సంబంధిత వార్తలు
- ఐపీఎల్ మ్యాచ్‌లకు కఠిన నిబంధనలు.. స్మార్ట్ సన్ గ్లాసెస్ ధరించడంపై నిషేధం
- నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు
- ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు
- భాష అనేది ఒక చాయిస్ మాత్రమే.. బలవంతంగా రుద్దలేం...
- ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టే అధికారం ఈసీకి ఉంది : సుప్రీంకోర్టు
వినేశ్ ఫోగట్ దేశానికి గర్వకారణం : సుప్రీంకోర్టు
భారత స్టార్ రెజ్లర్, మూడుసార్లు ఒలింపియన్ దేశానికి ప్రాతినిథ్యం వహించిన వినేశ్ ఫోగట్‌పై సుప్రీంకోర్టు ప్రశంసల వర్షం కురిపించింది. ఆమె దేశానికి గర్వకారణమని అన్నారు. పైగా, 2026 ఏషియన్ గేమ్స్ కోసం ఈ నెల 30, 31వ తేదీల్లో జరుగనున్న సెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు అనుమతిచ్చింది. ఈ విషయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఎస్ఐ) దాఖలు చేసిన పిటిషనుపై విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వినేశ్ ఫోగట్‌కు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని గత వారం ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మాతృత్వం అనేది ఒకరి వృత్తిపరమైన అవకాశాలను అడ్డుకునే వైకల్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సమాఖ్య నిబంధనల ప్రకారం వినేశ్‌కు అర్హత లేదని వాదిస్తూ డబ్ల్యూఎఫ్ఎస్ఐ, ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది.
ఈ పిటిషనుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "ఆమె స్థానంలో వేరే ఎవరైనా ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ, వినేశ్ దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారిణి" అని ధర్మాసనం అభిప్రాయపడింది. "హైకోర్టు తీర్పుతో ఆమెలో ఆశలు, అంచనాలు పెరిగాయి. ఈ దశలో మేం ఏమీ చేయలేమని చెప్పి ఆమెను వెనక్కి పంపడం సరికాదు" అని డబ్ల్యూఎఫ్ఎస్ఐ తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది.
అయితే, వినేశ్‌కు తాత్కాలికంగా అనుమతి ఇస్తూనే, క్రీడా వ్యవహారాల్లో హైకోర్టులు తరచుగా, అత్యంత వేగంగా జోక్యం చేసుకోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "ఇవి మెడికల్ కాలేజీ అడ్మిషన్లు కాదు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించినవి. ఈ పద్ధతిలో కోర్టులు జోక్యం చేసుకొని, మొత్తం షెడ్యూల్‌ను దెబ్బతీయలేవు" అని జస్టిస్ నరసింహ వ్యాఖ్యానించారు.
అయితే, ప్రస్తుతానికి వినేశ్‌కు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు, డబ్ల్యూఎఫ్ఎస్ఐ దాఖలు చేసిన పిటిషనుపై పూర్తిస్థాయి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ పిటిషనుపై సమాధానం ఇవ్వాల్సిందిగా వినేశ్ ఫోగట్‌ను ఆదేశించింది.
