గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Munibabu

మర్చిపోలేని మధురజ్ఞాపకం... ఆగ్రా సందర్శనం

ఉత్తర భారతదేశంలోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో ఆగ్రాను ప్రముఖంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని యమునానదీ తీరాన వెలసిన ఈ నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. ప్రపంచం యావత్తూ చూడాలని తపించే పాలరాతి కట్టడం తాజ్‌మహల్ ఈ నగరానికే చెందినది కావడం విశేషం.

తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ లాంటి పర్యాటక ప్రాంతాలు ఆగ్రాను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చాయి. ఆగ్రాలోని తాజ్‌మహల్, ఆగ్రాకోట, ఫతేపూర్ సిక్రీలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించబడి సంరక్షించబడుతున్నాయి.

నగర చరిత్ర
ఆగ్రా నగరం మొఘలుల పరిపాలనకు ముందు ఎవరి పాలనలో ఉండేది అనే ఆధారాలు తక్కువగా ఉన్నా ప్రపంచ గుర్తింపు వచ్చేలా ఈ నగరాన్ని తీర్చిదిద్దింది మాత్రం మొఘలులనే చెప్పవచ్చు. భారతదేశాన్ని మొఘలులు పాలించిన కాలంలో ఆగ్రాలో పైన పేర్కొన్న ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలెన్నో నిర్మించారు.

ఆగ్రాలోని ప్రముఖ సందర్శక ప్రదేశాలు
ఆగ్రా కోట
యునెస్కో వారసత్వ సంపదగా రక్షించబడుతోన్న ఈ కోటను స్థానికంగా లాల్ ఖిల్లా అంటారు. మొఘల్ రాజ్య చక్రవర్తులైన బాబర్, హుమయున్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబులాంటి వారంతా ఈ కోటలోనే నివశించారు. ఆగ్రా కోట మొఘల్ చక్రవర్తులకు ముందే నిర్మించబడిన ఓ అద్భుత కట్టడం. అయితే రాజపుత్రుల కాలంలో నిర్మించిన ఈ కోట తర్వాత కాలంలో శిధిలావస్థకు చేరుకుంది.


అలాంటి సమయంలో మొఘల్ చక్రవర్తి అక్బరు దీనిని పునర్నించాడు. ఈ కోటను పునర్నిర్మించిన అక్బర్ ఈ కోట యందే నివశించాడు. అనాటి రాజుల అభిరుచులకు అనుగుణంగా నిర్మింపబడిన ఈ కోటలోని ప్రతి ఒక్క కట్టడము ఓ అద్భుతమైన దృశ్యంగా ఉంటుంది. ఒక్కసారి ఈ కోటను సందర్శించినవారు దాని కట్టడ వైభవాన్ని చూసి ముగ్ధులు కాకుండా ఉండలేరు.

తాజ్‌మహల్
మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాలంలో నిర్మించబడిన ఈ సుందర కట్టడం ప్రేమకు నిలువెత్తు సాక్షంగా ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆగ్రాలోని తాజ్‌మహల్ సందర్శనకు ఏటా 20-30 లక్షల మంది విచ్చేస్తారంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏపాటిదో మనం అర్ధం చేసుకోవచ్చు.

తన భారత్య ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం 17వ శతాబ్ధంలో షాజహాన్ నిర్మించిన ఈ ప్రేమ సౌధానికి ఆ కాలంలోనే దాదాపు మూడు కోట్లకు పైగా ఖర్చయ్యిందంటే దీని నిర్మాణం కోసం ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవచ్చు. పర్షియన్, మొఘల్ కళా సంపదల కలయికతో నిర్మించబడిన ఈ సుందర కట్టడం పూర్తికావడానికి దాదాపు 18ఏళ్లు పట్టిందట. దాదాపు ఇరవై వేల మంది శ్రామికులు ఈ కట్టడం కోసం రేయింబవళ్లు శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 1643 నాటికి ఈ కట్టడం పూర్తి రూపు సంతరించుకుంది.

ఫతేపూర్ సిక్రీ
అక్బర్ కాలంలో నివాశయోగ్యంగా నిర్మించబడిన ఓ సుందర నగరమే ఈ ఫతేపూర్ సిక్రీ. అక్బర్ కాలంలో 1571 నుంచి 1585 వరకు ఈ నగరం రాజధానిగా విలసిల్లింది. ఈ నగరాన్ని సందర్శించిన పర్యాటకులకు ఇక్కడ నిర్మించబడిన అనేక కట్టడాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ నగరంలోని బులంద్ దర్వాజా, ఐదు అంతస్థుల పంచమహల్, సలీం చిష్తీ సమాధిలాంటివి చూడదగ్గ ప్రదేశాలు. అద్భుతమైన నగిషీలతో నిర్మించిబడిన ఈ నగరంలో కట్టడ వైభవం అడుగడుగునా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.