శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Pavan Kumar
Last Modified: శనివారం, 17 మే 2008 (19:08 IST)

ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతిపూలే

సముద్రతీరానికి ప్రత్యేక అందాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతిపూలే. సముద్రపు అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలలు తాకిడి వల్ల ఇక్కడి సముద్రపు తీరాలు పసిడి, ధవళ కాంతులీనుతాయి.

గణపతిపూలేలో స్వయంభు గణపతి దేవాలయం ఉంది. గౌరీ నందనుడైన గణపతి పేరునే ఈ ఊరికి గణపతిపూలే అని పేరు వచ్చింది. దేశంలోని అష్ట గణపతుల దేవాలయాల్లో గణపతిపూలే ఒకటి. గణపతిపూలేను పశ్చిమ ద్వార దేవతగా పిలుస్తారు.

గణపతిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు ఆయన వెలసిన కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారు. గణపతిపూలే ప్రకృతి అందాలతో శోభిల్లుతుంది. పచ్చదనంతో కూడిన అడవులు ఇక్కడ ఉన్నాయి. గణపతిపూలేలో మామిడి, వక్క, అరటి, కొబ్బరి వంటి వనాలు ఉన్నాయి. పశ్చిమ తీరం వెంట ఇటువంటి వనాలు ఎక్కువగా ఉంటాయి.

ఇతర దర్శనీయ ప్రాంతాలు

మాల్గుండ్
మరాఠీ కవి కేశవ్ సూత్ జన్మించిన ప్రాంతం ఇది. కేశవ్ సూత్ సేవలను గుర్తించుకునే విధంగా కేశవ్ సూత్ స్మారక్ అనే మందిరాన్ని నిర్మించారు.

పావస్
ప్రకృతి రమణీయతకు నెలవైన ప్రాంతం పావస్. ప్రముఖ ఆథ్యాత్మిక వేత్త స్వామి స్వరూపానంద్ ఇక్కడే జన్మించారు.

రత్నగిరి

పశ్చిమ కోస్తా తీరంలో అందమైన ప్రాంతంతో పాటుగా జిల్లా కేంద్రం రత్నగిరి. ప్రముఖ స్వాత్రంత్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ జన్మస్థలం ఇదే. ఆయన సేవలను గుర్తుపెట్టుకునే విధంగా తిలక్ స్మారక్‌ను ఇక్కడ ఏర్పాటుచేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిలక్ స్వదేశీ ఉద్యమాన్ని నడిపించారు. సమీపంలో రత్నదుర్గ్ కోట కూడా ఉంది.

వసతి

గణపతిపూలేలో మహారాష్ట్ర పర్యాటక సంస్థకు చెందిన హోటెల్‌తో పాటుగా ఇతర వసతి సదుపాయాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి

విమాన మార్గం : బెల్గాంలో (299 కి.మీ.) విమానాశ్రయం ఉంది.

రైలు మార్గం : రత్నగిరి (45 కి.మీ.), భోక్ (35 కి.మీ.) సమీపంలోని రైల్వే స్టేషన్లు.

రహదారి మార్గం : ముంబయి 375 కి.మీ., పూణె (331 కి.మీ.), కొల్హాపూర్ (144 కి.మీ.) దూరంలో గణపతిపూలే ఉంది.