1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. ap bjp vice president Vishnu Vardhan Reddy fire on telangana congress mla mandula samel

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

vishnu vardhan reddy
తెలంగాణ రాష్ట్రంలో బతకాలంటే ప్రత్యేక పాస్ పోర్టు కావాలా అంటూ ఏపీ బీజేపీ శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఇలా ప్రశ్నించడానికి కారణం లేకపోలేదు. ఇటీవల రాజకీయ విశ్లేషకుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేల్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై నోరు పారేసుకున్నారు. దీంతో ఈ వివాదం మరింత ఎక్కువైంది. 
 
కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. 'తెలంగాణలో బతకాలంటే ప్రత్యేక పాస్ పోర్ట్, వీసా ఏమైనా కావాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు?' అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 
 
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి 'వెంటనే జూబ్లీహిల్స్ వదిలి వెళ్లిపోవాలి' అంటూ బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలని తెలంగాణ డీజీపీని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకే ఇలాంటి బహిరంగ బెదిరింపులు వస్తే, ఇక తెలంగాణలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఇది ఐదు కోట్ల మంది ఆంధ్రులను అవమానించడమేనని అన్నారు. తెలంగాణ ప్రజలు అందరినీ ప్రేమించే వారని, కానీ కొందరు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మూడు రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారంటూ ప్రచారం జరిగింది. దీనిపై కొందరు జర్నలిస్టులతో కలిసి తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించారు. 
 
చంద్రబాబు, పవన్‌లకు హైదరాబాద్ నగంరలో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ మేధావులపై అరాచకాలు సాగవని హెచ్చరించారు. బతకడానికి తెలంగాణకు వచ్చిన వారు పద్ధతిగా ఉండాలని, పెత్తనం చెలాయిస్తామంటే ఊరుకునేది లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రా నేతలకు వ్యతిరేకంగా పోరాటం వస్తుందని ఆయన హెచ్చరించడంతో ఈ వివాదం ముదిరింది. 
About Writer
ఠాగూర్