కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో ప్రతీకాత్మక చిత్రం
ఫంక్షన్ చేసుకోవాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిందంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో ఖర్చుల గురించి కాదు... ఆ కార్యక్రమం జరుగుతుండగానే కొంతమంది హిజ్రాలు వచ్చి తాము అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తుండటమేనంటున్నారు. వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఇంటి ముందే తిష్ట వేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా నానా దుర్భాషలతో చప్పట్లు కొడుతూ ఇక చాలు బాబోయ్ అనేంతగా చేసేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో జరుగుతున్నట్లు పలు వార్తల ద్వారా తెలుస్తోంది. తాజాగా హైదరాబాదు జిల్లా కీసరలో హిజ్రాలు బీభత్సం సృష్టించారు.
కీసర మండలం చీర్యాల శ్రీబాలాజీ ఎంక్లేవులో నివాసం వుంటున్న సదానందం అనే వ్యక్తి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. దానిపై కన్నేసిన ఇద్దరు హిజ్రాలు అక్కడికి వచ్చి... కొత్త ఇల్లు కట్టావు కదా, మాకు లక్ష రూపాయలు ఇవ్వు అంటూ డిమాండ్ చేసారు. తను ఇవ్వలేనంటూ సదానందం తేల్చి చెప్పేసాడు. దాంతో ఆ ఇద్దరు తిరిగి వెళ్లి ఏకంగా ఆటో వేసుకుని ఓ గ్యాంగ్ మాదిరిగా అతడి ఇంటికి వచ్చారు.
మొత్తం 15 మంది హిజ్రాలు సదానందం ఇంటి గేటును వచ్చీ రావడం తోటే ధ్వంసం చేసేందుకు యత్నించగా సదానందం ఆయన కుటుంబ సభ్యులు దాన్ని అడ్డుకున్నారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకుండా ఎదురుతిరుగుతావా అంటూ కర్రలు, రాళ్లు తీసుకుని సదానందంపై మూకుమ్మడి దాడి చేసారు. వీరి దాడిలో సదానందం తల పగిలింది. రక్తం కారుతుండటంతో కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేసారు. దాంతో ఇరుగుపొరుగువారు అక్కడికి రావడంతో హిజ్రాలు ఆటో ఎక్కి అక్కడి నుంచి పారిపోయారు. తనపై హిజ్రాలు చేసిన దాడి గురించి సదానందం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.