గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Ganesh

విశ్వకవికి స్ఫూర్తినిచ్చిన "కారవార" సౌందర్యం..!

FILE
సూర్యుడి లేలేత కిరణాల వెలుగులో స్వచ్ఛంగా, నీలిరంగుతో మెరిసిపోయే జలాలు, బంగారంలా మెరిసిపోయే ఇసుక తిన్నెలు, పక్షులతో పోటీపడుతూ కెరటాల హోరు, ఆ కెరటాలపై ఎగిరెగిరి పడుతుండే పడవలు... ఇలా చెప్పుకుంటే అనంతమైన సముద్ర జలరాశుల సౌందర్యానికి అంతే ఉండదు. కళ్లు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యాన్ని తమలో నింపుకున్న సముద్ర తీరాలు దేశంలోను, ప్రపంచంలోను చాలా ఉన్నాయి.

సముద్ర తీర సౌందర్యంలో కూడా ఏ మాత్రం తీసిపోని కర్ణాటకలో కూడా అనేక సముద్ర తీరాలు మనకు హాయిగా స్వాగతం పలుకుతున్నాయి. ఈ రాష్ట్రంలో 320 కిలోమీటర్ల నిడివితో అరేబియా సముద్ర తీరం అపురూప ప్రకృతి సంపదకు నెలవు. ఈ తీరం వెంబడి ఉన్న కొబ్బరి తోటల ఆహ్లాదంతోపాటు, ఆధ్యాత్మికతను కల్గించే పుణ్యక్షేత్రాలు బోలెడున్నాయి. కర్ణాటకలోని ముఖ్యమైన బీచ్‌లు ఏంటో ఇప్పుడు చూద్దామా..?
కారవార అందం వర్ణణాతీతం...!
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు స్ఫూర్తినిచ్చిన కారవార బీచ్ అందాలు వర్ణణాతీతం. పట్టణానికి ఆనుకుని ఉండే ఈ బీచ్‌లో విహరిస్తుంటే కాలం ఎలా గడుస్తుందో తెలియనంతగా ఉంటుంది. సముద్రం ఒడ్డునే పర్యాటకులను మరింతగా ఆకర్షించే ఉద్యానవనం మరో అద్భుతం. ఈ పార్కులో...


"ఓం బీచ్" దీనినే గోకర్ణ అని పిలుస్తుంటారు. బెంగళూరు నగరానికి 525 కిలోమీటర్ల దూరంలోగల ఈ బీచ్ దేశ విదేశీ పర్యాటకులకు భూతల స్వర్గంలాంటిదేనని చెప్పవచ్చు. ఈ బీచ్‌లో సేదతీరేందుకు విదేశీయులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ సముద్రం ఒడ్డునే పరమశివుడి ప్రాచీన ఆలయం మరో ప్రత్యేక ఆకర్షణ. ఆలయం నుంచి కొండల్ని దాటుకుని వెళ్లే ఓం ఆకారంలో రూపుదిద్దుకున్న బీచ్‌లో సేదతీరితే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని సందర్శకుల అభిప్రాయం.

ఈ బీచ్‌కు సందర్శకుల రద్దీ, పర్యాటకుల సంఖ్య అధికం కావటంతో దానికి సమీపంలోనే అనేక ప్రైవేట్ రిసార్టులు రూపుదిద్దుకున్నాయి. ఇవి అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉంటాయి. వీటితోపాటు గోకర్ణలో తక్కువ రేటులోనే గదులు లభ్యమవుతాయి. బెంగళూరు నుంచి గోకర్ణకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు.. ప్రైవేట్ బస్సుల సదుపాయం కూడా ఉంది. అయితే ఈ బీచ్ లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పర్యాటకులు జాగ్రత్తలతో మసలుకోవటం శ్రేయస్కరం.

"మురుడేశ్వర బీచ్" కర్ణాటలో మరో పేరెన్నికగల బీచ్. ఈ సముద్రం ఒడ్డునే ధ్యానముద్రలో ఉండే పరమేశ్వరుడి విగ్రహం సుదూరం నుంచే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి రాజగోపురం దేశంలోనే అతి ఎత్తైనదిగా రికార్డు సృష్టించింది. కర్ణాటకలోని ఇతర బీచ్‌లతో పోల్చినట్లయితే ఈ బీచ్‌ను అత్యంత సురక్షితమైనదిగా చెప్పవచ్చు. సముద్రంలో 40 అడుగుల వరకు వెళ్లినా ప్రమాదం ఉండదు కాబట్టి.. ఇక్కడికి వచ్చేందుకే పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

FILE
ఇక్కడి పరమశివుడి విగ్రహం దిగువ భాగంలోగల "భూకైలాస్ ఘట్టాన్ని" వివరించే విగ్రహాలు, ఉద్యానవనం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అరేబియా సముద్రం మాటుకు దాగిపోయే సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తపిస్తుంటారంటే అతిశయోక్తి కాదు. బెంగళూరు నుంచి 386 కిలోమీటర్ల దూరంలోని మురుడేశ్వరలో బస చేసేందుకు అతిథి గృహాలు, రిసార్టులు అందరికీ అందుబాటులో ఉంటాయి.

"మల్పె బీచ్" మరో కర్ణాటకలోని సుందరమైన బీచ్. ప్రముఖ ధార్మిక క్షేత్రం ఉడుపికి అత్యంత సమీపంలో ఉన్న ఈ మల్పె బీచ్‌లో విహరిస్తుంటే కాలమే తెలియదని చెబుతుంటారు. ఇటీవలనే ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్‌ మరో ప్రత్యేక ఆకర్షణ. మల్పె బీచ్‌నుంచి సముద్రంలో 20 నిమిషాలు ప్రయాణిస్తే "సెయింట్ మేరీస్" ద్వీపానికి చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి 392 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఉడుపి చేరుకోవచ్చు. బస చేసేందుకు ఇక్కడ హోటళ్లు, కృష్ణ మఠం అతిథి గృహాలు ఆశ్రయం కల్పిస్తాయి.

"మంగళూరు (పణంబూర్) బీచ్". ఇది ఇతర బీచ్‌లతో పోలిస్తే కాస్తంత ప్రమాదకరమైనదిగా చెబుతుంటారు. సముద్రం నుంచి అలల తాకిడి అధికంగా ఉండే ఈ బీచ్‌ను చూడాలని పర్యాటకులు తపించిపోతుంటారు. మంగళూరులో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఈ పణంబూర్ బీచ్‌ను సందర్శించకుండా వెళ్లరు. అయితే సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండే ఈ బీచ్‌ను ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నారు.

ఇక చివరగా చెప్పుకోవాల్సింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు స్ఫూర్తినిచ్చి "కారవార బీచ్" గురించి. ఈ బీచ్ అందాలు వర్ణణాతీతం. పట్టణానికి ఆనుకుని ఉండే ఈ బీచ్‌లో విహరిస్తుంటే కాలం ఎలా గడుస్తుందో తెలియనంతగా ఉంటుంది. సముద్రం ఒడ్డునే పర్యాటకులను మరింతగా ఆకర్షించే ఉద్యానవనం మరో అద్భుతం. ఈ పార్కులో ప్రదర్శించే యుద్ధ ట్యాంకు అదనపు ఆకర్షణ. బెంగళూరు నుంచి 525 కిలోమీటర్ల దూరం ప్రయాణంచినట్లయితే కారవార చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు.