శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Ganesh

"బీచ్ కార్నివాల్స్"తో సందడి చేసే సుందర దీవి

పక్షుల కిలకిలా రావాలు, ఎటువైపు చూసినా కనువిందు చేసే పచ్చదనం, పూల సుగంధ పరిమళాలు కలగలిపిన స్వచ్ఛమైనగాలి, సముద్ర తీరం హొయలు... వీటన్నింటినీ కలగలిపి చెప్పాలంటే వర్ణించటం చాలా కష్టం. అయితే, స్వయంగా ఆస్వాదించాలంటే మాత్రం, మన దేశ పటానికి చివర్లో చిన్న దీవి లాగా కనిపించే దేశమైన "శ్రీలంక"కు వెళ్ళాల్సిందే మరి..!

హైదరాబాదు నుంచి కొలంబోకు సరిగ్గా రెండు గంటల ప్రయాణం మాత్రమే. ఇక శ్రీలంక కరెన్సీ కూడా రూపాయే కాబట్టి టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పైగా మన రూపాయి 2.70 శ్రీలంక రూపాయిలు వస్తాయి. దీంతో మన వద్దనుండే డబ్బు కాస్తా రెట్టింపై కూర్చుంటుంది. ఇంకేం ఎంచక్కా ఏం కావాలంటే వాటిని కొనేసుకోవచ్చు.

ఇక శ్రీలంక విస్తీర్ణం విషయానికి వస్తే... మొత్తంగా 65 వేల చదరపు కిలోమీటర్లు (మన రాయలసీమకంటే తక్కువే)గా ఉంటుంది. ఉత్తరం నుంచి దక్షిణందాకా 425 కిలోమీటర్లు కాగా, తూర్పు నుంచి పడమరదాకా దాదాపు 220 కిలోమీటర్లుగా ఉంటుంది. ఆ దేశ జనాభా దాదాపు రెండు కోట్ల పదిలక్షల మందిగా ఉండవచ్చు.
హారన్ కొట్టనే కొట్టరు
  లంక నిబంధనల ప్రకారం ఏ వాహనమైనా 40 కిలోమీటర్లకు మించి వేగంగా ప్రయాణించేందుకు వీల్లేదు. రోడ్లు ఖాళీగా ఉన్నా సరే, డ్రైవర్లందరూ ఈ నిబంధనను తప్పకుండా పాటిస్తారు. ఇకపోతే ఎంతో అవసరమైతే తప్ప ఏ డ్రైవరూ హారన్ కొట్టడు.      


సముద్రం మధ్యలో ఉండే చిన్న ద్వీపం కాబట్టి, లంక అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుంటాయి. కాబట్టే, ఇక్కడ ఎటు చూసినా ప్రకృతిమాత పచ్చదనంతో మనకు దర్శనమిస్తుంది. ప్రపంచంలో చాలా కాలంపాటు అతిపెద్ద టీ ఎగుమతిదారుగా కూడా శ్రీలంక నిలిచింది. లంక ఎగుమతుల్లో దాదాపు 70 శాతం ఆదాయం టీ, రబ్బరు, కొబ్బరి పంటలనుంచే వస్తుంది.

ఇక చూడాల్సిన పర్యాటక ప్రాంతాల విషయానికి వస్తే... శ్రీలంకకు 150 కిలోమీటర్ల దూరంలో "హబరానా" అనే అటవీ ప్రదేశం చెప్పుకోదగ్గది. ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారు తప్పకుండా వెళ్లాల్సిన చూడచక్కని ప్రాంతమే ఇది. హబరానాలోనే "సిగిరియా" అనే ప్రదేశంలోని క్రీస్తు శకం ఐదో శతాబ్దానికి చెందిన కోట అందాన్ని చూసేందుకు రెండుకళ్లూ చాలవనిపిస్తుంది. 70 హెక్టార్ల ప్రాంతంలో నిర్మితమైన ఈ కోటలో... కొండపైనుంచి కిందికి వచ్చే నీటితో అందమైన పూలతోటలు పెంచి, వాటి మధ్యలో ఫౌంటెయిన్లను ఏర్పాటు చేశారు.

రాజప్రసాదం మాత్రం 200 మీటర్ల ఎత్తు ఉన్న పెద్ద రాయిపై ఉంటుంది. దాదాపు 1350 మెట్లు ఎక్కితే పైకి చేరుకుంటాం. మూడున్నర ఎకరాలకు పైనే ఆ రాజప్రసాదం విస్తరించి ఉండగా... శిథిలమైనవి పోగా రాజు, రాణి భవనాలు, సభా మందిరాల మొండి గోడలు, స్మిమ్మింగ్ ఫూల్, రాతి సింహాసనం లాంటివి మిగిలి ఉంటాయి. రాజభవనం నుంచి చూస్తే కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలించవచ్చు. రాయిమీద ఆనాటి పెయింటింగ్స్ ఇప్పటికీ ఉండటం ఆశ్చర్యం కలిగించక మానదు.

నేటి పరిస్థితీ నిజం.. రేపటి పరిస్థితీ నిజమే...!!
  యుద్ధ బీభత్స వాతావరణం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేని ప్రస్తుత స్థితిలో శ్రీలంక అందాలు గురించి కాస్త ఇబ్బందిగానే అనిపించినా... నేటి పరిస్థితి ఎంత నిజమో, పైన చెప్పుకున్న ప్రదేశాల అందాలు అంతే నిజం. యుద్ధగాయాల నుంచి ప్రజలు కోలుకుని మళ్లీ మామూలు స్థితికి...      
అలాగే 11, 12 శతాబ్దాల కాలంలో లంక రెండో రాజధానిగా విలసిల్లిన "పులనారువ" అనే ప్రాంతం కూడా చూడదగ్గది. 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రదేశానికి పరాక్రమబాహురాజుగా ఉండగా ఓ వెలుగు వెలిగింది. అప్పటికే అక్కడ ఏడంతస్తుల భవనాలు ఉండేవట. ఇక కేవలం 60 గంటలలోనే రెండంతస్తుల భవనాన్ని నిర్మించిన అప్పటి "ఇంజనీరింగ్ అద్భుతం" అవశేషాలను కూడా చూడవచ్చు.

ఇంకా క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన గుహాలయం (కొండను తొలచి గుహల్లో నిర్మించి బుద్ధ దేవాలయం), శ్రీలంక రాజరిక రాజధాని కాండిలు చూడదగ్గ ప్రదేశాలుగా చెప్పవచ్చు. లంకలోని పురాతన, బిజినెస్ సిటీలలో ఒకటయిన కాండీ పట్టణం అంతా సరస్సు చుట్టూ నిర్మితమై ఉంటుంది. కిలోమీటర్ల కొద్దీ చెరువు విస్తరించి ఉంటుంది. ఈ పట్టణం రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఉంటున్నప్పటికీ... చెరువు ఏ మాత్రం కాలుష్యానికి గురికాలేదంటే, పర్యావరణం పట్ల లంక వాసుల కృషి మెచ్చుకోదగ్గదే.

మరో చూడదగిన ప్రదేశం బెనకోట. ఈ ప్రదేశానికి వెళ్లే దారిలో పిన్నవాలా అనే ఏనుగుల శరణాలయం ఉంటుంది. ఎక్కడైనా మందుపాతరలో లేదా ఇతర ప్రదేశాల్లో గాయపడిన ఏనుగులను తీసుకొచ్చి ఇక్కడ పెంచుతుంటారు. ఇక బెనకోట అంటే మన దేశంలోని గోవాలాంటిదన్నమాట. హోటళ్లన్నీ సముద్రం ఒడ్డునే ఉంటాయి. ఇక్కడ నైట్ కార్నివాల్స్ పెద్ద ఎత్తున జరుగుతుంటాయి.

సునామీలో విపరీతంగా నష్టపోయిన గాల్ (గాలె) ప్రాంతం కూడా చూడదగ్గదే. ఈ గాల్ బీచ్ పక్కనే ఒక కోట, దాని ముందు ఓ క్రికెట్ స్టేడియం తదితరాలు ఉంటాయి. గతంలో సిలోన్‌కు గాల్ ముఖ్య రేవు పట్టణంగా కూడా విలసిల్లిందట. ఇక్కడ చేతితో తయారు చేసిన లేసులకు ప్రసిద్ధి. ఈ బీచ్ పక్కనే 90 ఎకరాల విస్తీర్ణంలో గాల్ పోర్ట్ ఉంటుంది.

ఇక చివరిగా లంకవాసుల సామాజిక స్పృహను మెచ్చుకోకుండా ఉండలేం. శ్రీలంక నిబంధనల ప్రకారం ఏ వాహనమైనా 40 కిలోమీటర్లకు మించి వేగంగా ప్రయాణించేందుకు వీల్లేదు. రోడ్లు ఖాళీగా ఉన్నా సరే, డ్రైవర్లందరూ ఈ నిబంధనను తప్పకుండా పాటిస్తారు. ఇకపోతే ఎంతో అవసరమైతే తప్ప ఏ డ్రైవరూ హారన్ కొట్టడు.

ఎంత పల్లెటూరిలో వాహనం వెళ్తున్నా సరే, పిల్లవాడితో సహా బండిపైనుండే అందరూ హెల్మెట్లు ధరిస్తారు. దేశంలోని ఏ గోడలపైనా దాదాపు వాల్ రైటింగులు, పోస్టర్లు లాంటివి కనిపించవు. ఇంకేముంది ఇంతమంచి సామాజిక స్పృహ ఉన్న లంక వాసుల సివిక్ సెన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండగలమా చెప్పండి...!!

అయితే పైన చెప్పుకున్నవన్నీ సుందరమైన శ్రీలంక అందాల గురించి... కానీ నేడు ఆ అందాలు అలాగే ఉన్నాయా, లేదా అన్నది మాత్రం సందేహమే..! ఎందుకంటే ఎల్టీటీఈ తీవ్రవాదులను ఏరివేసే లక్ష్యంతో లంక ప్రభుత్వం చేసిన సైన్యం దాడుల్లో ఊర్లకు ఊర్లే మట్టుబెట్టుకుపోయాయి.

ఎల్టీటీఈ స్వాధీనంలోని తమిళ ప్రాంతాలను లంక ఆధీనంలోకి తెచ్చుకునేందుకు సైన్యం జరిపిన దాడులలో వందలాది వేలాదిమంది ప్రజలు ఆహుతయ్యారు. అయినవాళ్లను, ఆప్తులను పోగొట్టుకుని... ఉన్నఊరును, కన్నవారిని వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శరణార్థులుగా ఇతర దేశాలకు అనేకులు తరలిపోయారు. అయితేనేం ఎట్టకేలకు శ్రీలంక సైన్యం ఎల్టీటీఈపై విజయం సాధించింది. ఎల్టీటీఈ నాయకుడైన వేలుపిళ్ళై ప్రభాకరన్‌ను మట్టుబెట్టి పూర్తిగా తుడిచిపెట్టేసింది.

యుద్ధ బీభత్స వాతావరణం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేని ప్రస్తుత స్థితిలో శ్రీలంక అందాలు గురించి కాస్త ఇబ్బందిగానే అనిపించినా... నేటి పరిస్థితి ఎంత నిజమో, పైన చెప్పుకున్న ప్రదేశాల అందాలు అంతే నిజం. యుద్ధగాయాల నుంచి మెల్లిమెల్లిగా ప్రజలు కోలుకుని మళ్లీ మామూలు జీవనానికి అలవాటు పడుతున్న క్రమంలో, పై ప్రదేశాలు కూడా యధావిధిగా పర్యాటకులను ఆకర్షించక మానవు.