సిట్ విచారణ సీరియల్ లా మారింది... : కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అని, సిట్ విచారణ సీరియల్ లా మారిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు సిట్ అధికారులు నోటీసులు పంపించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, కాళేశ్వరం స్కామ్, ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారంటూ మండిడ్డారు. 'సీఎం బావమరిది బొగ్గు స్కామ్‌ను హరీశ్‌రావు బయటపెట్టారు. ఉదయం కుంభకోణం బయటపెడితే సాయంత్రానికి నోటీసులు వచ్చాయి.
రేవంత్‌రెడ్డి సిట్ అంటే... సిట్, స్టాండ్. సిట్ విచారణ సీరియల్ లా మారింది. ఆర్‌ఆర్ ట్యాక్స్, బొగ్గు కుంభకోణంపై మాత్రం సిట్ ఉండదు. ఏదో రూపంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాదు.. అసమర్థ పాలన. మేము ఏ తప్పూ చేయలేదు.. ఎవరికీ భయపడేది లేదు. కేవలం రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
సిట్ విచారణకు ఖచ్చితంగా హాజరవుతా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధంలేని నేతలను ప్రశ్నించారు. సిట్ అధికారులను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతా. నా ఫోన్ ట్యాప్ అవుతుందా? అని సిట్ అధికారులను అడుగుతా. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేయవు.. పోలీసు వ్యవస్థ చేస్తుంది. పోలీస్ ఉన్నతాధికారులుగా ఉన్న శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి వంటి అధికారులను ప్రశ్నించట్లేదు. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ప్రమాణం చేసి చెబుతారా? కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెబితే ఖండించలేదు, నా ఫోన్ ట్యాప్ చేయడం లేదని పోలీసులను అడుగుతా, నేను అడిగే ప్రశ్నలకు పోలీసులు బదులిస్తారా అని కేటీఆర్ అన్నారు.