తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ : బీజేపీ చీఫ్ నితిన్ నబిన్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ (ఆర్ఆర్) అమలు వసూలు చేస్తున్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప్ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. 'నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఈ గడ్డ నుంచి పోరాడారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. ఎన్నికల హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు.
అలాగే, రైతు భరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలను ప్రభుత్వం మోసం చేసింది. అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు ఆర్‌ఆర్ ట్యాక్స్ కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అవినీతి, కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే భాజపాను గెలిపించాలి. తెలంగాణకు సముచిత స్థాయిలో కేంద్రం నిధులు మంజూరు చేస్తోందన్నారు. రాష్ట్రంలో రైల్వేకు రూ.5,400 కోట్లకుపైగా కేటాయించింది. తెలంగాణకు మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు కేటాయించింది.
రాష్ట్రంలో రెండు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం పట్ల ఆదరణ పెరుగుతోంది. ఈయూతో ఒప్పందం చేసుకుని దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. కొన్నివర్గాలను సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో బలహీనవర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత పెడుతోంది.
వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు యత్నిస్తోంది. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపట్లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయ భూములు ఆక్రమిస్తున్నారు. రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను సహించం అని నితిన్ నబీబ్ అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు.