వెళ్లవచ్చు. బస విషయానికి వస్తే.. చెన్నైలోనే కాకుండా నేరుగా మహాబలిపురంలో కూడా పలు ప్రైవేట్ హోటళ్లు, రిసార్టులు, లాడ్జిలు అందుబాటులో ఉన్నాయి.